CM Revanth Reddy: ఈ మూసీని ప్రక్షాళన చేయకపోతే నా జన్మ దండగ: సీఎం రేవంత్

భువనగిరి జిల్లా: కమీషన్ల కోసమే మూసీ ప్రాజెక్టు చేపట్టానని బీఆర్ఎస్ అంటోందని, ఈ మూసీని ప్రక్షాళన చేయకపోతే తన జన్మ దండగ అని రేవంత్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. మూసీ నది విషంగా మారిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మూసీ నల్గొండ ప్రాంతానికి ఒకనాడు వరం అని, ప్రస్తుతం నల్గొండను ఓ వైపు ఫ్లోరైడ్, మరోవైపు మూసీ పీడిస్తోందని చెప్పారు.

ఈ ప్రాంతంలో గౌడన్నలు కల్లు అమ్ముకునే పరిస్థితి లేదని, మూసీ నదిఒడ్డున పెంచే గొర్రె మాంసాన్ని కొనే పరిస్థితి లేదని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన చెందారు. ఇక్కడ గేదె, ఆవు పాలను కొనే పరిస్థితి లేదని తెలిపారు. బాధిత రైతుల బాధలు స్వయంగా తెలుసుకున్నానని, మూసీ కింద కూరగాయ రైతులు వ్యవసాయం బంద్ చేసుకున్నారని సీఎం చెప్పారు. ఇక్కడ నుంచి ప్రతి కులవృత్తి వలస వెళ్లిందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.

Also Read:-బుల్డోజర్లు ఎక్కించి మరీ మూసీ ప్రాజెక్టు చేపడుతాం...

బీఆర్ఎస్ కు దోచుకోవడమే తప్ప మేలు చేయడం తెలియదని గత పాలకుల నిర్లక్ష్యంపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ నది హైదరాబాద్ కు అణుబాంబు కంటే ప్రమాదం అని రేవంత్ రెడ్డి చెప్పారు. మన నగరాన్ని విధ్వంసం చేస్తుంటే రాజకీయాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. మూసీ నది వరంగా మారాల్సింది శాపంగా మారితే బాగుచేయొద్దా అని సీఎం నిలదీశారు.