సీఎం పాదయాత్రకు తరలిరండి

  •  ఎంపీ కిరణ్​కుమార్​రెడ్డి

యాదాద్రి, వెలుగు: మూసీ పునరుజ్జీవం కోసం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న పాదయాత్రకు మద్దతుగా అన్నివర్గాల ప్రజలు తరలిరావాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​ రెడ్డి కోరారు. ఈ నెల 8న వలిగొండ మండలం సంగెం వద్ద మూసీని సీఎం రేవంత్​రెడ్డి పరిశీలించనుండగా, బుధవారం పాదయాత్ర ఏర్పాట్లు, సీఎం నడిచే దారిని వారు పరిశీలించి మాట్లాడారు. కాలుష్యమయమైన మూసీని ప్రక్షాళన చేసి పునరుజ్జీవం చేయడానికి సీఎం కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. దీంతో రైతులు, మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారని, ఉపాధి కోల్పోతున్నారని తెలిపారు. ఇక్కడ పండిన పంటలు, చేపలు కూడా ఎవరూ తినలేని పరిస్థితి నెలకొందన్నారు. గతంలో మూసీ ప్రక్షాళన చేస్తామని చెప్పిన బీఆర్ఎస్​ కూడా ఇప్పుడు వ్యతిరేకిస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా మూసీ ప్రక్షాళన కోసం సీఎం చేస్తున్న కృషికి మద్దతు ఇవ్వాలని కోరారు.