సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. తెలంగాణ భవిష్యత్​ రూట్ ​మ్యాప్​

ప్రపంచ అత్యున్నత స్థాయి కంపెనీల అధిపతులతో చర్చలు.. దాదాపు పదిరోజులకు పైగా ఎడతెరిపి లేని సమావేశాలు, తొలిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించినా ఎక్కడా హంగు, ఆర్భాటం లేదు. ప్రచార పటాటోపం లేదు. కేవలం రాష్ట్రాభివృద్ది, తెలంగాణ యువతకు బంగారు భవిత ఇవే తన ఆలోచనలు. తన పని తాను చేసుకుపోయే కార్యసాధకుడిలా తెలంగాణను ఫ్యూచర్ స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిర్మించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న కృషి ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

విభిన్న వాతావరణ పరిస్థితులు ఉండే అమెరికాలోని న్యూయార్క్ మొదలు, న్యూజెర్సీ, కాలిఫోర్నియా, శాన్ ప్రాన్సిస్కో, ఫిలడెల్పియా, వాషింగ్టన్ డీసీ, డల్లాస్ వంటి ప్రాంతాలు ఒకవైపు, ఈస్టర్న్ ఆసియా ఖండంలో ఉండే దక్షిణ కొరియా మరోవైపు ఇవేవీ మన ముఖ్యమంత్రి సంకల్పాన్ని  ప్రభావితం చేయలేకపోయాయి. పదిరోజుల అంతర్జాతీయ ప్రయాణాలు ముగించుకొని ప్లైట్ దిగిన గంటల్లోనే ఈ పర్యటనలో తాను సాధించుకొచ్చిన ఉద్యోగాల్లో సగం సత్వరంగా తెలంగాణ యువతకు అందించే దిశగా 15వేలకు పైగా ఉద్యోగాలను అందించే కాగ్నిజెంట్ కంపెనీ 10 లక్షల చదరపు అడుగుల విస్తరణకు శంకుస్థాపన చేయడం నభూతో నభవిష్యత్.

రూ.31,532 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు

అమెరికాలోని ప్రతి రాష్ట్రం ఒక నిర్దిష్ట లక్ష్యంతో ముందుకుపోతున్నాయి కాబట్టే అగ్రరాజ్యంగా నిలిచిందనేది మన ముందున్న సత్యం. అదే స్ఫూర్తితో దేశంలో, ప్రపంచంలో అగ్రగామిగా నిలపడానికి తెలంగాణను సైతం ప్యూచర్ స్టేట్ అని అభివర్ణిస్తూ మనవైన లక్ష్యాలను నిర్దేశించారు సీఎం రేవంత్ రెడ్డి.

4 నుంచి 10వ తేదీ వరకూ అమెరికా ఆ తర్వాత 14వ తేదీ వరకూ సౌత్ కొరియాలో పర్యటించి కేవలం అమెరికాలోని 19 ప్రపంచ స్థాయి కంపెనీలతో విస్తృత చర్చలు జరిపి వారం రోజుల్లోనే 31,532 కోట్ల పెట్టుబడులు సాధించడం సామాన్య విషయం కాదు, తెలంగాణలో ఈ పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా 30,750 ఉద్యోగాలు రావడమే కాదు ఆయా కుటుంబాల్లో స్వచ్ఛమైన ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి.

తెలంగాణలో దక్షిణకొరియా పెట్టుబడులు

 ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ రంగంలో ప్రపంచానికే తలమానికంగా ఉన్న దక్షిణ కొరియా.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావడం హర్షణీయం. ఏ రాజకీయ నేత చేయనివిధంగా రూ.4500 కోట్ల పెట్టుబడుల్ని ఆరు అతిపెద్ద కొరియన్ కంపెనీల నుంచి తేగలిగారు. లార్జెస్ట్ కంపెనీ ఎల్జీ మాతృసంస్థ ఎల్ఎస్ సంస్థ చైర్మన్ కు-జాఉన్​తో భేటీ, పోక్సో, సియోల్ సెమీ కండక్టర్, సామ్​సంగ్ వంటి కంపెనీల ప్రతినిధులతో మీటింగులు నిర్వహించి ఫ్యూచర్ స్టేట్ తెలంగాణలో గల అవకాశాలను వివరించారు.

ప్రపంచ ప్రతిష్టాత్మక కంపెనీ హ్యుందయ్ మోటార్స్ హైదరాబాద్​లో  తమ ఆర్ అండ్ డి సెంటర్ ఏర్పాటుతోపాటు మెగా ఆటోమోటివ్ టెస్ట్ సెంటర్​ విస్తరించడానికి ఒప్పించారు. ఫ్యాషన్ ప్రపంచానికి మకుటాయమానమైన యంగ్ వన్ కంపెనీని హైదరాబాద్​కు తీసుకొస్తున్నారు, కొరియన్ బ్యూటీ ఇండస్ట్రీని మొత్తం రిప్రజెంట్ చేసే కొబిటా సంస్థతో ఎంవోయూని కుదుర్చుకున్నారు అలాగే కొరియన్ టెక్స్​ టైల్ ఫెడరేషన్ కొఫోటీతో ఒప్పందం, ఫార్మా జాయింట్ డాంగ్​బాంగ్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు, జేఐ టెక్, చావీ వంటి ఆరు కంపెనీలతో చర్చలు జరిపి విజయవంతంగా వారిని తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించారు. తెలంగాణను మరో మెట్టు ముందుకు తీసుకుపోయే ఇలాంటి విజయవంతమైన పర్యటన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందానికి, తెలంగాణ ప్రభుత్వానికి ఈ సందర్భంగా నా అభినందనలు.

పక్కా ప్రణాళికతో తెలంగాణకు సరికొత్త భవిష్యత్తు

అమెరికా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తెలంగాణ టీం ఒక్క క్షణం వృథా చేయకుండా కేవలం లక్ష్యంపైనే దృష్టి సారించారు. పక్కా ప్రణాళికతో  చేసిన కృషి నేడు తెలంగాణకు సరికొత్త భవిష్యత్తును ఇవ్వబోతోంది. ఆరు రోజుల అమెరికా పర్యటనలో ప్రపంచ సాంకేతిక దిగ్గజ కంపెనీలైన గూగుల్, ఆపిల్ సంస్థలను సందర్శించి తెలంగాణలో వారి విస్తరణకు గల అవకాశాలను వివరించడం,  అదే స్థాయిలో ప్రపంచానికి మేధావులను అందజేస్తున్న  ప్రఖ్యాత స్టాన్ ఫోర్డ్ వర్సిటీని సందర్శించి మన దగ్గర స్టాన్ ఫోర్డ్ శాటిలైట్ సెంటర్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవడం అతి పెద్ద ముందడుగు.

ఇక హైదరాబాద్ 4.0లో అతి ముఖ్యమైన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ,  న్యూ లైఫ్ సైన్సెస్  యూనివర్సిటీలలో స్టాన్ ఫోర్డ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థను భాగస్వామిని చేయడంలో సీఎం రేవంత్ సారథ్యంలోని బృందం సఫలీకృతులు కావడం మన యువతకు  వరం. ఈ పర్యటన ద్వారా సాధించిన పెట్టుబడులతో వచ్చే అవకాశాలకు సైతం నైపుణ్యవంతమైన మానవ వనరుల్ని ఈ స్కిల్ యూనివర్సిటీ ద్వారా అందించే ఈ ప్రయత్నం రేవంత్ సర్కార్ ముందుచూపుకు, నిర్దిష్ట కార్యాచరణకు నిదర్శనం. 

ప్రపంచస్థాయి ఫార్మాహబ్​గా తెలంగాణ

ప్రపంచస్థాయి ఫార్మాహబ్​గా  తెలంగాణను తీర్చిదిద్దడానికి రేవంత్ సర్కార్ కృతనిశ్చయంతో ఉంది.  ప్రతిష్టాత్మక స్టాన్ ఫోర్డ్ యూని వర్సిటీ బయో విభాగంతోపాటు  కార్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెమిస్ట్రీ హబ్ ఏర్పాటు, వివింట్ ఫార్మా జీనోమ్ వాలీలో ఏర్పాటు, ఆమ్జెన్ నూతన ఆర్ అండ్ డీ సెంటర్ ఏర్పాటు, హెచ్సీఏ హెల్త్ కేర్ విస్తరణ, జొయిటిస్ విస్తరణ,   థర్మో ఫిసర్ సైంటిఫిక్ విస్తరణ వంటివి ఫార్మా దాని అనుబంధ రంగాల్లో విప్లవాత్మక ఆవిష్కరణలతో పాటు తెలంగాణ యువతకు బంగారు భవిష్యత్తును అందించబోతున్నాయి. ఇప్పటికే అమెజాన్ వెబ్ సర్వీసెస్ డాటా సెంటర్ ముఖ్యమంత్రి బృందం కృషితో మరింతగా విస్తరించి హైదరాబాద్​ను తమ మెయిన్ క్యాంపస్​గా మార్చబోతోంది.

దీంతోపాటు ఆరమ్ ఈక్విటీ సైతం 100 MW AI పవర్డ్ డాటా సెంటర్​ను ఏర్పాటు చేయబోతుంది. అటోమొబైల్ రంగంలో గణనీయ మార్పులను తీసుకొచ్చిన ఈవీ విప్లవాన్ని సైతం తెలంగాణలో సృష్టించబోతోంది మన ప్రజా ప్రభుత్వం.  మోనార్క్ ట్రాక్టర్ కంపెనీ దేశంలోనే తమ హెడ్ క్వార్టర్​గా హైదరాబాద్​ను  ప్రకటించింది. బ్యాటరీ రంగంలో టైకూన్  ఎనోవిక్స్ సైతం తమ రీసెర్చ్​ సెంటర్​ను మన దగ్గరే ప్రారంభించబోతోంది. ఇక పీ ఆండ్​ జీ కంపెనీ, స్వచ్ఛ్ బయో, వాల్ష్ కర్రా హోల్డింగ్స్ సైతం తెలంగాణ ప్రగతిలో తమవైన తోడ్పాటును అందించడానికి ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి.

ఇలా అమెరికా పర్యటనలో ఒకవైపు కంపెనీలతో ఏంవోయూలు కుదుర్చుకుంటూనే ఏఐలో యూనికార్న్ కంపెనీలతో చర్చలు జరిపారు రేవంత్ బృందం. ఐటీ సర్వ్ అలయన్స్ మీటింగులు, అమెరికా ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తున్న ఎన్నో కంపెనీలకు అడ్వైజర్​గా పనిచేస్తున్న రామ్ చరణ్ లాంటి బిజినెస్ ఎనలిస్ట్​తో రాష్ట్రాభివృద్ధికి చర్చలు జరిపారు. అడోబ్  సీఈవో శంతను నారాయణ్​తో సమావేశమై తెలంగాణ ఎందుకు టెక్కీల గమ్య స్థానమో వివరించారు, ఆర్థికంగా ముందుండే ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగాతో తెలంగాణ అవకాశాలపై చర్చలు జరిపారు.

- బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి 
సీఈవో, టిశాట్ నెట్​వర్క్.అధ్యక్షుడు, తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక