25 రోజుల్లో రూ. 18 వేల కోట్లు మాఫీ చేసినం..వాస్తవాలు తెలుసుకోండి

  • రాష్ట్రంలో రుణమాఫీ కోసం రైతులు ఎదురుచూస్తున్నారన్న మోదీ
  • వాస్తవాలు తెలుసుకోవాలని సూచించిన రేవంత్
  • 22,22,365 మంది రైతులను రుణవిముక్తులను చేశాం
  • 25 రోజుల్లో రూ. 18 వేల కోట్లు మాఫీ చేసినట్లు వెల్లడి
  • 11 నెలల్లో ప్రవేశపెట్టిన స్కీమ్​లు, వాటి అమలు తీరుపై రిప్లై

హైదరాబాద్, వెలుగు: ట్విట్టర్ (ఎక్స్​)​ వేదికగా ప్రధాని నరేంద్రమోదీకి  సీఎం రేవంత్​రెడ్డి కౌంటర్​ ఇచ్చారు. మోదీ చేసిన ట్వీట్​కు రిప్లై ఇస్తూ వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. కాంగ్రెస్​ పాలిత ప్రాంతాల్లో హామీలు అమలవడం లేదని, బూటకపు హామీలు ఇస్తున్నారని, తెలంగాణలో రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారంటూ శుక్రవారం రాత్రి ప్రధాని మోదీ ట్వీట్​ చేశారు. దీనికి స్పందించిన సీఎం రేవంత్​రెడ్డి.. రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో ఏం చేసిందో వివరిస్తూ రిప్లై ఇచ్చారు. ‘‘డియర్​ నరేంద్ర మోదీజీ..! తెలంగాణ ప్రభుత్వం గురించి మీరు చేసిన ప్రకటన ముమ్మాటికీ తప్పు. వాస్తవాలను మీకు తెలియజేసేందుకే ఈ రిప్లై ఇస్తున్నాను” అంటూ ట్వీట్​ చేశారు. 

అధికారంలోకి వచ్చిన రెండ్రోజుల్లోనే..! 

తాము 2023 డిసెంబర్​ 7న అధికారంలోకి వచ్చిన రెండ్రోజుల నుంచే గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టామని ట్వీట్​లో సీఎం రేవంత్​రెడ్డి వివరించారు. ‘‘2023  డిసెంబర్ 7న తెలంగాణలో కాంగ్రెస్​ ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బం దులు పడ్డారు. నిరుద్యోగులు ఉద్యోగాలు లేక నిరాశలో కూరుకుపోయారు. వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు మేం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే హామీల అమలుకు శ్రీకారం చుట్టాం” అని తెలిపారు.

కాంగ్రెస్​ ప్రభుత్వం.. ప్రభుత్వం కొలువు దీరిన రెండోరోజే మొదటి వాగ్దానంగా మహిళలకు ఉచిత ప్రయాణం, రెండో వాగ్దానంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల కవరేజీని ప్రారంభించామని సీఎం రేవంత్​ వెల్లడించారు. రాష్ట్రంలోని ఆడబిడ్డలు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా బస్సుల్లో ప్రయాణిస్తున్నారని,  దీని వల్ల ఇప్పటి వరకు 11 నెలల్లో వారికి రూ. 3,433.36 కోట్ల వరకు ఆదా అయిందని, ఈ విషయాన్ని గమనించాలని ప్రధాని మోదీకి ఆయన  సూచించారు.  

గ్యాస్​ ధర ఎక్కడ ఎక్కువో తెలుసుకోండి

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్యాస్​ధరలు ఎక్కువగా ఉన్నాయని, వాటితో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీఎం రేవంత్​ అన్నారు. గ్యాస్​ తిప్పల నుంచి తెలంగాణ ఆడబిడ్డలను కాపాడుకోవడానికి రూ. 500కే సిలిండర్​ స్కీమ్​ను అమలు చేస్తున్నామని వివరించారు. ‘‘బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్యాస్‌‌ సిలిండర్‌‌ ధరలు ఎక్కువగా ఉంటే, కాంగ్రెస్‌‌ అధికారంలో ఉన్న తెలంగాణలో కేవలం రూ. 500కే సిలిండర్‌‌  ఇస్తున్నాం.

ఇప్పటివరకు 1.31 కోట్లకు పైగా గ్యాస్ సిలిండర్ లు రీఫిల్‌‌ చేశాం. 42 లక్షల 90 వేల 246 మందికి ఈ పథకం కింద లబ్ధి చేకూరుతున్నది. ఇదీ మా రికార్డు’’ అని మోదీకి చేసిన ట్వీట్​లో రేవంత్​ పేర్కొన్నారు. అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం... ఇండ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్​ను అందజేస్తున్నామని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్​ సిలిండర్​, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ తో తెలంగాణ ఆడబిడ్డలు తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారని..  వారి ఆశీర్వాద బలంతో తాము మరింత ఉత్సాహంతో పనిచేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. 

ఇదీ మా ప్రభుత్వ రికార్డు

ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు తాము నిబద్ధతతో ఉన్నామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. ‘‘గత బీఆర్​ఎస్​ పాలనలో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉద్యోగ నియామకాలు లేకపోవడం, ప్రశ్నాపత్రాల లీకేజీలు వారిని తిప్పలు పెట్టాయి. ఇప్పుడు అలాంటి  పరిస్థితి లేదు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగ నియామకాలపై ఫోకస్​ పెట్టాం. అన్ని స్థాయిల పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాం.   గ్రూప్ 1, 2, 3 , 4ను కేవలం 11 నెలల కంటే తక్కువ సమయంలోనే నిర్వహించాం. ఇప్పటి వరకు 50 వేల మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం. ఇది ఏ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం చేయని రికార్డు” అని ఎక్స్​ వేదికగా ప్రధానికి సీఎం కౌంటర్​ ఇచ్చారు.  ‘‘గత బీఆర్‌‌ఎస్ ప్రభుత్వం పదేండ్ల పాటు పాఠశాల విద్యార్థులను విస్మరించింది. సంక్షేమ హాస్టళ్లలోని పేద పిల్లలను పట్టించుకోలేదు.

ఆ విద్యార్థులకు పోషకాహారం అందాలన్న లక్ష్యంతో మా కాంగ్రెస్​ ప్రభుత్వం డైట్​, కాస్మోటిక్​ చార్జీలను 40 శాతానికి పైగా పెంచింది” అని వివరించారు. పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన మూసీ నదిని బాగుచేస్తున్నామని, పదేండ్లలో ఆక్రమణలకు గురైన చెరువులను,  ధ్వంసమైన నీటి వనరులను పరిరక్షిస్తున్నామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ కోసం మాస్టర్​ ప్లాన్​ను ఖరారు చేస్తున్నామన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ,  యంగ్​ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ,  యంగ్​ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్​రెడ్డి వివరించారు.  వాస్తవాలను తెలుసుకోవాలని ప్రధానికి సూచించారు.

దేశంలోనే అతిపెద్ద రుణమాఫీ

తాము అధికారంలోకి వచ్చి ఇంకా ఏడాది కూడా పూర్తి కాలేదని, ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు రుణమాఫీ చేశామని ప్రధాని మోదీకి సీఎం రేవంత్​ తన ట్వీట్​లో తెలిపారు. తాము రైతును రాజుగా భావిస్తామని, అందుకే రైతుల సంక్షేమం కోసం దేశంలోనే అతిపెద్ద రుణమాఫీని అమలు చేశామని వివరించారు. ‘‘ఇచ్చిన మాటకు కట్టుబడి రూ. 2 లక్ష రుణమాఫీని అమలు చేశాం. 22 లక్షల 22 వేల 365 మంది రైతులను రుణ విముక్తులను చేశాం. 25 రోజుల్లో రూ. 18 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం” అని స్పష్టం చేశారు.