రేపు సీఎల్పీ సమావేశం

  • రాజ్యసభ ఎన్నికల్లో అభిషేక్ సింఘ్వీ గెలుపుపై చర్చ

హైదరాబాద్/న్యూఢిల్లీ, వెలుగు : కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం ఈ నెల 18న (ఆదివారం) సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. తెలంగాణ కోటాలోని రాజ్యసభ స్థానానికి సీనియర్ నేత కేకే రాజీనామా చేయడంతో వచ్చే నెల 3న ఉప ఎన్నిక జరగనుంది. దీనికి కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ మనుసింఘ్వీ అభ్యర్థిత్వాన్ని ఇటీవలే హైకమాండ్ కన్​ఫర్మ్​చేసింది.

దీంతో ఈ స్థానంలో ఆయన్ను గెలిపించుకోవడమే ప్రధాన ఎజెండాగా సీఎల్పీ సమావేశం సాగనుంది. దీంతో పాటు త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికలపైన, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. అలాగే, రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు తీరును ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. 

అభ్యర్థిత్వాన్ని బలపరిచినందుకు సీఎంకు సింఘ్వీ కృతజ్ఞతలు

సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మనుసింఘ్వీ భేటీ అయ్యారు. శుక్రవారం ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసానికి వచ్చిన సింఘ్వీ.. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు రేవంత్​కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు, నాగర్​కర్నూల్​ ఎంపీ మల్లు రవి ఉన్నారు.