యూనివర్సిటీలను గాడిన పెట్టండి...దెబ్బతిన్న వ్యవస్థలను పునరుద్ధరించండి: సీఎం రేవంత్​

  • క్యాంపస్​లోకి డ్రగ్స్​, గంజాయి రాకుండా చూడాలని వీసీలకు సూచన

హైదరాబాద్, వెలుగు: గత పదేండ్లలో యూనివర్సిటీల్లో అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయని,  వాటిని ప్రక్షాళన చేయడం ద్వారా  వర్సిటీలపై విద్యార్థుల్లో నమ్మకం పెంచాలని వైస్​ చాన్స్​లర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. యూనివర్సిటీల్లో అధ్యయనం కోసం అవసరమైతే కన్సల్టెన్సీలను నియమించుకోవాలని తెలిపారు. ఇటీవల నియమితులైన  వర్సిటీల వీసీలతో  శనివారం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఇందులో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్​ బాలకృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ పురుషోత్తం,  సీఎం సలహాదారు  వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీల పరిస్థితులపై వీసీలను సీఎం రేవంత్​ అడిగి తెలుసుకున్నారు.  

గంజాయి, డ్రగ్స్​ను అడ్డుకోవాలి 

ఒకప్పుడు వర్సిటీలు సమాజానికి దిక్సూచిలా, వీసీలు విద్యార్థులకు ఆదర్శంగా ఉండేవారని, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని సీఎం రేవంత్​ అభిప్రాయపడ్డారు.  ‘‘ఒకప్పుడు యూనివర్సిటీల్లో చదివిన విద్యార్థులు వీసీలను ఏండ్లపాటు గుర్తుపెట్టుకునేవాళ్లు.  కానీ క్రమంగా ఆ పరిస్థితి పోయింది. అందుకే గతానికి భిన్నంగా ఏరకమైన ఒత్తిళ్లకు లోనుకాకుండా వీసీలను కేవలం మెరిట్, సామాజిక సమీకరణాల ఆధారంగా ఎంపిక చేశాం.. మీపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండి.

 వర్సిటీలపై విద్యార్థులకు నమ్మకం కలిగించేలా, సమాజంలో  వర్సిటీల  గౌరవం పెరిగేలా పనిచేయండి’’ అని సూచించారు. మంచి పని చేయడానికి వీసీలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని, అందుకు ప్రభుత్వం తరఫున సంపూర్ణ  సహకారం అందిస్తామని తెలిపారు. అలాకాకుండా ఏదైనా తప్పు చేస్తే మాత్రం  ప్రభుత్వం నుంచి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని సున్నితంగా హెచ్చరించారు. వర్సిటీలను విద్య, ఉపాధి కేంద్రాలుగా తీర్చిదిద్దాలని, డ్రగ్స్, గంజాయి లోపలికి రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ..  అవసరమైనవాళ్లకు  కౌన్సిలింగ్ ఇచ్చే ఏర్పాట్లు చేయాలని  వీసీలకు సీఎం దిశానిర్దేశం చేశారు.