చీర కట్టుకొని ముస్తాబై బస్సెక్కు .. గ్యారంటీల అమలు అప్పుడైనా తెలుస్తది : సీఎం రేవంత్ రెడ్డి

  • కేటీఆర్​కు సీఎం రేవంత్ రెడ్డి సూచన
  • జోగులాంబ సాక్షిగా ఈ నెల 9లోగా రైతుభరోసా, 
  • ఆగస్టు 15లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం
  • ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలు చేస్తున్నారు
  • గద్వాల జన జాతర సభలో సీఎం ప్రసంగం

గద్వాల, వెలుగు: ఒక్కసారి చీర కట్టుకొని ముస్తాబై బస్సెక్కితే రాష్ట్రంలో కాంగ్రెస్​ ఇచ్చిన హామీలు అమలవుతున్నాయో? లేదో? తెలుస్తుందని మాజీ మంత్రి కేటీఆర్​కు సీఎం రేవంత్​రెడ్డి చురకలంటించారు. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు కావడం లేదని చెబుతున్నారు.. కేటీఆర్​..ఒక్కసారి చీర కట్టుకొని ముస్తాబై హైదరాబాద్​లో ఆర్టీసీ బస్సెక్కు.. అక్కడి నుంచి జోగులాంబ సన్నిధి వరకు రా.. ఎవ్వరైనా ఒక్క రూపాయి టికెట్ అడిగితే 6 గ్యారెంటీలు అమలు కానట్టు.. అడగకపోతే 6 గ్యారెంటీలు అమలైనట్టు. దీనికి నీవు సిద్ధం కావాలి’ అని రేవంత్​ సవాల్​ విసిరారు. 

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్​ జన జాతర సభ నిర్వహించారు. ఈ సభకు ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అధ్యక్షత వహించగా, చీఫ్ గెస్ట్ గా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్​ మాట్లాడుతూ.. రైతులకు ఇచ్చిన హామీలో భాగంగా ఆగస్టు 15 లోగా రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామని తెలిపారు. అలాగే, మిగిలిన రైతులకు ఈ నెల 9వ తేదీలోగా రైతుభరోసా సాయాన్ని జోగులాంబ అమ్మవారి సాక్షిగా వారి అకౌంట్లలో వేస్తామని చెప్పారు. 

కారు ఇక తూకానికే..

కారు రిపేర్​ కోసం షెడ్డుకు వెళ్లలేదని.. దాని పని అయిపోయిందని.. ఆ కారును ఇక తూకానికి అమ్మేయాల్సిందేనని రేవంత్​రెడ్డి ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించామని, అవి సెమీఫైనల్ ఎన్నికలని పేర్కొన్నారు.  ప్రస్తుతం జరిగే ఎన్నికలు ఫైనల్ మ్యాచ్ లాంటివని,  తెలంగాణ వర్సెస్ గుజరాత్  మ్యాచ్​ జరుగుతున్నదని చెప్పారు. తెలంగాణ తరఫున రాహుల్ గాంధీ, గుజరాత్ తరపున నరేంద్ర మోదీ ఉన్నారని తెలిపారు. ఫైనల్ మ్యాచ్ లో కాంగ్రెస్​ను గెలిపించి దేశానికి రాహుల్​ను  ప్రధానిని చేయాలని కోరారు. మోదీ పదేండ్ల పాలనలో తెలంగాణకు బయ్యారం ఉక్కు కర్మాగారం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదని, పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేయలేదని, కేవలం గాడిద గుడ్డు మాత్రమే ఇచ్చిన బీజేపీకి, నరేంద్ర మోదీకి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కోరారు.

మనల్ని దించాలని కుట్రలు చేస్తున్నరు

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించేందుకు  కుట్రలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. పాలమూరు జిల్లాకు తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించిందని,  ఆర్డీఎస్, తుమ్మిళ్ల, నాలుగు లైన్ల రోడ్లు, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తి చేసుకుందామని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నడిగడ్డలో బంగ్లా రాజకీయాలను తిప్పి కొట్టాలని, బంగ్లోళ్లు కత్తి పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని తిరుగుతున్నారని, వారికి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. డీకే అరుణను జడ్పీటీసీ, ఎమ్మెల్యే, మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీయేనని పేర్కొన్నారు.

 కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అప్పట్లో భరత సింహారెడ్డి కోట్లు సంపాదించారని ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు బంగ్లాలు ఏకమై కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించారని చెప్పారు. ఈ ఎన్నికల్లో వారి కుట్రలను తిప్పి కొట్టి, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. కృష్ణానది– తుంగభద్ర మధ్యలో ఉన్న నడిగడ్డ పౌరుషాలకు అడ్డా అని, మాట ఇస్తే తల తెగిపడ్డా మాట మీదే ఉంటారని, అలాంటి నడిగడ్డలో ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిని లక్ష మెజార్టీతో గెలిపించాలన్నారు.

దేశ సంపదను అదానీ, అంబానీలకు కట్టబెడుతున్రు: భట్టి విక్రమార్క

ప్రధాని మోదీ ఈ దేశ సంపదను  అదానీ, అంబానీకి కట్టబెడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేశారని, దేశ ప్రజల కోసం పోరాటం చేస్తూ వారితో పాటే ఉంటానని చెప్పారన్నారు. రాజ్యాంగాన్ని కాపాడడం కోసం మోదీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తానని రాహుల్​ ప్రజలకు మాట ఇచ్చారని తెలిపారు. 

పదేండ్లు కేసీఆర్​ రాష్ట్ర సంపదను దోచుకున్నారని మండిపడ్డారు. ఈ గడ్డకు నీళ్లు రాకుండా గత బీఆర్ఎస్​ ప్రభుత్వం అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో చెయ్యి గుర్తుకు ఓటేసి.. బీఆర్ఎస్​, బీజేపీకి బుద్ధి చెప్పాలని కోరారు. ఈ సభలో కాంగ్రెస్  రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి దీపా దాస్ మున్షీ, మంత్రి జూపల్లి కృష్ణారావు, కార్యదర్శి రోహిత్ చౌదరి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, జడ్పీ చైర్​పర్సన్​ సరిత, బండ్ల చంద్రశేఖర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.