జనం చిత్తుగా ఓడగొట్టినా కేసీఆర్​కు బుద్ధిరాలే : సీఎం రేవంత్

  • స్థానిక ఎన్నికల్లోనూ బీఆర్​ఎస్​కు గుణపాఠం తప్పదు
  • అధికారం పోయిందన్న బాధలో కేటీఆర్  ఏదేదో మాట్లాడ్తున్నడు
  • దూలమంత పెరిగిన హరీశ్​కు దూడకున్న బుద్ధి కూడా లేదు
  • రుణమాఫీపై అప్పట్లో సవాల్​ విసిరిండు.. ఇప్పుడేమంటడు?
  • ఇప్పటికే రూ. లక్ష వరకు రుణమాఫీ చేసినం..
  • జులై 31లోగా రూ.లక్షన్నర దాకా చేస్తం
  • పంద్రాగస్టు వరకు రూ. రెండు లక్షల వరకు మాఫీ చేస్తం
  • 50 ఎకరాల్లో రూ.100 కోట్లతో స్కిల్​ యూనివర్సిటీ
  • ఆరు నూరైనా ఆరు గ్యారంటీల అమలు ఆగదని వెల్లడి
  • కల్వకుర్తిలో జైపాల్​రెడ్డి విగ్రహావిష్కరణ

నాగర్​ కర్నూల్, వెలుగు: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీఆర్​ఎస్​కు గట్టి బుద్ధిచెప్పాలని, ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రానివ్వొద్దని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ను చిత్తుగా ఓడగొట్టినా.. పార్లమెంట్​ ఎన్నికల్లో ఆ పార్టీకి గుండు సున్నా వచ్చినా కేసీఆర్​, కేటీఆర్​, హరీశ్​రావు బుద్ధి ఇంకా మారలేదని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లోనూ వాళ్లకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ‘‘కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చింది.. పేదలకు కష్టాలొచ్చినయని కేసీఆర్​, కేటీఆర్​, హరీశ్​రావు అంటున్నరు. పేదలకు కాదు కేసీఆర్​ కుటుంబానికే కష్టాలొచ్చినయ్​. అధికారం పోయిందన్న బాధను దిగమింగుకోలేక  ఏదేదో మాట్లాడుతున్నరు” అని ఆయన విమర్శించారు. ఇది ప్రజా ప్రభుత్వమని.. ఇచ్చిన హామీలు తప్పక అమలు చేస్తామని తెలిపారు. ఆదివారం నాగర్​కర్నూల్​ జిల్లా కల్వకుర్తిలో కేంద్ర మాజీ మంత్రి ఎస్​.జైపాల్​రెడ్డి కాంస్య విగ్రహావిష్కరణ సభ జరిగింది. 

కార్యక్రమంలో సీఎం రేవంత్​రెడ్డి పాల్గొని.. విగ్రహాన్ని ఆవిష్కరించారు. సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘అసెంబ్లీ, పార్లమెంట్​ ఎన్నికలు  అయిపోయాయి. కార్యకర్తలు కష్టపడి నాయకులను గెలిపించుకున్నారు. రాబోయేది సర్పంచ్​, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్​, కౌన్సిలర్​ ఎన్నికలు. అంటే కార్యకర్తల ఎన్నికలు. స్థానిక ఎన్నికల్లో నాతో సహా నాయకులంతా గ్రామ గ్రామాన తిరిగి కార్యకర్తలను గెలిపించుకుంటారు. నేను నాయకుడిని కాదు.. కార్యకర్తల్లో కార్యకర్తను. కార్యకర్తల కోసం కష్టపడే వాడిని. కార్యకర్తలను ప్రజాప్రతినిధులుగా గెలిపించి సంక్షేమం, అభివృద్ధిలో వాళ్లను భాగస్వామ్యం చేస్తాం. రాబోయే సర్పంచ్ ఎన్నికలకు సమాయత్తంకండి” అని పిలుపునిచ్చారు. 

జైపాల్​రెడ్డి వల్లే తెలంగాణ బిల్లు ఆమోదం

రాజకీయ నాయకుడి నుంచి సిద్ధాంతకర్తగా  జైపాల్​రెడ్డి ఎదిగారని, పదవుల కోసం ఏనాడూ ఆయన రాజకీయాలు చేయలేదని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘నాలుగుసార్లు  కల్వకుర్తి ఎమ్మెల్యేగా, ఐదుసార్లు ఎంపీగా, రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన జైపాల్​రెడ్డి.. ప్రజలకోసమే పని చేశారు. చివరి శ్వాస వరకు ప్రజా జీవితంలో ఉన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా సిద్ధాంతాలను వదలలేదు. ఈ ప్రాంతానికి చెందిన జైపాల్​రెడ్డి, పుట్టపాగ మహేంద్రనాథ్​, ద్యాప గోపాల్​ రెడ్డి తదితరులు రాజకీయ విలువల కోసం పోరాడారు. వీరు పదవులకు వన్నె తెచ్చి గౌరవం పెంచారు” అని పేర్కొన్నారు. 

తెలంగాణ ఇచ్చినా 2014లో కాంగ్రెస్​ పార్టీ ఎందుకు అధికారంలోకి రాలేదని ఆ మధ్య కాంగ్రెస్​ అగ్రనాయకుల చర్చలో ప్రస్తావనకు వస్తే..  2014లో జైపాల్​రెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రకటించి కల్వకుర్తి నుంచి పోటీ చేయించి ఉంటే అధికారం దక్కేదని, నాయకుడు లేని కారణంగా అధికారం కోల్పోయామని తాను వివరించినట్లు సీఎం తెలిపారు. ‘‘నాడు లోక్​సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో తెలంగాణ బిల్లు ఆమోదం పొందదని అందరూ ఆందోళన చెందారు. అలాంటి పరిస్థితుల్లో సభ వాయిదాపడగానే నాటి స్పీకర్​ మీరా కుమార్​కు జైపాల్​రెడ్డి ఒక సూచన చేశారు. 

మూడ్​ ఆఫ్​ ది హౌస్​ను చూసి, తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదించుకుంటే తెలంగాణ ఏర్పడుతుందని ఆయన సలహా ఇచ్చారు. అందుకు తగ్గట్టుగా స్పీకర్​ తెలంగాణ బిల్లును ఆమోదించారు. అట్ల జైపాల్​రెడ్డి సూచన మేరకే తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది. తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను నాడు కేంద్ర కేబినెట్​లోనూ జైపాల్​రెడ్డి వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన కృషి ఎనలేనిది” అని కొనియాడారు. 

హరీశ్​కు దూడకున్న బుద్ధి కూడా లేదు

ఇచ్చిన మాటకు కట్టుబడి రైతు రుణమాఫీని అమలు చేస్తున్నామని సీఎం రేవంత్​ అన్నారు. ‘‘మొన్న పార్లమెంట్​ ఎన్నికల్లో ఓ సన్నాసి.. ఆయన దూలం లెక్క పెరిగిండు కానీ దూడ కున్న బుద్ధి కూడా లేదు. రుణమాఫీ చేసి చూడు అని ఆ నాయకుడు సవాల్​ విసిరిండు. ఆగస్టులో తప్పకుండా రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన. ఆగస్టు రాకముందే లక్ష రుణమాఫీ చేసినం. జులై 31 దాటకముందే లక్షన్నర వరకు ఉన్న లోన్లు కూడా మాఫీ చేస్తం. ఆగస్టు రెండు తారీఖు నుంచి 14 వరకు నేను విదేశీ పర్యటనకు వెళ్తున్న. వచ్చిన వెంబడే రూ. రెండు లక్షల వరకు ఉన్న రుణాలు కూడా మాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటం”అని చెప్పారు. 

కేసీఆర్​, కేటీఆర్​కు మధ్య సమన్వయం లేదు

ప్రతిపక్ష నేతగా కేసీఆర్​ను అసెంబ్లీకి రావాలని తాను సవాల్​చేస్తే.. బావ, బావమరిది(హరీశ్​, కేటీఆర్​) తామే చూసుకుంటామని చెప్పారని.. తీరా చూస్తే  మరుసటి రోజు పదకొండున్నరకే  కేసీఆర్​ సభకు వచ్చి కూర్చున్నారని రేవంత్​రెడ్డి అన్నారు. కేసీఆర్​, కేటీఆర్​కు మధ్య సమన్వయం లేదనడానికి ఇదే ఉదాహరణ అని తెలిపారు. వాళ్ల మధ్య అధికారంలో కోల్పోయిన బాధ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నదని విమర్శించారు. కేటీఆర్​ మేడిగడ్డ టూర్​కు వెళ్తానంటే తన డ్రైవర్​ బాలయ్య భయపడ్డాడని, అక్కడ సెల్ఫీ తీసుకుంటూ జారిపడగల్లా అని వాపోయాడని సీఎం వ్యాఖ్యానించారు.
 
ఆరునూరైనా ఆరు గ్యారంటీల అమలు ఆగదు

తెలంగాణ ఏర్పాటు చేస్తామని 2004లో సోనియాగాంధీ మాటిచ్చారని.. ఆ మాటకు కట్టుబడి రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. తెలంగాణ ఏర్పాటు వల్ల పక్క రాష్ట్రం ఏపీలో ఉనికిని కోల్పోతామని తెలిసినా, చివరికి కేంద్రంలో యూపీఏ అధికారం కోల్పోయినా ఆమె బాధపడలేదని అన్నారు. ‘‘ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తిత్వం సోనియాగాంధీది. అలాంటి వ్యక్తి ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ఆరునూరైనా రాష్ట్రంలో అమలు చేసి తీరుతాం. మహిళలకు ఉచిత రవాణా పథకం కింద ఆర్టీసీకి రూ.2,500 కోట్లు చెల్లించాం.  4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్ల కోసం  రూ.10 వేలు కోట్ల కేటాయించాం. గ్యాస్  సిలిండర్​ను రూ. 500కే అందిస్తున్నాం.  200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్​ అమలు చేస్తున్నాం” అని ఆయన వివరించారు.

నేను నల్లమల బిడ్డనే.. మీ సోదరుడినే

సీఎం స్థాయికి ఎదిగినా తాను నల్లమల బిడ్డనేనని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘2006లో మిడ్జిల్​ జెడ్పీటీసీ సభ్యుడిగా పోటీ చేసిన నన్ను ఇక్కడి ప్రజలు గెలిపించుకున్నరు. కల్వకుర్తి ప్రాంత ప్రజలు నాటిన మొక్కను నేను.  మీ వల్లే జెడ్పీటీసీ నుంచి సీఎం స్థాయి వరకు ఎదిగిన. ఎంత ఎదిగినా నేను నల్లమల బిడ్డనే. కల్వకుర్తి ప్రాంత బిడ్డనే. మీ సోదరుడినే. ఈప్రాంత అభివృద్దికి కృషి చేస్త” అని ఆయన చెప్పారు. జైపాల్​ రెడ్డి రాజకీయ దార్శనికుడని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ‘‘రాజకీయనాయకుడి స్థాయిని పెంచిన రాజనీతిజ్ఞుడు జైపాల్​రెడ్డి” అని కొనియాడారు. 

తెలంగాణ ఏర్పాటుకు జైపాల్​ రెడ్డి ఎనలేని కృషి చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, డా.వంశీకృష్ణ, డా.రాజేష్​ రెడ్డి, యెన్నం శ్రీనివాస్​రెడ్డి, అనిరుధ్​ రెడ్డి, జి.మధుసూదన్​ రెడ్డి, ఈర్లపల్లి శంకర్, వాకిట శ్రీహరి, ప్లానింగ్​ బోర్డ్​ వైస్​ చైర్మన్​ చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్​రెడ్డి, సంపత్​కుమార్​,ఎమ్మెల్సీ దామోదర్​ రెడ్డి  పాల్గొన్నారు. 

ఆగస్టు 1న స్కిల్​ వర్సిటీకి శంకుస్థాపన

స్కిల్​ యూనివర్సిటీకి రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో శంకుస్థాపన చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి ప్రకటించారు. ‘‘రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ముచ్చర్ల వద్ద 50 ఎకరాల్లో రూ.100 కోట్లతో యంగ్​ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నం. ఆగస్టు 1న పనులు ప్రారంభిస్తం” అని ఆయన వెల్లడించారు. కల్వకుర్తి నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్​ను మంజూరు చేస్తామన్నారు. నియోజకవర్గంలో ఆర్​ అండ్​ బీ గెస్ట్​ హౌస్, ఆర్​ అండ్​ బీ రోడ్ల కోసం  రూ.180 కోట్లు ఇస్తామని చెప్పారు. హైదరాబాద్​--కల్వకుర్తి జాతీయ రహదారిని 4లేన్ల రోడ్డుగా అభివృద్ధి చేస్తామని, తాను చదువుకున్న తాండ్ర హైస్కూల్​ కోసం రూ. 5 కోట్లు కేటాయిస్తామని సీఎం ప్రకటించారు.