ప్రజలనే కాదు.. వేములవాడ రాజన్నను KCR మోసం చేసిండు: సీఎం రేవంత్

వేములవాడ: మాజీ సీఎం కేసీఆర్ ప్రజలనే కాదు.. వేములవాడ రాజన్నను కూడా మోసం చేశాడని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. దీంతో ఇదే వేములవాడ నుంచి కేసీఆర్‎ను ఓడించాలని డిసైడ్ అయ్యాయని రేవంత్ తెలిపారు. 2024, నవంబర్ 20న సీఎం రేవంత్ రెడ్డి వేములవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా వేములవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంఖుస్థాపన చేశారు. అనంతరం ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా వేములవాడలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా హాజరై సీఎం రేవంత్ మాట్లాడారు. 

తెలంగాణలో ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్సే.. ఇప్పుడు పెండింగ్‎లో ఉన్నవాటిని పూర్తి చేసేది కాంగ్రెస్సేనని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పని చేస్తే ప్రాజెక్టులు పెండింగ్‎లో ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా అంటేనే ఉద్యమాలకు కేరాఫ్ అడ్రస్ అని.. దేశానికి ప్రధాని అందించిన గడ్డ కరీంనగర్ అని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తామని సోనియా గాంధీ ఇదే కరీంనగర్‎లో మాట ఇచ్చారని.. ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని గుర్తు చేశారు. 

ALSO READ | కరీంనగర్లో రూ.14కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్

కరీంనగర్ ప్రజలు బండి సంజయ్‎ని రెండు సార్లు ఎంపీగా గెలిపిస్తే ఆయన కేంద్ర మంత్రి అయ్యాడని.. మరీ ఆయన కరీంనగర్ కోసం ఏం చేశాడని ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా గురించి బండి సంజయ్ ఎప్పుడైనా పార్లమెంట్‎లో మాట్లాడారా అని నిలదీశారు. తెలంగాణలో మేం అధికారంలోకి రాగానే వేములవాడ అభివృద్ధికి శ్రీకారం చుట్టామని.. జిల్లాలో అనేక సమస్యలు పరిష్కరించాల్సి ఉందన్నారు. సిరిసిల్ల జిల్లాకు అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.