పాలమూరు పసిడి పంటలతో విలసిల్లాలి

  • కురుమూర్తి పర్యటనలో సీఎం ఎనుముల రేవంత్​ రెడ్డి
  • కురుమూర్తి, మన్యంకొండ డెవలప్​మెంట్​కు ప్రపోజల్స్​ రెడీ చేయాలని కలెక్టర్​కు ఆదేశం

చిన్నచింతకుంట, వెలుగు: ఎడారిగా మారి వలసలు పోతున్న పాలమూరు జిల్లాలో పసిడి పంటలు పండాలని, పచ్చని పైర్లతో విలసిల్లాలని సీఎం ఎనుముల రేవంత్​ రెడ్డి ఆకాంక్షించారు. మహబూబ్​నగర్​ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్​ శివారులోని కురుమూర్తి క్షేత్రాన్ని ఆదివారం మధ్యాహ్నం ఆయన దర్శించుకున్నారు. రోడ్డు మార్గాన హైదరాబాద్​ నుంచి ఉదయం పదిన్నర గంటలకు బయలుదేరిన ఆయన జడ్చర్ల, కొత్తకోట, మదనాపురం మీదుగా మధ్యాహ్నం 12.45కు చేరుకున్నారు. 

12.55కు రూ.110 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, దామోదర రాజనర్సింహతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఒంటి గంటకు మెట్ల మార్గం ద్వారా కురుమూర్తి కాంచన గుహ వద్దకు చేరుకున్నారు. 

వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు ఆయనకు వేంకటేశ్వరుడి జ్ఞాపికను అందజేసి శాలువాతో సత్కరించారు. దాదాపు అరగంట పాటు ఆయన ఆలయంలోనే గడిపారు. ఒకటిన్నర తర్వాత దిగువన జాతర మైదానంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. కురుమూర్తి, మన్యంకొండ క్షేత్రాల అభివృద్ధికి ఎండోమెంట్​ డిపార్ట్​మెంట్​తో కలిసి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్​ను ఆదేశించారు.

వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి పనులు పూర్తి చేస్తాం..

పాలమూరు వెనుకబడిన జిల్లా అని, కలియుగ దైవంగా కురుమూర్తిని భావిస్తారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తెలిపారు. 2009లోనే ఇక్కడ ఘాట్​ రోడ్డును వేయాలనుకున్నామని, కానీ కార్యరూపం దాల్చలేదన్నారు. దసరా ముందు కురుమూర్తికి వచ్చే పిల్లలు, పెద్దలు, దివ్యాంగులు పైకి ఎక్కలేపోతున్నారని స్థానిక ఎమ్మెల్యే జీఎంఆర్​ తన దృష్టికి తెచ్చారని, సీఎంను ఒప్పించి ఘాట్ రోడ్డు శాంక్షన్​ చేయించుకున్నామని చెప్పారు. నెల రోజుల్లోనే శంకుస్తాపన చేశాం. వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి పనులు పూర్తి చేస్తామని తెలిపారు.

 కార్యక్రమంలో ప్లానింగ్  కమిషన్  వైస్  చైర్మన్  జిల్లెల చిన్నారెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, కలెక్టర్  విజయేందిర బోయి, ఎస్పీ జానకి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, పర్ణికారెడ్డి, తూడి మేఘారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్​రెడ్డి, మాజీ జడ్పీ చైర్​పర్సన్​ స్వర్ణా సుధాకర్ రెడ్డి, గద్వాల కాంగ్రెస్  పార్టీ ఇన్​చార్జి సరిత, ఆలయ చైర్మన్​ గోవర్దన్​ రెడ్డి, ఆత్మకూర్​ సంస్థానాధీశులు రాజా రాంభూపాల్  పాల్గొన్నారు.

దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్​ రెడ్డి మాట్లాడుతూ కురుమూర్తి క్షేత్రానికి రావాలని ఆహ్వానించిన వెంటనే వేంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తానని సీఎం హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం స్వామి దర్శనం చేసుకున్నారని తెలిపారు. అలాగే ఘాట్​ రోడ్డు నిర్మాణానికి రూ.110 కోట్లు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 

పదేండ్లు అధికారంలో ఉన్న గత ప్రభుత్వం ఈ క్షేత్రాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు. ఈ స్వామి ఉమ్మడి జిల్లా ప్రజలు ఇలవేల్పుగా కొలుస్తారన్నారు. ఈ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. ప్రతి అమావాస్యకు 30 వేల మంది భక్తులు వస్తారని, వారికి కల్యాణ కట్ట, కల్యాణ మండపం, కాటేజీలు నిర్మించాలని ఇందు కోసం మరిన్ని నిధులు ఇవ్వాలని సీఎంను కోరారు.