ఓల్డ్ సిటీకి మెట్రోలో వచ్చి ఓట్లడుగుతం: సీఎం రేవంత్

  • కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా 2029కల్లా పూర్తి చేస్తం
  • కొడంగల్ నుంచి కాంగ్రెస్ బీఫామ్ పై అక్బరుద్దీన్ పోటీ చేస్తే గెలిపించే బాధ్యత నాది
  • డిప్యూటీ సీఎంను చేసి పక్కన కూర్చోబెట్టుకుంటానని హామీ  
  • అసెంబ్లీలో రేవంత్, అక్బరుద్దీన్ మధ్య ఆసక్తికర సంభాషణ 

హైదరాబాద్, వెలుగు: వచ్చే ఎన్నికల నాటికి పాతబస్తీ మెట్రో ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 2029లో చాంద్రాయణగుట్టకు మెట్రోలోనే వచ్చి ఓట్లు అడుగుతామని చెప్పారు. కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా నాలుగేండ్లలో పాతబస్తీ మెట్రోను పూర్తి చేస్తామని తెలిపారు. మెట్రో నిర్మాణంపై ఎల్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌ టీతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. 

శనివారం అసెంబ్లీలో పాతబస్తీ మెట్రో ప్రాజెక్టుపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రశ్నించారు. పాతబస్తీకి మెట్రో రైలు వస్తుందంటూ కొన్నేండ్లుగా ఊరిస్తున్నారు తప్ప రావట్లేదని అన్నారు. దీనిపై సీఎం రేవంత్ స్పందిస్తూ.. ‘‘ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని మేం మాటలతో కాలయాపన చేయం. అక్బరుద్దీన్‌‌‌‌‌‌‌‌కు నేను మాట ఇస్తున్నా. 2029 ఎన్నికల నాటికి మెట్రో రైల్‌‌‌‌‌‌‌‌లో ఓల్డ్ సిటీలో తిరుగుతాం. మేం ఏం చెప్పామో అది చేసి తీరుతాం. కేంద్రం నిధులు ఇచ్చినా. ఇవ్వకపోయినా ఓల్డ్ సిటీ మెట్రో పూర్తి చేస్తాం’’ అని హామీ ఇచ్చారు.  

మా దోస్తానా ఎట్లుంటదో చూడు

‘‘పదేండ్లు బీఆర్ఎస్​తో దోస్తానా చేసిన్రు. ఇక రాబోయే నాలుగేండ్లు మా దోస్తనా ఎట్లుంటదో చూడు’’ అని అక్బరుద్దీన్ ను ఉద్దేశించి రేవంత్​సరదాగా అన్నారు. ‘‘రెండో దశ మెట్రో ప్రాజెక్టు కోసం కేంద్రానికి నివేదిక ఇచ్చినం. కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడం ప్రయత్నిస్తాం. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా అభివృద్ధి ఆగదు. రుణాలు ఇవ్వడానికి ఆర్థిక సంస్థలు, పీపీపీ మోడల్​లో చేసేందుకు ప్రైవేట్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. 16 కిలో మీటర్లలో పూర్తయ్యే మెట్రోను 32 కిలో మీటర్లకు పెంచి హైటెక్‌‌‌‌‌‌‌‌ సిటీ నుంచి ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టుకు గత ప్రభుత్వం టెండర్లు పిలిచింది. 

కొందరు రియల్టర్లకు భూముల ధరలు పెంచేందుకే ఆ మార్గంలో మెట్రో మార్గం ప్రతిపాదించారు. ఫైనాన్షియల్‌‌‌‌‌‌‌‌ డిస్ట్రిక్ట్, జూబ్లీహిల్స్, హైటెక్​ సిటీ ప్రాంతాల నుంచి ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టుకు మంచి రోడ్లు, ఓఆర్ఆర్​ఉంది. మాస్​ట్రాన్స్​పోర్ట్​ఉన్నకాడ కాకుండా, మెట్రో అవసరం లేని మార్గాల్లో నిర్మాణానికి టెండర్లు పిలిచారు. అందుకే మా ప్రభుత్వం దాన్ని మార్చింది. ఎల్బీనగర్‌‌‌‌‌‌‌‌ నుంచి ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టుకు మెట్రోను నిర్మించనున్నాం. 

పాతబస్తీ ప్రజలకు మేలు జరిగేలా చాంద్రాయణగుట్ట మీదుగా మెట్రో నిర్మాణం పూర్తి చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే భూసేకరణ మొదలుపెట్టాం. దీనికి రూ.2,600 కోట్లు అవసరం అవుతుంది” అని తెలిపారు.  

అక్బర్ కాంగ్రెస్ నుంచి గెలిస్తే డిప్యూటీ సీఎం పదవి.. 

అసెంబ్లీలో సీఎం రేవంత్, అక్బరుద్దీన్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ‘‘ఓబీసీలపై అక్బరుద్దీన్​కు ప్రేమ ఉంది. వచ్చే ఎన్నికల్లో చాంద్రాయణగుట్టలో మా పార్టీ ఓబీసీ అభ్యర్థిని గెలిపించేందుకు అక్బరుద్దీన్​ సహకరించాలి” అని కోరారు. దీనిపై అక్బరుద్దీన్ స్పందిస్తూ..​‘‘నేను కొడంగల్​నుంచి పోటీ చేస్తాను” అని నవ్వుతూ అన్నారు. వెంటనే స్పందించిన సీఎం రేవంత్.. అక్బరుద్దీన్ చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, కాంగ్రెస్ బీ ఫామ్‌‌‌‌‌‌‌‌పై కొడంగల్ నుంచి పోటీ చేస్తే గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. 

ఆ తర్వాత డిప్యూటీ సీఎంను చేసి పక్కనే కూర్చోబెట్టుకుంటానని అన్నారు. అయితే మజ్లిస్ పార్టీలో తాను సంతోషంగానే ఉన్నానని, పార్టీ మారే ప్రసక్తే లేదని అక్బరుద్దీన్ అన్నారు. కాగా.. ఇటీవల లోక్ సభ ఎన్నికల టైమ్ లో తనపై, కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై పోలీసులు కేసు పెట్టారని అక్బరుద్దీన్ తెలిపారు. అయితే అమిత్ షాపై కేసును కొట్టేసి, తప్పు లేకపోయినా తనపై కేసు మాత్రం కొనసాగిస్తున్నారని చెప్పారు.