జర్నలిస్ట్ సంక్షేమానికి మంచి రోజులు.!

పాలకులకు పెట్టే గుణముండాలి, అభివృద్దికి మేదోమథనం చేయాలి, సంక్షేమానికి హృదయం పెట్టి ఆలోచించాలి. చిత్తశుద్దితో ప్రయత్నిస్తే పరిష్కారం కాని సమస్యే ఉండదు అనే దృఢ చిత్తం ఉండాలి. మన అదృష్టవశాత్తు నేడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ అన్ని లక్షణాలు సంపూర్ణంగా పుణికిపుచ్చుకున్న ప్రభుత్వం ప్రజాపాలన చూస్తోంది. తెలంగాణలో ఎన్నికల కోడ్ మినహాయిస్తే ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి పూర్తిగా ఆరు నెలలు కూడా పూర్తి కాలేదు. ఈ అత్యల్ప కాలంలోనే అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు రేవంత్ రెడ్డి.

దశాబ్దన్నరకు పైగా దోబూచులాడుతూ... దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం అనుకూల తీర్పు వెలువరించినా అందని ద్రాక్షలా ఊరిస్తూ వచ్చిన మా సామాజిక వర్గ సమస్యకు ఈ ఆదివారం రోజున రవీం వేదికగా అతిగొప్ప పరిష్కారాన్ని చూపించి 1100 పైచీలుకు కుటుంబాల్లో ఆనందోత్సాహాలు నింపింది ప్రజాప్రభుత్వం. భవిష్యత్తులో ఎలాంటి చిక్కులు రాకుండా వ్యవస్థల ప్రకారం ప్రతీ దశలో సొంతంగా శ్రద్ధ వహించి మరీ చిరకాల స్వప్నమైన జర్నలిస్టుల సొంతింటి కలను సాకారం చేసారు ముఖ్యమంత్రి. వందల కోట్లు విలువ చేసే 38 ఎకరాలు పేట్ బషీరాబాద్ లో  జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటీవ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ కు అందజేసిన ఉత్తర్వుల కాపీని వేడుకగా జర్నలిస్ట్ సమాజానికి అందించారు. 

సమాజానికి ప్రతినిధులు

జర్నలిస్టుల సంక్షేమంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న పేటెంట్ మరోసారి రుజువైన అపురూప క్షణాలవి. గతంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ దగ్గరైనా.. జర్నలిస్ట్ కాలనీ ఐనా.. ఆ తర్వాత ఇచ్చిన గచ్చిబౌలీ గోపన్ పల్లిలో పట్టాలైనా.. నేడు ఇచ్చిన జేఎన్​హెచ్ఎస్​​ నిజాంపేట్, పేట్ బషీరాబాదైనా జర్నలిస్టుల సొంతింటి కలను సాకారం చేసిన శ్రేయం కాంగ్రెస్​ ప్రభుత్వాలకే దక్కుతుంది.  జర్నలిస్టులకు 70 ఎకరాలను హైద్రాబాద్ నగరం నడిబొడ్డున కేటాయించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్న ‘సమాజానికి చికిత్స చేసే డాక్టర్లు, జర్నలిస్టులు’ మాటల్ని మరోసారి ఉటంకిస్తూ అత్యంత కీలకోపన్యాసం చేసారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రకంగా ఏ తెలంగాణ సమాజం బాగుకోసం ఆహర్నిశలు ఆలోచిస్తున్నాడో.. ఆ తెలంగాణ సమాజానికి ప్రతినిధులుగా జర్నలిస్టులను భావిస్తున్నానని చెప్పడం జర్నలిస్టుల పట్ల రేవంత్ రెడ్డికి గల గౌరవాన్ని  మనందరికీ తెలియపర్చింది.

వినాయ చవితి రోజేజర్నలిస్టుల విఘ్నాలు తొలగాయి

ప్రతీ సమస్యకు పరిష్కారం ఉందని, ఐతే పరిష్కరించే వ్యక్తులు బాధ్యతాయుతంగా ఉన్నప్పుడే అది సాధ్యమౌతుందని అలాంటి గురుతర బాధ్యతను నిర్వర్తించి 1100 మంది కుటుంబాలకు నిజమైన విఘ్నాలు తొలిగి వినాయక పండగను చేసారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ది, సోనియాగాందీ కమిట్మెంట్ వల్ల అత్యంత జఠిలమైన, చిక్కుముడి లాంటి తెలంగాణ ఏర్పాటు సమస్యకే పరిష్కారం దొరికిందని, ఇక ముందు తెలంగాణలో ఉన్న అన్ని సమస్యలకు అదే కమిట్మెంట్ తో పరిష్కారాలను అందిస్తామని, ఇక ఏ సమస్యను పెండింగ్ లో ఉంచమని అన్నింటికీ ఖచ్చితమైన పరిష్కారాన్ని చూపిస్తామనే  భరోసాను సైతం అందించారు. 

ఫోర్త్​ సిటీలోనూ..

గత ప్రభుత్వం పదేళ్ల కాలంపాటు మాటలతోనే కాలక్షేపం చేసింది. అప్పుడు, ఇప్పుడు అంటూ జర్నలిస్ట్ లోకాన్ని మభ్యపెట్టి సొంతింటి కల ఇక కల్లే అనే నిరాశల్లోకి నెట్టేసింది. దీంతో ఏ ఒక్కరికీ నివేశ స్థలాలు వస్తాయన్న ఆశ అడుగంటిపోయింది. ఈ దశలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం, నిన్నటి రోజున అది అమలైన తీరు, అదే సభలో మిగతా జర్నలిస్టులకు సైతం ప్రతిష్టాత్మక ఫోర్త్ సిటీలో ఇండ్లను కేటాయిస్తామని ఇచ్చిన భరోసాతో మళ్లీ జర్నలిస్ట్ లోకానికి ప్రభుత్వంపై నమ్మకం కుదిరింది. ఇక మనవంతుగా ప్రభుత్వానికి సహకారం అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. 

జర్నలిస్ట్​ల పట్ల సానుకూల ప్రభుత్వం

ప్రభుత్వ విస్తృతమైన వ్యవస్థలో ఎక్కడైనా లోపాలు ఉంటే సలహా, సూచనలను వార్త రూపంలో మనం తెలియజేయాలి, ఇది జర్నలిజం నైజం, అలా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేద్దాం. అనేక రకాల సంఘాలుగా ఉన్న మనం, తోటి జర్నలిస్ట్ మిత్రుల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా సంఘటితం కావాలి. అతి సుధీర్ఘకాలంగా వేచిచూస్తున్న జెఎన్​హెచ్​ఎస్ సమస్య పరిష్కారమైన సందర్భంగా వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. యావత్ జర్నలిస్ట్ సమాజానికి తక్షణమే పదికోట్ల ఫండ్ విడుదల చేయడంతో పాటు, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ కార్డులు, అర్హులైన జర్నలిస్టులకు ఫోర్త్ సిటీలో ఇండ్ల స్థలాలు వంటి అంశాలపై సానుకూలంగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి మా ప్రత్యేక ధన్యవాధాలు.

అర్హులందరికీ..

ఎంతమంది అర్హులు ఉన్నా అందరికీ హైద్రాబాద్ లో  సొంతిల్లును అందిస్తాం అని సీఎం ఇచ్చిన భరోసా... ఆనందాన్ని కలిగిస్తుంది.  ప్రజాప్రభుత్వం సంకల్పించిన నేటి ఫోర్త్ సిటీ మన రాష్ట్ర చరిత్రలో అభివృద్దితో కూడిన  చారిత్రాత్మకం కాబోతుంది. అలాంటి గొప్ప సిటీలో జర్నలిస్టులకు భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పిన తీరు నభూతో నభవిష్యత్. ఫోర్త్ సిటీ నిర్మాణంలో జర్నలిస్ట్ సమాజాన్ని భాగస్వామ్యం చేసి  కోట్ల విలువ చేసే స్థలాల్ని మనకు కేటాయిస్తామనడం, అదీ అతి త్వరలోనే జరిగిపోతుందనే నమ్మకాన్ని ఇవ్వడం మన సంతోషాన్ని మరింత రెట్టింపు చేసింది. 

- బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి,
అధ్యక్షుడు, జర్నలిస్ట్ అధ్యయన వేదిక