డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత

డ్రగ్స్ మహమ్మారిని తుదముట్టించేందుకు తెలంగాణ సీఎం రేవంత్​ రెడ్డి తీసుకుంటున్న చర్యలు ఎంతైనా అభినందనీయం. కాంగ్రెస్​  ప్రభుత్వం అధికారంలోకి రాగానే   డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రతినబూనిన తీరు రేవంత్​ ఉక్కు సంకల్పానికి నిదర్శనం.  అధికార యంత్రాం గాన్ని కార్యోన్ముఖులను చేయడంతో.. ఎక్కడికక్కడ మాదక ద్రవ్యాలను అరికట్టడానికి ప్రభుత్వ సిబ్బంది ముందుకు కదులుతోంది. నిజానికి పాలకులు చాలా అంశాల్లో మాటలు చెప్పడం క్రమంగా వాటిని మరుగున పడేయడం సర్వసాధారణంగా చూస్తుంటాం . కానీ, సీఎం రేవంత్ రెడ్డి తన చిత్తశుద్ధిని డ్రగ్స్ సీజ్​​ విషయంలో నిరూపించుకుంటున్నారు. 

సమాజాన్ని పట్టి పీడిస్తున్న మాదకద్రవ్యాల పీచమణిచేందుకు రాష్ట్ర యాంటీ నార్కొటిక్స్ బ్యూరో ద్వారా రేవంత్ సర్కార్  ప్రయత్నిస్తోంది. హైదరాబాద్‌‌లో  డ్రగ్స్ సరఫరా చేసే నేరగాళ్లను కటకటాల్లోకి పంపడమే లక్ష్యంగా ముందడుగు వేస్తోంది సర్కార్. రాష్ట్రంలో నార్కొటిక్ పోలీస్‌‌ స్టేషన్లు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో ప్రభుత్వంఉండటం అభినందనీయం. టీజీ న్యాబ్ నార్కొటిక్ ఠాణాలు  సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్, వరంగల్‌‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.  ప్రస్తుతం ఎక్సైజ్ సహా సాధారణ పోలీస్‌‌ స్టేషన్లలో డ్రగ్స్ విక్రయం, సరఫరా, వినియోగంపై  కేసులు  నమోదు చేస్తున్నారు. ఇక నుంచి వాటితోపాటు నార్కొటిక్ పోలీస్​ స్టేషన్లలో కేసులు నమోదు చేయనున్నాయి. సాధారణ స్టేషన్లలో కేసు తీవ్రతని బట్టి టీజీ న్యాబ్ దర్యాప్తు చేయనుంది. పరిస్థితిని బట్టి కేసుని నార్కొటిక్‌‌ ఠాణాకి బదిలీచేసే అవకాశం ఉంది. ఈ చర్యలన్నీ చూస్తుంటే డ్రగ్స్ నియంత్రణపై సీఎం రేవంత్ సర్కార్​ చాలా సీరియస్​గా పని చేస్తున్నదని చెప్పాలి.

గత ప్రభుత్వ హయాంలో పెరిగిన డ్రగ్స్​ వినియోగం

రాష్ట్రంలో గడిచిన పది సంవత్సరాల్లో డ్రగ్స్, మాదక ద్రవ్యాల  వినియోగం బాగా పెరిగాయని నమోదైన  కేసుల సంఖ్యను బట్టిచూస్తే ఎవరికైనా అర్థం అవుతోంది. గత సర్కార్​లోని పెద్దల అండదండతో వారి బంధువులు విచ్చలవిడిగా పబ్​ల్లో డ్రగ్స్ వినియోగం జరిగిందని గడచిన దశాబ్ద కాలం ప్రతిపక్షాలు రోడ్లెక్కిన సంఘటనలు అనేకం మనం చూశాం. ప్రస్తుత ముఖ్యమంత్రి.. పీసీసీ అధ్యక్షుడి హోదాలో  నేరుగా కేసీఆర్ కుటుంబంపైనే ఆరోపణలు చేసిన సందర్భాలను చూశాం. కేటీఆర్​పై నేరుగా ఆరోపణలు చేసి .. డ్రగ్స్ వినియోగంపై తన వెంట్రుకలు, రక్త నమూనాలు ఇచ్చేందుకు సిద్ధమని.. కేటీఆర్ సిద్ధమా అంటూ అమరవీరురుల స్తూపం వద్ద రేవంత్ రెడ్డి నిరసన ప్రదర్శన చేసిన తీరు నాడు ప్రజల్లో చర్చనీయాంశం అయ్యింది. డ్రగ్స్ నిర్మూలనకు నాడు కేసీఆర్ సర్కార్ తీసుకున్న చర్యలు నామమాత్రమని ప్రజలు గ్రహించారు. సినీ నటులు డ్రగ్స్ వినియోగం  అంటూ చాలామంది నటులను, దర్శకులను విచారణకు పిలిచి చేసిన హడావుడి అందరం చూశాం. మరి అది ఎటుబోయింది? ఈ ఒక్క ఉదాహరణ చాలదా గత ప్రభుత్వం డ్రగ్స్ సీజ్​కు చిత్తశుద్ధితో పనిచేయలేదని చెప్పడానికి. గత పదేండ్లలో హైదరాబాద్ లో డ్రగ్స్ వినియోగం పెరగడం పబ్​ల్లో మాదక ద్రవ్యాల వినియోగం విచ్చలవిడి కావడం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ బాగా దెబ్బతిన్నదని చెప్పక తప్పదు. డ్రగ్స్ కంటే  గంజాయి విచ్చలవిడిగా దొరకడం వల్ల యువత ఎక్కువగా దానివైపు మొగ్గు చూపుతున్నారు.

స్కూల్స్, కాలేజీలే టార్గెట్​గా..

నిజానికి స్కూల్స్, కాలేజీల్లో డ్రగ్స్ వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోయింది. అమాయకపు పిల్లలు తమకు తెలియకుండానే మత్తుమందుకు బానిసలు అవుతున్నారు. ఈ డ్రగ్స్ మాఫియా పబ్స్​పెద్ద పెద్ద ఈవెంట్స్,  ధనికుల పిల్లలే టార్గెట్​గా ముందుకు కదులుతోంది. సేమ్ టైమ్ మధ్యతరగతి పిల్లలను కూడా ఈ ఉచ్చులోకి లాగుతున్నారు. ఒక్కసారి వాడినవారు దాన్నుంచి బయటపడే పరిస్థితులు ఉండవు. దీన్నే అదనుగా తీసుకొని డ్రగ్స్ మాఫీయా  రెచ్చిపోతోంది. అందుకే డ్రగ్స్​ నిర్మూలనకు ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతగా తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇస్తున్న సందేశాన్ని సమాజం పాటించాల్సిన అవసరం ఉంది. 

అందుబాటులో డి అడిక్షన్​ సెంటర్లు

మరొక్క ముఖ్యమైన విషయం ఏమంటే .. మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన వారిపట్ల చిన్నచూపు చూడకూడదు. వారిని మత్తు అలవాటు నుంచి బయట పడేసేందుకు మనవంతుగా కృషి చేయాలి.  డ్రగ్స్ అలవాటు నుంచి బయట పడేసేందుకు ఎన్నో సెంటర్స్ వైద్యాన్ని  అందిస్తున్నాయి. ప్రభుత్వం ఎర్రగడ్డలో మానసిక రోగుల వైద్యశాలలో డి అడిక్షన్ సెంటర్ అందు బాటులో ఉంచింది. ఇక ప్రైవేట్ సెంటర్స్ కూడా ఎన్నో ఉన్నాయి. పేరెంట్స్ తమ పిల్లలను మామూలు జీవితంలోకి తీసుకొచ్చేందుకు ఇలాంటి సెంటర్స్​ను ఉపయోగించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 

సినీ నటులకు బాధ్యత లేదా?

ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా నటులకు ఇచ్చిన స్వీట్ వార్నింగ్ కూడా చాలా మంచిది. మెగాస్టార్ చిరంజీవి ఎంతో సామాజిక బాధ్యతగా తన వంతుగా ఒక వీడియో రిలీజ్ చేయడం ఎంతైనా అభినందనీయం. చిరంజీవి దారిలోనే ప్రజల్లో ప్రభావం చూపగలిగే సినిమా రంగం దీనిపై నడుం బిగించాలి.  ప్రజల డబ్బు, ఆదరణలతో స్టార్స్, సూపర్ స్టార్స్​గా వెలుగొందుతున్న హీరోలు సామాజిక బాధ్యతను మరిస్తే ఎలా ? తెలంగాణ సీఎంతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా డ్రగ్స్​పై సమరశంఖం పూరించడం శుభసూచకం. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలే కాదు .. కేంద్ర ప్రభుత్వం కూడా అంతే సీరియస్​గా డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది . దేశంలోకి డ్రగ్స్ ఎలా ప్రవేశిస్తున్నాయో పూర్తి స్థాయిలో దృష్టి సారించి నివారణ చర్యలు తీసుకోకపొతే దేశంలో యువత మొత్తం నిర్వీర్యం అవుతుందనేది  ప్రభుత్వాలు  గ్రహించాలి. లేకుంటే యువత భవిష్యత్తు అంధకారమే.

- కోడూరు శ్రీనివాస్ రావు, సీనియర్ జర్నలిస్ట్