కాంగ్రెస్​తోనే రిజర్వేషన్లకు రక్షణ : సీఎం రేవంత్ రెడ్డి

  • మోదీ మనసు నిండా రాజ్యాంగాన్ని మార్చాలనే ఉంది
  • పదేండ్లు అబద్ధాలు తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదు
  • పసుపు బోర్డు ఇయ్యలే.. చక్కెర ఫ్యాక్టరీలు తెరవలే
  • రాష్ట్ర ప్రజల గొంతు కోయాలని బీజేపీ చూస్తున్నది
  • రాముడి ప్రతిష్టాపనకు 15 రోజుల ముందే అక్షింతలు పంచడం ఏ సంప్రదాయం?
  • దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి బీజేపీ లెక్క పోలింగ్​ బూత్​లో కాదు
  • 69 లక్షల మందికి రైతు భరోసా జమ చేసినం.. 
  • ఇక కేసీఆర్​ ముక్కు నేలకు రాయాల్సిందే 
  • పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసి 
  • హరీశ్​రావు పీడ వదిలిస్తా నిజాం షుగర్స్​ ఫ్యాక్టరీలు ఓపెన్​ చేయిస్తామని హామీ
  • నిజామాబాద్​, ఆర్మూర్​లో ప్రచారం

నిజామాబాద్​, వెలుగు: పదేండ్లు ప్రధాని పదవిలో ఉండి రాష్ట్రానికి మోదీ చేసింది ఏమీ లేదని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘పసుపు బోర్డు ఇస్తా అని చెప్పి ఇయ్యలే.. చక్కెర ఫ్యాక్టరీలు తెరుస్తా అని తెరువలే. చెప్పిన అబద్ధాలే మళ్లీ మళ్లీ చెప్పుతున్నరు.. అదే గుజరాత్​, యూపీ అయితే ఇట్ల వాయిదాలు వేస్తుండెనా? తెలంగాణ ప్రజలను మోసం చేయొచ్చని.. మన గొంతు కోయొచ్చని మోదీ  ఫిక్స్​ అయ్యారు” అని మండిపడ్డారు.

 మోదీ పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని అన్నారు. ‘‘మోదీ మనసు నిండా రిజర్వేషన్లను రద్దు చేయాలని, రాజ్యాంగాన్ని మార్చాలని ఉంది. రాజ్యాంగానికి గతంలో ఎప్పుడూ లేనంత ప్రమాదం పొంచి ఉంది. కాంగ్రెస్​ గెలిస్తేనే రాజ్యాంగానికి, రిజర్వేషన్లకు రక్షణ ఉంటుంది’’ అని ఆయన తెలిపారు. బుధవారం నిజామాబాద్​, ఆర్మూర్​లో కాంగ్రెస్​ అభ్యర్థి జీవన్​రెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్​షోలో సీఎం రేవంత్​ పాల్గొని.. కార్నర్​ మీటింగ్స్​లో మాట్లాడారు. 

దేవుడు గుడిలో, భక్తి గుండెలో ఉండాలని.. బీజేపీ అనుకుంటున్నట్లు పోలింగ్​ బూత్​ డబ్బాల్లో కాదని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘మీకు ఒక మాట చెప్తున్న.  హిందూ సోదరులు, హిందూ బాంధవులు గమనించాలి. అయోధ్యలో రాముల వారి ప్రతిష్టాపనకు 15 రోజుల ముందే శ్రీరాముడి అక్షింతలు ఇచ్చారు.. ఇది హిందూ సంప్రదాయమా..? ఇది దేవుడిని మోసం చేయడం కాదా? దేవుడి పేరు మీద ఓట్లు అడుక్కోవడం కాదా? ప్రజల్ని మభ్యపెట్టడం కాదా? భద్రాచలం అయినా, అయోధ్య అయినా రాములోరి కల్యాణం తర్వాతే కదా అక్షింతలు చేతికి వచ్చేది? కానీ, సంప్రదాయానికి భిన్నంగా బీజేపోళ్లు ఇంటింటికి అక్షింతలు తెచ్చి పంచారు. 

ఈ తంతుపై వేదపండితులు స్పందించాలి. శ్రీరాముడిని పూజించి హనుమంతుడ్ని కొలిచే మనకు భక్తి పూజల గురించి బీజేపీ చెప్పాల్నా? గ్రామాల్లో వ్యవసాయం చేసుకునే అందరం ఇంటి దేవతలు ఎల్లమ్మకో, పోచమ్మకో, మైసమ్మ తల్లికో  సల్లగసూడాలని కోడిని కోసి కళ్లు పోస్తం. ఇవన్నీ బీజేపీ నేర్పిందా?’’ అని సీఎం ప్రశ్నించారు. బీజేపోళ్లు దేవుడి బొమ్మ పెట్టుకొని బొచ్చలు పట్టుకొని ఓట్లు బిచ్చమడుగుతున్నారని.. ఇంతకు మించిన దుర్మార్గం, హిందూ ధర్మాన్ని వంచించడం మరొకటి ఉండదని మండిపడ్డారు. ‘‘బజార్లో దేవుడి ఫొటో పెట్టి ఓట్లడిగే వాడు బిచ్చగాడైతడు తప్ప భక్తుడెట్లయితడు” అని ఆయన ప్రశ్నించారు. 

కేసీఆర్​ ముక్కునేలకు రాయాలి

‘‘చెప్పిన టైంకు ముందే రైతు భరోసా ఇచ్చిన. ఈ నెల 9లోపు రైతులందరికీ రైతుభరోసా సొమ్ము ఇస్తనని అమరవీరుల స్థూపం సాక్షిగా ప్రమాణం చేసిన. వేయలేని పక్షంలో నేను ముక్కునేలకు రాస్తా.. వేస్తే కేసీఆర్​ రాయాలని సవాల్​ విసిరిన. ఇచ్చిన టైంకు ముందే 6 తారీఖున రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఆఖరు రూపాయి వరకు రైతుభరోసా జమచేసిన. ఇప్పుడు కేసీఆర్​ను అడుగుతున్న.. ఆయనకు ఏమాత్రం సిగ్గు, మానం ఉన్నా అమరవీరుల స్థూపం దగ్గరికి గానీ, లేదంటే ఆర్మూర్​ అంబేద్కర్​ చౌరస్తాకు గానీ వచ్చి రైతుల ఖాతాలు చెక్​చేసి ముక్కు నేలకు రాయాలి’’​ అని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. 

మీ అన్నగా, తమ్ముడిగా చెప్తున్న. రేవంత్​ ఒక్కసారి మాట ఇస్తే వెనక్కి వెళ్లడు. ఈ పదేండ్లలో నాపై ఎన్ని కేసులు పెట్టినా.. ఎన్ని అరెస్టులు చేసినా, జైలుకు పంపినా లక్షలాది మంది కార్యకర్తల కోసం కొట్లాడి ఇందిరమ్మ రాజ్యం తెచ్చిన. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన పంద్రాగస్టు నాడు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ నుంచి స్వాతంత్ర్యం ఇచ్చి సిద్దిపేటకు పట్టిన శనీశ్వర్​రావు (హరీశ్​​రావు) పీడను తొలగిస్త’’  అని ప్రజలకు తెలిపారు. హరీశ్​​రావు రాజీనామా లెటర్​తో రెడీగా ఉండాలని ఆయన సూచించారు. ఆర్మూర్​ సిద్దులగుట్ట సాక్షిగా రైతు రుణమాఫీ ఆగస్టు 15న చేస్తా అని స్పష్టం చేశారు. 

ఇందూరు రైతులు పౌరుషవంతులు

‘‘ఇందూరు రైతులు పౌరుషవంతులు. ప్రధాని మోదీ చేసిన వ్యవసాయ నల్ల చట్టాల రద్దుకు హర్యానా, పంజాబ్​ రైతులు ఉద్యమించి మెడలు వంచేదాకా వెనక్కు వెళ్లలే. అంతటి పౌరుషం, పట్టుదల, ఆత్మగౌరవం ఉన్న రైతులు ఇందూర్​లోని ఆర్మూర్​లో ఉన్నరు. పంటలకు గిట్టుబాటు ధర, పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఆర్మూర్​ రైతులు ధర్నా, దీక్షలు నిర్వహించి అప్పుడు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న నన్ను ఆహ్వానించారు. గ్రామగ్రామాల నుంచి మీరంతా నాకు అండగా నిలబడిన తీరు చూసి సోనియాగాంధీ నన్ను పీసీసీ ప్రెసిడెంట్​ చేశారు.

 మీరిచ్చిన బలంతో రాష్ట్రమంతా తిరిగి ప్రతి ఇంటి తలుపును, ప్రతి గుండెను తట్టిన. తండాలు, గూడేలు తిరిగిన. నాలుగు కోట్ల మంది ప్రజలను సమన్వయం చేసిన ఫలింతంగా 65 సీట్లను గెలిపించి నన్ను ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబెట్టారు. రైతుల్ని మోసం చేసినందుకు కేసీఆర్​ను బండకేసి కొట్టారు. కేసీఆర్​ కూతురు కవిత వంద రోజుల్లో చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తానని నమ్మించి 2014 ఎన్నికల్లో పోటీ చేస్తే పార్లమెంట్​కు పంపారు. అండగా నిలబడ్డ అదే రైతులు మోసం చేసిన కవితను 2019లో ఓడించి ప్రతాపం చూపారు” అని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘2019లో  ఒక గుండాయన గెలిచిన ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని బాండ్​ పేపర్​రాసి ఇచ్చిండు.  బీజేపీలో ముఖ్య నేతలైన రాజ్​నాథ్​సింగ్, రాంమాధవ్​ను కూడా పిలిపించి చెప్పించారు. 

నమ్మి గుండును పార్లమెంట్​కు ఇక్కడివాళ్లు పంపారు. ఎంపీ పదవి వచ్చి ఐదేండ్లయింది. మోదీ ప్రధాని పదవి చేపట్టి పదేండ్లయింది. ఇప్పుడు మోదీ మళ్లా వచ్చి అర్వింద్​ను గెలిపిస్తే పసుపు బోర్డు ఇస్తానని కొత్తగా చెప్తున్నడు. ఎలా నమ్ముతాం? ధర్మపురి అర్వింద్​ మరోసారి నమ్మించి గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నడు. అసెంబ్లీ ఎన్నికల్లో  బీజేపీని గెలిపించిన చోట్ల ప్రజలు పెనం మీద నుంచి పొయ్యిలో  పడ్డట్టయింది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. 

ఆర్మూర్​లో గెలిచిన ఎమ్మెల్యే రాకేష్​ రెడ్డిని ప్రధాని మోదీ నుంచి ఎన్ని ఫండ్స్​ తెచ్చిండో అడగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​ అభ్యర్థి టి.జీవన్​రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ, ఎమ్మెల్సీ మహేష్​గౌడ్,  ఎమ్మెల్యేలు సుదర్శన్​రెడ్డి, డాక్టర్​ భూపతిరెడ్డి, మున్సిపల్​ చైర్​పర్సన్​ లావణ్య,  మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్​రావు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్​ మానాల మోహన్​రెడ్డి, నేతలు  అన్వేష్​రెడ్డి, ముత్యాల సునీల్​రెడ్డి, పొద్దుటూరి వినయ్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

చక్కెర ఫ్యాక్టరీలు ఓపెన్​ చేస్తం

క్లోజ్ ​అయిన నిజాం చక్కెర ఫ్యాక్టరీలను ఓపెన్​ చేసే బాధ్యత తనదేనని, మంత్రి శ్రీధర్​బాబు నేతృత్వంలో సబ్​ కమిటీని ఏర్పాటు చేశామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. బ్యాంకు గ్యారెంటీ కింద ఈమధ్యే రూ. 42 కోట్లు చెల్లించామని, తప్పక నడుపుతామని, స్వతహాగా రైతు అయిన తాటిపత్రి జీవన్​రెడ్డి ఎంపీగా గెలిస్తే  పసుపు బోర్డు వస్తుందని చెప్పారు. ‘‘పదేండ్లు రాష్ట్రంలో అధికారంలో ఉండే కాంగ్రెస్​ పార్టీ రైతుల పంటలన్నింటికీ గిట్టుబాటు ధర చెల్లించి కొంటది. వడ్లకు రూ.500 బోనస్​ ఇస్తం. ఎర్రజొన్న, మక్కజొన్న రైతులకు మేలు జరుగుతది’’ అని అన్నారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్​ అహంకారానికి ఆరడుగుల రూపమని, అర్వింద్​ను ఇంటికి పంపి, కాంగ్రెస్​ అభ్యర్థి టి.జీవన్​రెడ్డిని గెలిపించాలని సీఎం రేవంత్​రెడ్డి కోరారు.