కేసీఆర్​ కాస్కో..నీ పార్టీని మళ్లా మొలవనియ్య : సీఎం రేవంత్​రెడ్డి

  • నీ కుట్రలు తెలుసు.. వాటికి విరుగుడూ తెలుసు: సీఎం రేవంత్​
  • పవర్​లో ఉంటే దోచుకునుడు.. ప్రతిపక్షంలో ఉంటే ఫామ్​హౌస్​లో పండుకునుడే నీ నైజం
  • అసెంబ్లీకి రా.. నువ్వు చేసిందేందో.. మేం చేస్తున్నదేందో తేలుద్దాం
  • పదేండ్లు రాష్ట్రాన్ని ఆగం జేసినవ్​.. రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ముంచినవ్​
  • ఆ అప్పులకే రూ.6,500 కోట్ల మిత్తీలు కడ్తున్నం
  • అభివృద్ధిని అడ్డుకుంటే ఊచలు లెక్కబెట్టిస్తం
  • చివరి రక్తపు బొట్టు దాకా తెలంగాణ కోసమే పనిచేస్త
  • కిషన్‍రెడ్డి.. తట్టాపెట్టే సర్దుకొని గుజరాత్‍ వెళ్లిపో
  • తెలంగాణ ద్రోహి మోదీకి గులాంగిరీ చేస్కో అని ఫైర్​
  • వరంగల్​లో విజయోత్సవ సభ.. కాళోజీ కళాక్షేత్రం ప్రారంభం

వరంగల్‍/ హనుమకొండ, వెలుగు : అధికారంలో ఉంటే దోచుకోవడం, ప్రతిపక్షంలో ఉంటే ఫామ్​హౌస్​లో రెస్ట్​ తీసుకోవడమే కేసీఆర్ నైజమని సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని.. ప్రజల కోసం ఎవరు ఏం చేశారో తేలుద్దామని ఆయన సవాల్​ విసిరారు. ‘‘కేసీఆర్​..! రా అసెంబ్లీకి. చర్చ పెడ్దం. నువ్వే టైమ్​ చెప్పు. నువ్వు చెప్పినట్లే అసెంబ్లీ పెడ్తం. ఓడిపోంగనే ఇంట్లపోయి పంటవా.. ఇదా ప్రతిపక్ష నాయకుడంటే?! రాహుల్​ గాంధీని చూసి సిగ్గు తెచ్చుకో.

మూడుసార్లు ఓడిపోయినా కన్యాకుమారి నుంచి కాశ్మీర్​ వరకు 150 రోజులు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి, ప్రజలకు అందుబాటులో ఉన్న లీడర్​ రాహుల్​ గాంధీ.  ఇది కదా బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడంటే” అని తెలిపారు. ఫామ్​హౌస్​లో కేసీఆర్​ చేస్తున్న కుట్రలు ఏమిటో, కుతంత్రాలు ఏమిటో తనకు తెలుసని.. వాటిని ఎలా తిప్పికొట్టాలో, విరుగుడు ఏందో కూడా తనకు తెలుసని ఆయన అన్నారు.  కాంగ్రెస్‍ ప్రభుత్వ ఏడాది పాలన, ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మంగళవారం వరంగల్​లోని ఆర్ట్స్ అండ్‍ సైన్స్ కాలేజీ గ్రౌండ్‍లో  ‘ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాలు’ నిర్వహించారు. 

హనుమకొండ హయగ్రీవచారి గ్రౌండ్‍లో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.‘‘అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ను ఓడిస్తానన్న. .. ఓడించిన. పార్లమెంట్​ఎన్నికల్లో ఆ పార్టీకి గుండు సున్నా తెప్పిస్తానన్న. తెప్పించిన.ఇప్పుడు వరంగల్​ గడ్డ మీది నుంచి చెప్తున్న. కేసీఆర్..!​ కాస్కో. నీ బీఆర్​ఎస్​ను మళ్లా మొలవనియ్య. మా కార్యకర్తల పౌరుషమేందో.. నీ ఫామ్​హౌస్​ కుట్రలు, కుతంత్రాలేందో తేల్చుకుందాం” అని సీఎం రేవంత్​ రెడ్డి హెచ్చరించారు. 

ఫామ్​హౌస్​ను విడిచి కేసీఆర్​ బయటకు రావాలని.. ప్రభుత్వానికి ఆయన ఏం సూచనలు చేస్తరో చేయొచ్చని, వినడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సూచనలు సహేతుకమే అయితే సరిదిద్దడానికి కూడా తాము రెడీగా ఉన్నామని పేర్కొన్నారు. కేసీఆర్​ బయటకు రాకుండా కేటీఆర్​, హరీశ్​రావును ఊరిమీదికి వదిలారని, ఆ ఇద్దరు ఏది పడితే అది మాట్లాడ్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

చివరి రక్తపు బొట్టు దాకా తెలంగాణ కోసమే..

పోరాడి సాధించుకున్న తెలంగాణను పదేండ్లు కేసీఆర్​ ఆగం చేశారని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై 7 లక్షల కోట్ల అప్పులు మోపిందని తెలిపారు. ఆ అప్పులకు వడ్డీలు కడుతూనే..  కడుపు కట్టుకొని హామీలు అమలు చేస్తున్నామని వివరించారు. ‘‘కేసీఆర్​పై ఈ వరంగల్​ గడ్డ మీది నుంచే నాడు(అసెంబ్లీ ఎన్నికల టైమ్​లో) పోరాటం మొదలుపెట్టినం. ఇప్పుడు ప్రజా ప్రభుత్వ ఏడాది ఉత్సవాలు కూడా అదే గడ్డ మీద జరుపుకుంటున్నం. నాలుగు సంవత్సరాలు కడుపు కట్టుకొని జనం కోసం పనిచేస్త. చివరి రక్తపు బొట్టు వరకు, తుది శ్వాస వరకు నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డల కోసమే నేను పనిచేస్త. కేసీఆర్​ అనే మొక్కను మళ్లీ మొలవనివ్వను” అని సీఎం రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. 

‘‘కేసీఆర్​..! నువ్వు మౌనంగా ఫామ్​హౌస్​లో పండుకుంటే నీ సంగతి తెలియదనుకుంటున్నవేమో..! నీ ముందు తెలుసు.. నీ వెనుక తెలుసు. నీ ఉపాయం తెలుసు.. నీ ఉబలాటం తెలుసు. కుక్కకాటుకు చెప్పు దెబ్బ అనే మందు నా దగ్గర సిద్ధంగా ఉంది. తప్పకుండా ఆ మందు నీకు పెడ్త. రా.. అసెంబ్లీకి. మళ్లోసారి చెప్తున్న.. రావయ్య సామీ అసెంబ్లీకి. రా.. సూస్త. నీ సంగతి! ఎవడో ఇస్తే రాలే కుర్సీలకు. తొక్కుకుంట వచ్చిన. గుర్తుపెట్టుకో..​’’ అని హెచ్చరించారు.  

అభివృద్ధిని అడ్డుకుంటే ఊచలు లెక్కపెట్టిస్తం..

రాష్ట్రంలో తమ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే అడ్డుకునేందుకు కొందరు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని, అలాంటి వాళ్లు ఊచలు లెక్కపెట్టాల్సిందేనని సీఎం రేవంత్​రెడ్డి హెచ్చరించారు. ‘‘మీరు కుట్రలు చేయొచ్చు.. కుతంత్రాలు చేయొచ్చు.. అక్రమంగా సంపాదించిన సంపదపెట్టి కిరాయి మనుషులను తేవొచ్చు..  మీరు ఏంజేసినా ఒకరోజు వెనకో, ముందో మీ కుట్రలను గుర్తిస్తం. అందరినీ బొక్కలో పెడ్తం. ఊచలు లెక్కపెట్టిస్తం” అని వార్నింగ్​ ఇచ్చారు. 

‘‘రాష్ట్రంలో 10 నెలల్లో ఏం కోల్పోయారో ప్రజలకు అర్థమైందని కేసీఆర్​ అంటున్నడు. కోల్పోయింది కేసీఆర్​ కుటుంబం. ఆయన ఫ్యామిలీలో నలుగురికి పదవులు ఊడినయ్​” అని విమర్శించారు. మహిళల కోసం ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తే దాన్ని కూడా కేటీఆర్​ తప్పుపడుతున్నారని.. ఖాకీ అంగీ వేసుకొని ధర్నా చేస్తున్నారని అన్నారు. ‘‘ఖాకీ అంగి ఏసుకుంటే కేటీఆర్‍ ఆటో రాముడా? డ్రామారావా” అని విమర్శించారు. 

వచ్చే ఆదాయంలో మిత్తిలకే రూ.6,500 కోట్లు..

రుణమాఫీపై బీఆర్‍ఎస్‍ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్​ మండిపడ్డారు. ‘‘బీఆర్​ఎస్​ నేతలు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి పదేండ్లు నాన్చిన్రు. దీనిపై అసెంబ్లీలో చర్చ పెడ్దాం.. బిల్లారంగాల్లో (కేటీఆర్​, హరీశ్​రావు) ఎవరొస్తారో రావాలి” అని సవాల్​ చేశారు. పదేండ్లలో కేసీఆర్‍ సర్కార్‍ చేయని పనిని 10 నెలల్లో తమ సర్కార్‍ చేస్తే అభినందించకుండా.. రోజూ కాళ్లల్ల  కట్టె పెట్టినట్లు తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కొట్లాడి సాధించుకున్న తెలంగాణను పదేండ్లు కేసీఆర్​ ఆగం చేసిండు.  రూ.7 లక్షల కోట్ల అప్పులు మోపిండు. 

రాష్ట్రంలో ప్రతి నెల రూ.18,500 కోట్ల ఆదాయం వస్తుంటే.. ఇందులో 6,500 కోట్లు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లకుపోనూ.. మరో రూ.6,500 కోట్లు అప్పుల మిత్తికి పోతున్నయ్​. మిగతా రూ.5,500 కోట్లతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ రైతులకు రుణమాఫీ చేస్తే అభినందించకుండా.. శాపనార్థాలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నడు” అని ఆయన అన్నారు. ‘‘వరి వేసుకుంటే ఉరి అని మాట్లాడిన కేసీఆర్‍.. నాడు తన ఫామ్​హౌస్​లో మాత్రం 150 ఎకరాల్లో వరి వేసుకున్నడు. ఆ వివరాలన్నీ అప్పుడు నేనే బయటపెట్టిన” అని తెలిపారు.  

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా తెలంగాణ రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల్లో 1 కోటి 53 లక్షల టన్నుల ధాన్యం ఈసారి పండిందన్నారు. కాళేశ్వరంతో సంబంధం లేకుండా వరి సాగైందని తెలిపారు. ఎమ్మెస్పీ ఇవ్వడంతోపాటు సన్నవడ్లకు రూ.500 బోనస్‍ ఇచ్చి కొంటున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని ఆయన పేర్కొన్నారు. ఇవ్వన్నింటిపై చర్చిద్దాం రా అంటూ కేసీఆర్‍కు సవాల్‍ విసిరారు.

రుణమాఫీ కానివాళ్లకు మాఫీ చేస్తం..

రాష్ట్రంలోని ఆడబిడ్డలను అదానీ, అంబానీల్లా పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా చూస్తున్నామని సీఎం రేవంత్​ అన్నారు. ‘‘కాంగ్రెస్‍ ప్రభుత్వం గడిచిన 11 నెలల్లో మహిళల అభివృద్ధి కోసం పాటుపడుతున్నది. రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్​ను కేంద్రంలోని బీజేపీ సర్కార్​ రూ.1200కు పెంచింది. రాష్ట్రంలో కాంగ్రెస్‍ ప్రభుత్వం మాత్రం రూ.500 ధరకే ఇస్తున్నది. 50 లక్షల మందికి  200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్​ ఇస్తున్నం. 10 నెలల్లో 50 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినం. 

ఇచ్చినమాట ప్రకారం రూ.18 వేల కోట్లతో రైతులకు రుణమాఫీ చేసినం. ఖాతాల్లో సమస్యలు, వివిధ కారణాల వల్ల  కొందరు  రైతులకు రుణమాఫీ కాలేదు. వాళ్లకు కూడా మాఫీ చేసితీరుతాం” అని ఆయన స్పష్టం చేశారు. పీసీసీ చీఫ్​ మహేశ్​ కుమార్​ గౌడ్​ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం మహిళా సంక్షేమానికే రూ.5,500 కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నదని తెలిపారు. ఇది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని స్పష్టం చేశారు.

కాళోజీ, జయశంకర్ సార్​ను కేసీఆర్​ పట్టించుకోలే

గత కేసీఆర్​ ప్రభుత్వం 10 ఏండ్ల పాలనలో కాళోజీ, ప్రొఫెసర్ జయశంకర్ సార్​ను అవమానించిందని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘ కేసీఆర్ స్వయంగా శంకుస్థాపన చేసిన కాళోజీ కళాక్షేత్రం పనులను 10 ఏండ్లలో ఎందుకు పూర్తి చేయలేకపోయిండు? మహనీయుని పేరుతో ఉన్న కళాక్షేత్రాన్ని ఏండ్ల తరబడి  ఆయన పట్టించుకోలేదు. మేం పట్టుబట్టి పెండింగ్ ఫండ్స్ మొత్తం ఇవ్వడం ద్వారా పనులను త్వరితగతిన పూర్తి చేశాం. 

తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్​కు చేదోడు వాదోడుగా ఉన్న సిద్ధాంతకర్త జయశంకర్ సార్ అక్కంపేటను కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. జయశంకర్​ సార్​పై గౌరవంతో మా ప్రభుత్వం వచ్చాకే ఇచ్చిన మాట ప్రకారం.. ఆ గ్రామాన్ని రెవెన్యూ విలేజ్​గా ప్రకటించాం” అని వివరించారు.  

కిషన్‍రెడ్డి..గుజరాత్‍ వెళ్లిపో..

గుజరాత్‍లో సబర్మతి నది ప్రక్షాళన చేపడ్తే మోదీని గొప్ప పని చేశావంటూ చప్పట్లు కొట్టే కేంద్ర మంత్రి కిషన్‍రెడ్డి.. హైదరాబాద్​లో మూసీ పునరుజ్జీవానికి మాత్రం అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు. ‘‘దీనిపై నేను ప్రశ్నిస్తే.. ‘‘సోనియాకు గులామువా” అంటున్నడు. ఆంధ్రప్రదేశ్‍లో కాంగ్రెస్‍ పార్టీ సచ్చిపోయినా.. అరవై ఏండ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేలా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ మా అమ్మ. తెలంగాణలోని నాలుగుకోట్ల బిడ్డలకు కన్నతల్లి. ఆమెకు ఊడిగం కాదు.. ఆమె కాళ్లు కడిగి నెత్తిమీద చల్లుకున్నా తక్కువే అవుతుంది. 

అది అవమానం కాదు.. ఆత్మగౌరవం. ఇప్పటికైనా నీ పాపాలు కడుక్కునేందుకు రా.  ఆమె కాళ్లు కడిగి మనమిద్దరం నెత్తిమీద చల్లుకుందాం” అని కిషన్​రెడ్డికి సీఎం సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించి అపహస్యం చేసిన ద్రోహి నరేంద్రమోదీ అని, ఆయనకు గులాంగా ఉండే కిషన్‍రెడ్డి గుజరాత్‍కు వెళ్లిపోవాలని.. తెలంగాణలో ఉండే అర్హత కిషన్​రెడ్డికి లేదని అన్నారు.  ‘‘తెలంగాణలో బతికే అర్హత కోల్పోయావు.. తట్టాపెట్టె సర్దుకుని గుజరాత్‍ వెళ్లి గులాంగిరి చేసుకో” అని కిషన్​రెడ్డిపైఫైర్​ అయ్యారు.  

రెండో రాజధానిగా వరంగల్​ అభివృద్ధి

వరంగల్‍ అంటే హైదరాబాద్‍ తర్వాత అంతే పెద్ద నగరమని, సగం తెలంగాణతో సమానమని సీఎం రేవంత్​ అన్నారు. వరంగల్‍ను అభివృద్ధి చేస్తే సగం తెలంగాణను అభివృద్ధి చేసినట్లేనని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రెండో రాజధానిగా ఓరుగల్లును అభివృద్ధి చేస్తామన్నారు. వరంగల్ అభివృద్ధి కోసం దాదాపు రూ.6 వేల కోట్లు కేటాయించామని, ఇది చరిత్రలో నిలిచిపోయే నిర్ణయమని సీఎం ప్రకటించారు. కాకతీయులు పాలించిన వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. మామునూరు ఎయిర్​పోర్టు నిర్మాణంతో వరంగల్ దశ మారిపోతుందని, పరిశ్రమలు అందుబాటులోకి వచ్చి యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. 

మహారాష్ట్రలో ప్రతి వంద కిలోమీటర్లకొక ఎయిర్​పోర్టు ఉందని, ఏపీలో కూడా ఐదారు చోట్లా విమానాశ్రయాలు ఉన్నాయని తెలిపారు. కానీ తెలంగాణలో కేవలం హైదరాబాద్​లో ఎయిర్​పోర్టు ఉందని.. రాష్ట్రంలోని కొత్తగూడెం, ఆదిలాబాద్​, రామగుండం తదితర ప్రాంతాల్లో ఎయిర్​పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని వివరించారు.  కాగా, అంతకు ముందు సీఎం రేవంత్​రెడ్డి వరంగల్​  అభివృద్ధి పనులకు సంబంధించిన మాస్టర్​ ప్లాన్​ను రిలీజ్​ చేశారు.