ముస్తాబవుతున్న కొండారెడ్డిపల్లి .. దసరాకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి

  • గ్రామస్తులతో అలయ్​ బలయ్​​ అభివృద్ది పనులకు ప్రారంభోత్సవం

నాగర్​కర్నూల్, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి ముస్తాబవుతోంది. దసరా పండగకు కుటుంబంతో స్వగ్రామానికి వచ్చే ఆనవాయితీ పాటించే రేవంత్​రెడ్డి ఈ సారి సీఎం హోదాలో తొలిసారి సొంతూరుకు రానున్నారు. సీఎం రాక సందర్బంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ, కలెక్టర్​ బదావత్​ సంతోష్​, కొండారెడ్డిపల్లి నోడల్​ ఆఫీసర్​ డాక్టర్​ రమేశ్, సీఎం సోదరుడు ఎనుముల కృష్ణారెడ్డి, మాజీ జడ్పీటీసీ కేవీఎన్​ రెడ్డి తదితరులు ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. హెలీప్యాడ్​ నిర్మాణంతో పాటు కొండారెడ్డిపల్లి గ్రామానికి మంజూరైన వివిధ అభివృద్ది పనులను కలెక్టర్​ రెగ్యులర్​గా సమీక్షిస్తున్నారు. మూడు రోజుల కింద కొండారెడ్డిపల్లి గ్రామానికి  సీఎం సతీమణి గీత వచ్చివెళ్లారు.

సోలార్​ విద్యుత్​ పైలట్​ ప్రాజెక్ట్​ కింద ఎంపిక కావడంతో గ్రామంలోని ప్రతి ఇంటికి రూఫ్​టాప్​ సోలార్​ ప్యానెల్స్​ ఏర్పాటు చేస్తున్నారు. కొత్త గ్రామ పంచాయితీ భవనం, లైబ్రరీ, కమ్యూనిటీ హాల్స్​ నిర్మాణం పూర్తి కావచ్చింది. గ్రామ పంచాయతీ భవనానికి సీఎం ఫ్యామిలీ స్థలాన్ని సేకరించి విరాళంగా అందజేసింది. ఈ స్థలంలో సీఎం తండ్రి స్వర్గీయ ఎనుముల నర్సింహారెడ్డి స్మారక గ్రామ పంచాయతీ భవనం నిర్మించారు. దివంగత ఆర్మీ జవాన్  యాదయ్య స్మారకార్థం రూ.55లక్షలతో లైబ్రరీ నిర్మించారు.

 రూ.45 లక్షలతో వెటర్నరీ హాస్పిటల్, రూ.70 లక్షలతో బీసీ కమ్యూనిటీ హాల్, రూ.39 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్,​ రెనోవేషన్, రూ.25 లక్షలతో బల్క్​ మిల్క్  కూలింగ్​ సెంటర్, మాడ్రన్​ బస్​ షెల్టర్, పార్క్, ఓపెన్​ జిమ్, రైతు వేదిక పునరుద్ధరణ, రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. డెవలప్​మెంట్​ వర్క్స్​కు తుది మెరుగులు దిద్ది దసరా రోజు సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు 
కసరత్తు చేస్తున్నారు.