ఆ జీవోతో నిరుద్యోగులకు అన్యాయం

  • రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నరు : హరీశ్ రావు 
  • ఎస్సీ, బీసీ, మైనార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు స్పందించాలని డిమాండ్

సిద్దిపేట, వెలుగు :  రిజర్వేషన్ల అమలు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌‌‌‌ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌రావు ఆరోపించారు. జీవో 29 కారణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన క్యాండిడేట్లకు అన్యాయం జరుగుతోందన్నారు. సిద్దిపేట క్యాంప్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లో శని వారం మీడియాతో ఆయన మాట్లాడారు. రాజ్యాంగాన్ని భగవద్గీతతో పోలుస్తున్న సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి.. దానిని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.

టాప్‌‌‌‌ మార్కులు వచ్చిన వారికి సైతం రిజర్వేషన్లు అప్లై చేయడం వల్ల కొందరికి నష్టం జరుగుతుందని, ఓపెన్‌‌‌‌ కేటగిరీలో ఎంపికైన వారిని రిజర్వేషన్లకు కన్సిడర్‌‌‌‌ చేయొద్దన్నారు. దళిత వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్‌‌‌‌లో ఉన్న దళిత, బలహీన, మైనార్టీ వర్గాల ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డిని నిలదీయాలని సూచించారు.

హక్కులు కాపాడాలని రోడ్ల మీదకు వస్తున్న స్టూడెంట్లను పోలీసులు అణచివేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఓట్ల కోసం గతంలో అశోక్‌‌‌‌నగర్‌‌‌‌కు వచ్చిన రేవంత్‌‌‌‌రెడ్డి.. ఇప్పుడు సెక్యూరిటీ లేకుండా అశోక్‌‌‌‌నగర్‌‌‌‌కు వెళ్లాలని సవాల్‌‌‌‌ చేశారు. నిరుద్యోగుల గొంతుక అవుతానన్న కోదండరాం.. ఇప్పుడు మౌనంగా ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. కోదండరాం, రియాజ్, ఆకునూరి మురళి, నవీన్‌‌‌‌ లాంటి వాళ్లు అశోక్‌‌‌‌నగర్‌‌‌‌కు రావాలన్నారు.