నేడు నాగర్​కర్నూల్​కు సీఎం

  • బిజినేపల్లిలో బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తి 

నాగర్​కర్నూల్, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డి మంగళవారం నాగర్​కర్నూల్​కు రానున్నారు. కాంగ్రెస్​ ఎంపీ క్యాండిడేట్​ మల్లు రవి నామినేషన్​తో పాటు బిజినేపల్లి మండల కేంద్రంలో నిర్వహించే బహిరంగసభలో పాల్గొంటారు. సీఎం రేవంత్​రెడ్డి సొంత జిల్లా కావడంతో, ఆయన పర్యటనను సక్సెస్​ చేసేందుకు కాంగ్రెస్​ నేతలు దృష్టి పెట్టారు. మధ్యాహ్నం ఒంటి గంటకు నాగర్​కర్నూల్​లో జరిగే నామినేషన్​కు హాజరవుతారు. 

సాయంత్రం 4 గంటలకు బిజినేపల్లి మీటింగ్​లో పాల్గొననున్నారు. పార్లమెంట్​ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి లక్ష మందిని మీటింగ్​కు తరలించేలా ప్లాన్​ చేస్తున్నారు. నాగర్​కర్నూల్​తో పాటు కొల్లాపూర్, వనపర్తి, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల నుంచి భారీగా కార్యకర్తలను తరలించేలా, ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు మండలాల వారీగా బాధ్యతలు అప్పగించారు. ఇక సోమవారం మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ అభ్యర్థి మల్లు రవి, డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ తదితరులు సభాస్థలిని పరిశీలించారు. 

ఏర్పాట్లపై సూచనలు చేశారు. సొంత జిల్లా కావడంతో స్థానిక అంశాలపై సంపూర్ణమైన అవగాహన, స్పష్టత ఉన్న సీఎం​రాజకీయ పంచులతో పాటు అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రస్తావనతో ఆకట్టుకుంటారని మల్లు రవి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్పీ వైభవ్​ గైక్వాడ్​ సీఎం సభాస్థలి ఏర్పాట్లను, బందోబస్తు కోసం తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించారు.

మద్దూరులో కార్యకర్తలతో మీటింగ్

మద్దూరు: సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం మద్దూరు మండలంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను పార్టీ కొడంగల్ ఇన్​చార్జి తిరుపతి రెడ్డి పరిశీలించారు. మండల కేంద్రంలోని గ్రీన్  ప్యాలెస్  ఫంక్షన్  హాల్ లో ఏర్పాటు చేయనున్న సభలో మాట్లాడిన అనంతరం మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో జరిగే బావోజీ జాతరలో పాల్గొని బావోజీ, కాళీమాతను దర్శించుకోనున్నారు.