పాలమూరు అభివృద్ధిపై సీఎం స్పెషల్​ ఫోకస్

  • వలసల నివారణ, విద్యాభివృద్ధే టార్గెట్​

మహబూబ్​నగర్, వెలుగు : వెనకబడిన పాలమూరు జిల్లాపై సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్  పెట్టారు. వలసల నివారణతో పాటు సాగు, తాగునీటిని అందించేందుకు యాక్షన్ ప్లాన్​ రూపొందించారు. అక్షరాస్యతలోనూ వెనకబడడంతో కాలేజీల నిర్మాణానికి ఫండ్స్  కేటాయిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే సొంత జిల్లాకు సీఎం భారీగా నిధులు కేటాయించి, అభివృద్ధికి బాటలు వేస్తున్నారు.

విద్యాభివృద్ధిపై నజర్..​

టెన్త్​ పాస్​ అయ్యాక ఇంటర్, డిగ్రీ, ఇతర ఉన్నత చదువులు చదివేందుకు మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల స్టూడెంట్లు పట్టణ ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఆర్థిక స్తోమత లేని స్టూడెంట్లు చదువు మానేసి వ్యవసాయ, వలస కూలీలుగా మారుతున్నారు. ఈ ఇష్యూను సీరియస్​గా తీసుకున్న సీఎం ప్రతి మండలంలో ఇంటర్, డిగ్రీ​ కాలేజీలు నిర్మించేలా ప్లాస్​ చేస్తున్నారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే కొడంగల్​లో రూ.5 కోట్లతో గిరిజన సంక్షేమ హాస్టల్ బిల్డింగ్, రూ.25 కోట్లతో మైనార్టీ రెసిడెన్షియల్  స్కూల్​కు శాశ్వత భవనం, రూ.7.13 కోట్లతో దౌల్తాబాద్ జూనియర్ కాలేజీ

రూ.7.13 కోట్లతో బొంరాస్​పేటలో జూనియర్ కాలేజీ, రూ.25 కోట్లతో నీటూర్ గ్రామంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీ, రూ.360 కోట్లతో చంద్రకల్ గ్రామంలో వెటర్నరీ కాలేజీ, రూ.30 కోట్లతో కోస్గిలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ, రూ.11 కోట్లతో కోస్గిలో ఉమెన్స్​ డిగ్రీ కాలేజ్, రూ.20 కోట్లతో మద్దూరులో బాలికల సోషల్  వెల్ఫేర్  రెసిడెన్షియల్  స్కూల్, జూనియర్ కాలేజ్, రూ.25 కోట్లతో కొడంగల్​లో బాలుర సోషల్  వెల్ఫేర్  రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కాలేజ్, రూ.224.50 కోట్లతో మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, ఫిజియోథెరపీ కాలేజీ

220 పడకల హాస్పిటల్​ నిర్మాణానికి ఫండ్స్​ కేటాయించారు. పాలమూరు యూనివర్సిటీకి రూ.వంద కోట్లు కేంద్రం నుంచి మంజూరు చేయించేలా చొరవ తీసుకున్నారు. ఇదే వర్సిటీలో లా, ఇంజనీరింగ్​ కాలేజీని మంజూరు చేయించారు. ఈ రెండు జిల్లాల్లో విద్యాభివృద్ధికి మరిన్ని నిధులు వెచ్చించేందుకు సీఎం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

సాగునీటికి ప్రాధాన్యం..

ఉమ్మడి జిల్లాలోని గద్వాల, నారాయణపేట, వనపర్తి, నాగర్​కర్నూల్, పాలమూరు జిల్లాలు ఉండగా, నారాయణపేట, పాలమూరు జిల్లాల నుంచే వలసలు ఎక్కువగా ఉన్నాయి. సాగు యోగ్యమైన భూములున్నా సాగునీరు లేకపోవడంతో ఈ రెండు జిల్లాల నుంచి దాదాపు రెండు లక్షల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఈ వలసల నివారణపై సీఎం ఫోకస్​ పెట్టారు. గత ప్రభుత్వం పక్కన పెట్టిన జీవో 69 ద్వారా చేపట్టాల్సిన ‘కొడంగల్–-నారాయణపేట’ స్కీమ్​ను టేకప్​ చేశారు. ఈ స్కీం ద్వారా 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు.

భీమా ప్రాజెక్టులో భాగమైన సంగంబండ ముంపు నిర్వాసితులు రూ.10 కోట్ల పరిహారం మంజూరు చేయించారు. పరిహారం పెండింగ్​ ఉండడంతో 20 ఏండ్లుగా సంగంబండ మెయిన్​ కెనాల్​ కింద బండ తొలగింపు పనులు నిలిచిపోయాయి. ఈ పరిహారం మంజూరుతో బండ తీసేందుకు వీలు పడింది. దీంతో ఈ కెనాల్ ద్వారా 30 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. అలాగే కోయిల్​సాగర్​ కింద పెండింగ్​లో ఉన్న కాలువల పనులు త్వరలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు.

వరుస పర్యటనలు..

పాలమూరుపై స్పెషల్​ ఫోకస్​ పెట్టిన సీఎం త్వరలో జరిగే లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ క్యాండిడేట్​ను గెలిపించుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నారు. తన సొంత నియోజకవర్గమైన కొడంగల్​ నుంచే 50 వేల మెజార్టీ ఇప్పించాలని ఇటీవల నిర్వహించిన కార్యకర్తల సమావేశాల్లో క్యాడర్​కు సూచించారు. అలాగే పాలమూరు పార్లమెంట్​ నుంచి కాంగ్రెస్​ పార్టీ క్యాండిడేట్​ చల్లా వంశీచంద్​రెడ్డికి లక్ష మెజార్టీ ఇప్పించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యేలు

పార్టీ నేతలతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. ఇప్పటికే ఈ పార్లమెంట్​ పరిధిలో సీఎం ఫిబ్రవరి 21న, మార్చిలో 6, 13, 28 తేదీల్లో పర్యటించారు. ఈ నెలలో 8న నారాయణపేటలో సభ నిర్వహించగా, 19న పాలమూరు సభలో పాల్గొన్నారు. వచ్చే మంగళవారం తన నియోజకవర్గంలోని మద్దూరులో సీఎం పర్యటిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు.