ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలి..అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం

  • ట్రిపుల్ ​ఆర్, మెట్రో విస్తరణ, మూసీ రివర్ ​ఫ్రంట్​తో రియల్​ ఎస్టేట్​కు ఊపు
  • జీఎస్టీ రాబడి ఆడిటింగ్​ పక్కాగా ఉండాలి
  • పన్ను ఎగ్గొట్టేవాళ్లను గుర్తించాలి
  • కమర్షియల్​ ట్యాక్స్​ ఆదాయం ఎందుకు తగ్గింది?
  • మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు కృషి చేయాలని అధికారులను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు ఆయా శాఖలు ముందుకు వెళ్లాలని సూచించారు. ఎక్కడెక్కడ ఇబ్బందులున్నాయో గుర్తించి సరిచేసుకోవాలన్నారు. రాష్ట్రంలో జీఎస్టీలో ఎంట్రీ కాకుండా చాలామంది వ్యాపారులు కోట్ల రూపాయల బిజినెస్​ చేస్తున్నారని.. అటువంటి వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వార్షిక లక్ష్యాలకు తగ్గట్టు ఆదాయ సమీకరణపై వివిధ శాఖల అధికారులతో సీఎం రేవంత్​రెడ్డి జూబ్లీహిల్స్​లోని తన నివాసంలో గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డితో కలిసి సమీక్షించారు. ఆదాయం తెచ్చి పెట్టే వనరులపై, పన్నుల వసూళ్లపై నిక్కచ్చిగా ఉండాలన్నారు. సంబంధిత విభాగాన్ని అవసరమైతే పునర్​వ్యవస్థీకరించుకోవాలని, ఆదాయం రాబట్టేందుకు వీలైనన్ని సంస్కరణలు చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. 

లీకేజీలు ఉండొద్దు

ఏయే శాఖల్లో ఆశించిన మేర రాబడి రావట్లేదనే దానిపై సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. ఇందులో కమర్షియల్​ ట్యాక్స్​కు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.85,126 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంట్లో ఏప్రిల్​ నుంచి మొన్నటి సెప్టెంబర్​ వరకు రూ. 42,034 కోట్లు ఆదాయం రావాల్సి ఉంది. అయితే ఇందులో రూ.37,315 కోట్లు మాత్రమే వచ్చింది. ఏకంగా రూ.4,719 కోట్లు తక్కువగా వచ్చింది. ఎనిమిది నెలల్లో నెలకు యావరేజ్​గా రూ. 600 కోట్ల మేర తగ్గడంపై సీఎం రేవంత్​ సీరియస్​ అయినట్లు సమాచారం.

ఎక్కడ సమస్య వస్తున్నదో చూడాలన్నారు. అంతకంతకు పెరగాల్సిన కమర్షియల్​ ట్యాక్స్​ రాబడి తగ్గడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. జీఎస్టీ రాబడి  పక్కాగా ఆడిటింగ్ చేయాలని సీఎం ఆదేశించారు. జీఎస్టీ చెల్లింపుల విషయంలో ఎవరినీ ఉపేక్షించకుండా, నిక్కచ్చిగా పన్ను వసూలు చేయాలన్నారు. కమర్షియల్​ ట్యాక్స్​ ఆదాయంలో ప్రధానంగా జీఎస్టీ, పెట్రోలియం, వాటి ఉత్పత్తులపై వ్యాట్​,  లిక్కర్​ వ్యాట్​ ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా జీఎస్టీలో రూ. 4086 కోట్ల ఆదాయం తగ్గింది. పెట్రోలియం ఉత్పతులకు సంబంధించి రూ.654 కోట్లు తక్కువగా వచ్చింది. దీంతో జీఎస్టీ ఎగవేతలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

ఎక్కడ లీకేజీలు లేకుండా చూసుకోవాలని.. పన్ను ఎగవేతదారులను గుర్తించాలన్నారు. దీంతో పాటు రాష్ట్రంలో జీఎస్టీలో ఎంట్రీ కాకుండా చాలామంది కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్నారని.. అటువంటి వారిని కూడా గుర్తించాలని చెప్పారు. దీంతో ఆదాయం ఇంకింత పెరిగేందుకు అవకాశం ఉంటుందని అధికారులకు సూచించారు. మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను అరికట్టాలని చెప్పారు. డిస్టిలరీస్ నుంచి మద్యం అడ్డదారి పట్టకుండా నిఘా పెట్టాలని సూచించారు. 

ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి

రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్​మెంట్ ప్రాజెక్టులతో  రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని.. అయితే ఇది క్షేత్రస్థాయిలో సరిగ్గా ప్రచారం కాలేదని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాలను స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అప్పుడే ఏం చేయబోతున్నామనే దానిపై ప్రజలకు స్పష్టత ఉంటుందని పేర్కొన్నారు. గందరగోళానికి తావు లేకుండా చేయాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని ఆయన అన్నట్లు తెలిసింది.

ఎఫ్ టీఎల్​లో ఉన్న అక్రమ నిర్మాణాలనే హైడ్రా కూల్చేసిందని.. అలాంటప్పుడు అన్ని సక్రమంగా ఉన్న భూములకు ఇంకింత విలువ పెరిగి.. రిజిస్ట్రేషన్లు పెరగాల్సి ఉండగా తగ్గడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అసలు మూసీలో రివర్​ బెడ్​లో ఉన్న గుడిసెలు, ఇతర నిర్మాణాలను తీసేస్తున్నామని.. దీనికి రిజిస్ట్రేషన్లకు ముడి ఎందుకు పడుతున్నదని ఆయన అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. ఇలాంటి గందరగోళాలు రాకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న ఆర్​ఆర్​ఆర్​, మెట్రో విస్తరణ, ఫోర్త్​ సిటీ, రాష్ట్రానికి వస్తున్న ఇన్వెస్ట్​మెంట్లు, కొత్త ఎయిర్​పోర్టులు వంటివి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఇక ఇసుక, ఖనిజ వనరుల ద్వారా వచ్చే ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణాను, లీకేజీలను అరికట్టాలని సంబంధిత అధికారులను సీఎం రేవంత్​ ఆదేశించారు.

అధికారులు ప్రణాళికలతో రావాలని, రాబడిపై మరోసారి రివ్యూ చేస్తానని ఆయన చెప్పినట్లు తెలిసింది. ఇక అదనపు ఆదాయ మార్గాలపై సమీక్షలో చర్చించారు. అయితే దీనిపై సపరేటుగా  సమావేశమవుదామని నిర్ణయించారు. మీటింగ్​లో సీఎస్​ శాంతికుమారి, స్పెషల్​ సీఎస్ లు రామకృష్ణారావు, వికాస్​రాజ్, మైనింగ్​ ప్రిన్సిపల్​ సెక్రటరీ సురేంద్ర మోహన్, కమర్షియల్​ ట్యాక్స్​ సెక్రటరీ రిజ్వీ, స్టాంప్స్​ అండ్​ రిజిస్ట్రేషన్స్​ సెక్రటరీ జ్యోతి బుద్ధప్రకాశ్, సీఎం ప్రిన్సిపల్​ సెక్రటరీ శేషాద్రి, టీఎస్​ఎండీసీ ఎం.డీ. మల్సూర్​  తదితరులు పాల్గొన్నారు.

దసరా తర్వాత కులగణన

హైదరాబాద్, వెలుగు: దసరా తర్వాత కులగణన ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. కులగణనను విజయవంతం చేసేందుకు అన్ని బీసీ సంఘాలు సహకారం అందించాలని కోరారు. గురువారం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కులగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై సీఎంకు నేతలు కృతజ్ఞతలు తెలిపారు. కులగణనపై సుమారు 30 నిమిషాల పాటు నేతలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హామీ మేరకు కులగణన పూర్తి చేసి, బీసీ రిజర్వేషన్లు పెంచుతామని తెలిపారు. ఆ తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ‘‘కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేశాం. బీసీ కమిషన్ ఏర్పాటు చేసి కులగణనకు ఎలాంటి అవరోధాలు, న్యాయపరమైన చిక్కులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. కులగణనను విజయవంతం చేసేందుకు బీసీ సంఘాలు సహకారం అందించాలి. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలి” అని కోరారు. రాష్ట్రంలో చేపడుతున్న కులగణన చరిత్రలో నిలిచిపోతుందన్నారు. 

సహకారం అందిస్తాం: జాజుల 

కులగణన చేపట్టాలని తాము ఆరు నెలలుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రభుత్వం స్పందించి కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. ‘‘ప్రభుత్వ నిర్ణయాన్ని బీసీ సమాజం మొత్తం స్వాగతిస్తున్నది. కులగణన చేసి బీసీ రిజర్వేషన్లు పెంచాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని అర్థమవుతున్నది.

సీఎం సూచించిన మేరకు కులగణనను విజయవంతం చేయడానికి సహకారం అందిస్తాం. మేధావులతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందిస్తాం” అని తెలిపారు. సమావేశంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి, బీసీ మేధావుల ఫోరం కన్వీనర్ చిరంజీవులు, జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్ చారి తదితరులు పాల్గొన్నారు.