మనం వేసుకునే బట్టలు కొన్ని రోజులకు పాతవైపోతాయి. లేదంటే చిరిగిపోతాయి. అలా వేసుకోని బట్టలు ఇంట్లో సంచులకు సంచులు నిండిపోతాయి. వాటిలో పనికొచ్చేవాటిని పక్కన పెట్టి డొనేట్ చేస్తుంటారు కొందరు. మరికొందరేమో పాత బట్టలు కొనేవాళ్లకు అమ్మేస్తుంటారు. మరీ పనికిరావనుకుంటే వాటిని చెత్త బుట్టలో పారేస్తారు.ఎలాగోలా టైం చేసుకుని వార్డ్‌రోబ్‌లో బట్టలు వదిలించుకుంటున్నారు సరే. తీసిపారేసిన ఆ బట్టలన్నీ ఎక్కడికి తీసుకెళ్తారు? వాటిని ఏం చేస్తున్నారు? అని ఎప్పుడైనా ఆలోచించారా? వాడేసిన బట్టల్లో ఎక్కువ భాగం చెత్త కుప్పల్లోకే చేరి గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయి. బట్టల వల్ల ఇంత నష్టం జరుగుతోందా! అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.
పర్యావరణ కాలుష్యానికి కారణం ఏంటని అడిగితే.. వెహికల్స్, ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలు, అడవుల నరికివేత, చెత్త నిర్వహణ సరిగా లేకపోవడం.. వంటి రకరకాల కారణాలు చెప్తుంటారు. కానీ.. వాతావరణ కాలుష్యానికి పాత బట్టలు కూడా ప్రధాన కారణంగా మారుతున్నాయి. రోజూ వేసుకునే బట్టలు పర్యావరణాన్ని బాగానే కలుషితం చేస్తున్నాయి. అకాల వర్షాలు కురవడానికి, మంచు పర్వతాలు కరగడానికి, భూమి వేడెక్కడానికి.. బట్టలు కూడా ఒక కారణమే! మనుషులు వేసుకునే బట్టలే మనుషుల మనుగడకు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ఏటా గార్మెంట్ పరిశ్రమ పెద్ద మొత్తంలో ప్రొడ్యూస్ చేసే ఫ్యాబ్రిక్ వేస్ట్ ‘లైఫ్ సైకిల్’ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తోంది.
ప్రపంచ కర్బన ఉద్గారాల్లో పది శాతాన్ని ఫ్యాషన్ పరిశ్రమ విడుదల చేస్తోంది. ఎక్కువగా నీళ్లు వాడే ఇండస్ట్రీలో రెండోది ఈ పరిశ్రమ. అంటే.. మనం వార్డ్‌రోబ్‌ను అప్‌డేట్ చేసిన ప్రతిసారి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నట్టే. పదిహేనేండ్ల క్రితంతో పోలిస్తే.. ఇప్పుడు 60 శాతం ఎక్కువ బట్టలు కొంటున్నారు. దానివల్ల ప్రొడక్షన్ పెరిగింది. దాంతో వ్యర్థాలు కూడా పెరుగుతున్నాయి. ఫ్యాషన్ రంగం (పత్తి వ్యవసాయంతో సహా) ఏటా చాలా నీటిని వాడుకుంటుంది. అది మొత్తం ప్రపంచ మంచినీటి వినియోగంలో నాలుగు శాతానికి పైగానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు ఒక పెద్ద ట్రక్‌లో పట్టే బట్టలను పారేస్తున్నారు లేదా కాల్చేస్తున్నారు.
లాభమే కాదు.. నష్టం కూడా
టెక్స్‌టైల్ రంగం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభం లాంటిది. కొన్ని కోట్ల మందికి ఉపాధిని ఇస్తోంది. ప్రపంచ ఆర్థిక వృద్ధికి సాయం చేస్తోంది. అయితే.. ఇవన్నీ నాణానికి ఒక వైపు మాత్రమే. మరో వైపు చూస్తే.. పర్యావరణానికి తీరని నష్టం కలిగిస్తోంది ఈ రంగం. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నివేదిక ప్రకారం.. ఫ్యాషన్ వ్యర్థాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రతి ఏడాది 400 బిలియన్ల అమెరికన్ డాలర్లకు పైగా నష్టం వాటిల్లుతోంది. ఆర్థిక నష్టమే కాదు.. ఇది పర్యావరణ విపత్తులకు కూడా దారితీస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది 92 మిలియన్ టన్నుల ఫ్యాబ్రిక్ వేస్ట్ ఉత్పత్తి అవుతుంది. అందులో చాలా తక్కువ భాగం మాత్రమే రీసైకిల్ చేస్తున్నారు. లేదంటే ఇతర ప్రయోజనాల కోసం వాడుతున్నారు. మిగతాదంతా పారేస్తున్నారు లేదా కాల్చేస్తున్నారు. దీనివల్ల జరిగే అనేక నష్టాలు జరుగుతున్నాయి.
కుప్పలుగా..
పనికిరావని మనం పారేసే బట్టలు చెత్త బుట్టలో నుంచి డంప్ యార్డుల్లోకి వెళ్తాయి. ఫ్యాబ్రిక్ వేస్ట్ డంప్ యార్డ్‌కి వచ్చినప్పుడు ఎంత స్థలం ఆక్రమించిందో.. ఎప్పటికీ అంతే స్థలంలో ఉంటుంది. ఎందుకంటే.. మిగతా చెత్తలాగ బట్టలు కుళ్ళిపోవు. అందుకే మన దేశంలోని చాలా ప్రాంతాల్లో ఫ్యాబ్రిక్ వేస్ట్ గుట్టల్లా పేరుకుపోతోంది. ఈ సమస్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా దాదాపు3,100 పైగా ప్రదేశాల్లో ఇలాంటి చెత్త గుట్టలు ఉన్నాయి. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలకు బట్టలతో విడదీయలేని సంబంధం.
అందుకే మన దగ్గర టెక్స్‌టైల్ ఇండస్ట్రీ చాలా పెద్దది. అలాగే వ్యర్థాల ఉత్పత్తిలోనూ ముందుంది. దీనివల్ల అనేక ప్రాంతాల్లో బట్టల ల్యాండ్‌ఫిల్స్ ఏర్పడుతున్నాయి. మన దేశంలో చాలా నగరాలు బట్టల గుట్టలతో పోరాడుతున్నాయి. రివర్స్ రిసోర్సెస్ ఇచ్చిన ‘‘వేస్ట్ టు వెల్త్ రిపోర్ట్” ప్రకారం.. ప్రపంచంలోని ఫ్యాబ్రిక్ వేస్ట్‌లో ఇండియా వాటా 8.5 శాతం. మన దగ్గర ఏడాదికి సుమారుగా 7,793 టన్నుల ఫ్యాబ్రిక్ వేస్ట్ పేరుకుపోతోంది. ఇవన్నీ ఎక్కడినుంచి వస్తున్నాయని ట్రాక్ చేస్తే.. 51శాతం మన దేశంలోనే తయారై, ప్రజలు వాడి పారేసిన బట్టలు ఉన్నాయి. 42 శాతం బట్టలు వాడకుండానే అనేక రకాలుగా చెత్తలో కలిశాయి. మరో ఏడు శాతం ఇంపోర్ట్ చేసుకున్న బ్రాండ్స్.
ఢిల్లీ– ఘాజీపూర్ : ఢిల్లీలో ముఖ్యంగా మూడు ప్రాంతాల్లో ల్యాండ్ ఫిల్స్ ఉన్నాయి. ఘాజీపూర్, ఓఖ్లా, భల్స్వా.. వీటిలో ఘాజీపూర్ అతిపెద్దది. ఇక్కడ చెత్త పర్వతాల్లా కనిపిస్తుంటుంది. మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) లెక్కల ప్రకారం.. సిటీలో ప్రతి రోజూ 11,332 టన్నుల వేస్ట్ ఉత్పత్తి అవుతుంది. అందులోనే బట్టలు కూడా ఉన్నాయి. ఇక్కడ 70 ఎకరాల్లో చెత్త డంప్ చేస్తున్నారు. 2021 నాటికి ఈ చెత్త గుట్ట ఎత్తు తాజ్‌మహల్ ఎత్తుని బీట్ చేసింది.
ముంబయి–డియోనార్ : బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంఎసీ) లెక్కల బట్టి.. నగరంలో ప్రతిరోజూ దాదాపు 6,400 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇక్కడి డియోనార్ ల్యాండ్‌ఫిల్ దేశంలోనే అతి పెద్దది. టన్నుల కొద్దీ వ్యర్థాలు ఉన్నాయి ఇక్కడ. అంతేకాదు.. ఆ చెత్త నుంచి వచ్చే విష వాయువులు శ్వాసకోశ సమస్యలకు కారణం అవుతున్నాయి.
పానిపట్ టెక్స్‌టైల్ డంప్స్ : పానిపట్‌ని ‘‘కాస్ట్ ఆఫ్ క్యాపిటల్’’గా పిలుస్తుంటారు. ఇది క్లాత్స్ రీసైక్లింగ్‌కు ప్రధాన కేంద్రం. అయినప్పటికీ దాని ల్యాండ్‌ఫిల్స్ బట్టలతో నిండిపోతున్నాయి. అలా పేరుకుపోతున్న వ్యర్థాలు స్థానికులకు అనారోగ్యాన్ని తెచ్చిపెడుతున్నాయి. బీబీసీ నివేదిక ప్రకారం.. బ్రిటన్, అమెరికా లాంటి దేశాల నుంచి చిరిగిన, పాడైపోయిన బట్టలు పానిపట్‌కు వస్తాయని తెలిసింది. ప్రతిరోజూ పానిపట్‌కు వందల టన్నుల బట్టలు వస్తుంటాయి.
నీటి కాలుష్యం
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ నీటిని వాడుకునే రంగాల్లో బట్టల ఇండస్ట్రీ ప్రధానమైనది. బట్టల ఉత్పత్తి ప్రక్రియలో నీటిని ఎక్కువగా వాడతారు. ఒక జత క్వాలిటీ జీన్స్ తయారు చేయడానికి దాదాపు7,500 లీటర్లు (2,000 గ్యాలన్లు) నీరు అవసరం ఉంటుంది. అంతేకాదు.. పనికిరాని బట్టల గుట్టల వల్ల నీళ్లు కలుషితం అవుతున్నాయి. ల్యాండ్‌ఫిల్స్‌లో ఫ్యాబ్రిక్ వేస్ట్ వేయడం వల్ల కొన్ని రోజులకు వాటి రంగు కరిగి వర్షం వచ్చినప్పుడు అదంతా వరదలో కలిసిపోయి, చుట్టుపక్కల ఉన్న నీటి వనరుల్లో కలుస్తోంది.
ఆ నీళ్లు నదులు, సరస్సులు, సముద్రాల్లోకి వెళ్తాయి. ఆ రంగుల్లో ఉండే కెమికల్స్ వల్ల చేపలు, సముద్ర జీవులకు హాని కలుగుతుంది. దాని ద్వారా ఫుడ్ చైన్ దెబ్బతింటుంది. రంగుల్లో ఉండే ప్రమాదకరమైన రసాయనాలు భూగర్భ జలాల్లోకి కూడా చేరుతాయి. దానివల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుంది. నీటి కాలుష్యం వల్ల వ్యవసాయానికి వాడుకునే నీళ్లు కూడా కలుషితం అవుతాయి. దాంతో పంటల దిగుబడి తగ్గుతుంది. సముద్రాలు, నదుల మీద ఆధారపడి బతుకుతున్న ఎంతోమంది తమ జీవనోపాధి కోల్పోతారు.
పత్తి పంట
పత్తిని ప్రముఖంగా వాడేది బట్టల తయారీలోనే. మన దగ్గర ఎక్కువగా కాటన్ బట్టలే కనిపిస్తాయి. అందుకే బట్టల వాడకం పెరగడం వల్ల పత్తి సాగు కూడా బాగా పెరిగింది. అయితే.. చాలా రకాల ఆరుతడి పంటలతో పోలిస్తే.. పత్తికి నీరు ఎక్కువగా అవసరం. పైగా పత్తి పంటను చీడపీడల నుంచి కాపాడుకోవడానికి, దిగుబడి పెంచడానికి పెద్ద మొత్తంలో పెస్టిసైడ్స్, రసాయన ఎరువులు వాడుతుంటారు. దాని వల్ల కూడా నీటి కాలుష్యం పెరుగుతుంది. ఎక్కువగా కెమికల్స్ వాడడం వల్ల భూమి సారం కోల్పోతుంది. భూగర్భంలో ఉన్న సూక్ష్మజీవుల సమూహాలు నాశనం అవుతున్నాయి. దీని ఎఫెక్ట్ ఆ తర్వాత వేసే ఆహారపు పంటల మీద పడుతోంది. వర్షం వచ్చినప్పుడు వరద నీరు పొలాల నుంచి కాలువల ద్వారా చెరువుల్లోకి చేరుతుంది. దానివల్ల నీటి వనరులు కలుషితం అవుతున్నాయి. స్థానిక జీవవైవిధ్యం దెబ్బతింటోంది. మానవ ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతోంది.
సింథటిక్ ఫ్యాబ్రిక్
సింథటిక్ ఫ్యాబ్రిక్ తయారుచేసేందుకు ఏటా దాదాపు 70 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురు వాడుతున్నారు. ఈ సింథటిక్ ఫ్యాబ్రిక్స్ తయారుచేసే కంపెనీల నుండి వచ్చే మురుగునీటి ద్వారా అందులోని సీసం, ఆర్సెనిక్, బెంజీన్‌తోపాటు ఇతర కాలుష్య కారకాలు నీటి వనరుల్లో కలుస్తున్నాయి.
డైయింగ్‌లో..
ఫ్యాబ్రిక్ డైయింగ్‌లో చాలా మురుగునీరు ఉత్పత్తి అవుతుంది. నీళ్ల అవసరం కూడా చాలా ఉంటుంది. ఒక్క బంగ్లాదేశ్‌లోని గార్మెంట్ ఫ్యాక్టరీలు, మిల్లుల్లో సంవత్సరానికి1,500 బిలియన్ లీటర్ల నీటిని వాడుతున్నారు. ఈ ఫ్యాక్టరీలు ఉన్న ప్రాంతాల్లో భూగర్భజల వనరులు చాలా వరకు క్షీణించాయి. చుట్టు పక్కల ప్రాంతాల్లో నీటి వనరులు కలుషితం అయ్యాయి. టెక్స్‌టైల్ ఫినిషింగ్, డైయింగ్ ప్రక్రియలో ఆయిల్, ఫినాల్, డైస్, పెస్టిసైడ్స్, రాగి, పాదరసం, క్రోమియం లాంటి భారీ లోహాలతో సహా అనేక రసాయనాలను వాడతారు. అవన్నీ మురుగునీటితో కలిసి మంచి నీటి వనరుల్లో కలుస్తాయి. ఆ నీటిని సాగుకు వాడడం వల్ల పంటలు దెబ్బతింటాయి. వాటిద్వారా క్యాన్సర్ కారక రసాయనాలు ఫుడ్‌లోకి చేరుతున్నాయి.
మైక్రోఫైబర్
చూడ్డానికి చిన్నగా ఉన్నా.. మైక్రో ఫైబర్ చేసే ప్రమాదం మాత్రం చాలా పెద్దది. మైక్రోఫైబర్ల (చిన్న సింథటిక్ ఫైబర్లు) వల్ల నీటి వనరులు కలుషితం అవుతున్నాయని ప్రపంచవ్యాప్తంగా పర్యావరణవేత్తలు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ప్రత్యేకించి ఇవి నదులు, మహాసముద్రాల్లో కలుస్తున్నాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం.. సముద్రతీరాల్లో 85 శాతం కాలుష్యం మైక్రోఫైబర్లు, మనుషులు చేసిన తప్పుల వల్లే. ఏటా అర మిలియన్ టన్నుల మైక్రోఫైబర్లు మహా సముద్రాల్లో కలుస్తున్నాయట. ప్రొడక్షన్లోనే కాకుండా, బట్టలు ఉతికినప్పుడు కూడా ఈ ఫైబర్స్ విడుదలవుతాయి. సింథటిక్ పదార్థాల నుండి వచ్చే మైక్రోఫైబర్లు కుళ్ళిపోవడానికి కొన్ని వందల ఏండ్లు పడుతుంది. అవి నీటి అడుగున చేరి పర్యావరణ వ్యవస్థలను దెబ్బతీస్తాయి. అంతేకాదు.. పాలిస్టర్, నైలాన్ లాంటి సింథటిక్స్ నుండి వచ్చిన మైక్రోఫైబర్ల ఆనవాళ్లు చేపలు, ఇతర సీఫుడ్స్‌లో గుర్తించారు.
అతిపెద్ద నీటి కాలుష్య కారకాలు
ప్రపంచంలోని చాలా కంపెనీలు నీటి కాలుష్యానికి కారణం అవుతున్నాయి. ఇటీవలి అధ్యయనాల ప్రకారం.. ప్రతి 10 ఫ్యాషన్ కంపెనీల్లో ఒకటి మాత్రమే నీటి కాలుష్యం మీద స్పృహతో పనిచేస్తోంది. మరికొన్ని కంపెనీలు మాత్రమే నీటి కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ.. పెద్ద మొత్తంలో కంపెనీలు దీని గురించి పట్టించుకోవట్లేదు. ప్రపంచంలోని అతిపెద్ద రిటైలర్లు ‘జరా, ప్యూమా, అర్మానీ’ లాంటి కంపెనీలు చైనాలో నీటి కాలుష్యం కుంభకోణంలో ఇరుక్కున్నాయి. ఆ తర్వాత కొన్ని కంపెనీలు మాత్రం తయారీ ప్రక్రియలో నీటి వాడకాన్ని, కాలుష్యాన్ని తగ్గించే చర్యలు చేపట్టాయి.
గ్రీన్ హౌజ్ ఎఫెక్ట్
ల్యాండ్‌ఫిల్స్‌లో బట్టల వేస్ట్ పేరుకుపోవడం వల్ల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు ప్రభావితం అవుతాయి. వాతావరణ మార్పులకు కారణమయ్యే గ్రీన్‌హౌస్ గ్యాస్ మీథేన్ కూడా బట్టలు పాడైనప్పుడు విడుదలవుతుంది. కార్బన్ డయాక్సైడ్ కంటే మీథేన్ 28 రెట్లు ఎక్కువ ప్రమాదకరం. దీనివల్ల భూమి ఎక్కువగా వేడెక్కుతోంది. ప్రపంచంలోని మీథేన్ ఉద్గారాల్లో ల్యాండ్‌ఫిల్స్‌లోని బట్టలు కూడా ఉన్నాయి. ల్యాండ్‌ఫిల్స్‌లోని పరిస్థితులు, అవి ఎంత టైంలో కుళ్ళిపోతున్నాయి? ఫ్యాబ్రిక్ రకం.. ఇవన్నీ ఎంత మీథేన్ విడుదల అవుతుందనేది డిసైడ్ చేస్తాయి. మీథేన్ వల్ల వాతావరణంలో అనేక మార్పులు వస్తాయి. ప్రపంచ పర్యావరణ వ్యవస్థ మీదే కాకుండా జీవం ఉన్న ప్రతి ప్రాణి ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలు, సముద్ర మట్టాలు పెరగడం, అంటు వ్యాధుల వ్యాప్తికి దారితీస్తాయి.
పరిశ్రమల వల్ల ఎంతో...
ఫ్యాబ్రిక్ వేస్ట్ మాత్రమే కాదు.. ఫ్యాబ్రిక్‌ని తయారు చేసే కంపెనీల వల్ల కూడా పర్యావరణానికి హాని కలుగుతోంది. కేవలం ఫుట్‌వేర్, ఫ్యాబ్రిక్ తయారు చేసే ఫ్యాక్టరీల వల్లే ప్రపంచ కర్బన ఉద్గారాల్లో 8 నుంచి10 శాతం ఉత్పత్తి అవుతున్నాయి. ఫ్యాబ్రిక్ ఫ్యాక్టరీలు, బట్టల రవాణా.. లాంటి వాటివల్ల దాదాపు1.2 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుంది. మొత్తంగా ఈ ఇండస్ట్రీ వరల్డ్ గ్రీన్ హౌజ్ ఎమిషన్స్‌లో దాదాపు10 శాతం విడుదల చేస్తుంది. ఇలాగే ఫ్యాషన్ వేస్ట్ పెరుగుతూ పోతే.. 2050 నాటికి ప్రపంచంలోని కార్బన్ బడ్జెట్‌లో ఫ్యాషన్ పరిశ్రమ వాటా 25 శాతానికి పెరుగుతుందనేది ఒక అంచనా.
భారతదేశం, చైనా, బంగ్లాదేశ్ లాంటి గ్లోబల్ సౌత్ దేశాల్లో చాలావరకు ఫ్యాబ్రిక్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఈ పరిశ్రమలు కరెంట్‌ని విపరీతంగా వాడుతున్నాయి. అయితే.. ఈ దేశాలన్నీ దాదాపు ఎక్కువ శాతం కరెంట్‌ని ఫాజిల్ ఫ్యూయెల్స్ వాడి తయారు చేస్తున్నాయి. దానివల్ల ఉత్పత్తి చేసిన ప్రతి వస్తువు పరోక్షంగా ఎంతో కొంత కాలుష్యానికి కారణం అవుతుంది. అలాగే ఈ మధ్య సింథటిక్ ఫైబర్ల వాడకం బాగా పెరిగింది. ఇప్పుడు ఎక్కువగా ఉపయోగించే ఫ్యాషన్ ఫ్యాబ్రిక్ పాలిస్టర్. అయితే.. సింథటిక్స్ తయారీలో కర్బన ఉద్గారాలు చాలా ఎక్కువగా విడుదల అవుతాయి. ఇలాగెందుకంటే... అవి శుద్ధి చేయని పెట్రోలియం ఉత్పత్తుల నుండి తయారవుతాయి. ఒక పాలిస్టర్ టీ–షర్టును ఉత్పత్తి చేయడానికి 5.5 కిలోల కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుందనేది ఒక అంచనా. కాటన్ టీ–షర్టు తయారు చేయాలంటే.. 2.1 కిలోల కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుంది.
కలప గుజ్జు కోసం...
ఫ్యాషన్ పరిశ్రమలో పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఎక్కువ బట్టలను ఉత్పత్తి చేస్తున్నారు. దీనివల్ల అడవులు బాగా కొట్టివేస్తున్నారు. రేయాన్ (శుద్ధి చేయబడిన సెల్యులోజ్ నుండి తయారైన సెమీ–సింథటిక్ ఫైబర్), విస్కోస్ కూడా అలాంటిదే.ఈ రెండింటినీ కలప గుజ్జు నుండి తయారు చేస్తారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా రేయాన్/విస్కోస్ ఇండస్ట్రీ విస్తరిస్తోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అడవులకు ముప్పు తెచ్చిపెడుతుంది. ఫ్యాషన్ పరిశ్రమ ఉపయోగించే రేయాన్, విస్కోస్‌లను ఇప్పటికే అంతరించిపోతున్న అడవుల నుంచే 30 శాతం వరకు సేకరిస్తున్నారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా వేడిగాలులు పెరుగుతున్నాయి. ఉత్తర అమెరికా, యూరప్‌లోని సమశీతోష్ణ ప్రాంతాల్లో టెంపరేచర్లు పెరుగుతున్నాయి.
కెమికల్స్ వాడకం
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా కెమికల్స్ వాడుతున్న ఇండస్ట్రీల్లో వస్త్ర పరిశ్రమ ఒకటి. బట్టల తయారీ, డైయింగ్ కోసం రకరకాల కెమికల్స్ వాడుతుంటారు. అవి పర్యావరణానికి, ఆరోగ్యానికి అంత మంచివి కాదు. మేరీ( పేరు మార్చాం) ఓ పెద్ద ఎయిర్‌లైన్స్ కంపెనీలో అటెండెంట్‌గా పనిచేస్తుంది. ఆ కంపెనీ స్టాఫ్ అందరికీ 2011 సమ్మర్లో సింథటిక్ యూనిఫామ్స్ ఇచ్చింది. వాటిని వేసుకోవడం మొదలుపెట్టిన కొద్ది రోజులకే మేరీకి దగ్గు, ఛాతిపై దద్దుర్లు వచ్చాయి. తర్వాత మైగ్రేన్, రేసింగ్ హార్ట్, కనురెప్పల వాపు లాంటి సమస్యలతో ఇబ్బంది పడింది. ఆమె శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడింది. మరో అటెండెంట్ జాన్‌కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.
కారణం ఏంటని కనుక్కుంటే.. ఎయిర్‌లైన్స్ కంపెనీ ఇచ్చిన యూనిఫాం తయారీలో వాడిన కెమికల్స్ దీనికి కారణమని తేలింది. ముఖ్యంగా ఫాస్ఫేట్, సీసం, ఆర్సెనిక్, కోబాల్ట్, యాంటీమోనీ, టోలున్, హెక్సావాలెంట్ క్రోమియం, డైమిథైల్ ఫ్యూమరేట్ లాంటివి కొన్ని కంపెనీలు బట్టల తయారీలో వాడుతున్నాయి. హాని కలిగించే చాలా రకాల కెమికల్స్‌ని చాలా దేశాల ప్రభుత్వాలు బ్యాన్ చేశాయి. అయినా కూడా కొన్ని కంపెనీలు వాడుతున్నాయి. అందువల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. వీటి వల్ల మనుషుల ఆరోగ్యమే కాదు... భూమి ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది. ఫ్యాబ్రిక్ వేస్ట్ అంతా ఒక చోట వేసినప్పుడు వాటిలో నుంచి విడుదలయ్యే కెమికల్స్ భూమిని కలుషితం చేస్తాయి. ఎక్కువగా కలుషితం అయితే.. అక్కడ పంటలు కూడా సరిగా పండవు.
ఈ చెత్త ఎక్కడి నుంచి..
ఫ్యాబ్రిక్ వేస్ట్ ఇంతకీ ఎక్కడి నుంచి వస్తుంది? మనం వాడిన బట్టలే ఇంతలా పేరుకుపోతున్నాయా? అంటే.. వాస్తవానికి మన బట్టలతో పాటు ఇంకా చాలా రకాలుగా ఫ్యాబ్రిక్ వేస్ట్ పెరుగుతోంది.
ఇండస్ట్రీ వేస్ట్
బట్టలు తయారుచేసే క్రమంలో అనేక రకాలుగా ఫ్యాబ్రిక్ వేస్ట్ జరుగుతుంటుంది. స్పిన్నింగ్ మిల్లుకి పత్తిని తీసుకెళ్లాక వాటిలోని దుమ్ము రేణువులు, విత్తనాలు, చిన్న సైజు పోగులు వంటి అనేక వ్యర్థాలు బయటికి వస్తాయి. బ్లో రూమ్‌లో 3 శాతం, కార్డింగ్ విభాగంలో10 శాతం, డ్రాపింగ్‌లో-1 శాతం వేస్ట్ అవుతుంది. ఇక కాంబెర్ విభాగంలో 14 నుంచి15 శాతం వేస్ట్ అవుతుంది. నేత మిల్లుల్లోనూ చాలా రకాలుగా ఫ్యాబ్రిక్ వేస్ట్ జరుగుతుంది. డైయింగ్‌లో లోపాలు ఉంటే ఆ క్లాత్‌ని పారేస్తారు. అలాంటిదంతా చెత్తలోకే చేరుతుంది.
కటింగ్
గార్మెంట్ పరిశ్రమలోని కటింగ్ సెక్షన్ నుంచి ఎక్కువ ఫ్యాబ్రిక్ వేస్ట్ విడుదలవుతుంది. పెద్ద క్లాత్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఫ్యాబ్రిక్ డ్యామేజ్ అవుతుంది. లేదంటే.. కుట్టడానికి కొలతల్లో కట్ చేసినప్పుడు కూడా క్లాత్ వేస్ట్ అవుతుంటుంది. ఆ క్లాత్ అంతా చెత్త కుప్పల్లోకే చేరుతుంది.
ఫ్యాషన్ వేస్ట్
గతంలో కొన్ని దేశాల్లో కట్టుకోవడానికి బట్టలు ఉంటే చాలనుకునే పరిస్థితులు ఉండేవి. అందుకే బట్టలకు అంత డిమాండ్ ఉండేది కాదు. అయినప్పటికీ, జనాభా పెరుగుతున్న కొద్దీ బట్టల ఉత్పత్తి పెరిగింది. కానీ.. ఇప్పుడు ప్రపంచం అభివృద్ధి చెందింది. ఆ పరిస్థితులు మారాయి. ప్రపంచం ఫ్యాషన్ వైపు పరుగులు తీస్తోంది. ఇప్పుడు చాలామందికి బట్టలు ఉంటే చాలదు. అవి ఫ్యాషనబుల్‌గా ఉండాలి. ఈ ఆలోచన కూడా బట్టల వాడకాన్ని బాగా పెంచేసింది.
బట్టల దుకాణానికి వెళ్లి చూస్తే.. ఈ రోజు కనిపించిన మోడల్ ఓ నెల తర్వాత కనిపించట్లేదు. అప్పటికే ట్రెండ్ మారిపోతుంది. దాంతో మళ్లీ కొత్త బట్టలు కొనాలి. ముఖ్యంగా యూత్ ఒక డ్రెస్‌ను ఐదారుసార్లు వేస్తే చాలు అనుకుంటున్నారు. కొందరు ఏడాదికి ఒక్కసారైనా వార్డ్‌రోబ్‌ని కొత్త బట్టలతో నింపుతున్నారు. పాత బట్టలను చెత్తబుట్టలో పాడేస్తున్నారు. దాంతో రెండు దశాబ్దాలుగా బట్టలకు విపరీతంగా డిమాండ్ పెరుగుతూ వచ్చింది. వాటిలో మన్నికైన బట్టల కంటే అందంగా ఉండే బట్టలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అయితే.. ఈ ఫాస్ట్ ఫ్యాషన్ ఫ్యాబ్రిక్ వేస్ట్‌కు దారి తీస్తోంది. 2000 సంవత్సరంలో 50 బిలియన్ల బట్టలు తయారుచేశాయి కంపెనీలు. 20 ఏండ్ల తర్వాత ఇప్పుడు ఈ సంఖ్య 100 బిలియన్లకు పెరిగింది. ఈ ఇరవై ఏండ్లలో జనాభా డబుల్ కాలేదు. కానీ.. ఉత్పత్తి మాత్రం డబుల్ అయ్యింది. అప్పటితో పోలిస్తే.. ఇప్పుడు సగటు వ్యక్తి 60 శాతం ఎక్కువ బట్టలు కొంటున్నాడు. అయితే.. చాలామందికి తమ వార్డ్‌రోబ్‌లోని బట్టలను మార్చిన ప్రతిసారి ప్రపంచ కర్బన ఉద్గారాలను పెంచుతున్నామనే విషయమే తెలియదు.
క్వాలిటీ టెక్స్‌టైల్ మెటీరియల్స్ లేవు
ఫాస్ట్ ఫ్యాషన్ పెరగడంతో.. చాలా కంపెనీలు బట్టల డిజైన్ల మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. కానీ.. వాటి క్వాలిటీ గురించి పట్టించుకోవడం లేదు. దాంతో.. కొన్న కొన్ని రోజులకే బట్ట కలర్ షేడ్ అవుతుంది. లేదంటే.. నాలుగు ఉతుకులకే చిరిగిపోతున్నాయి. చాలామంది బట్టల తయారీదారులు సింథటిక్ పదార్థాలను వాడుతున్నారు. ఈ బట్టలు మన్నికైనవి కావు. చాలా త్వరగా పాడైపోతాయి. దాంతో వాటిని పారేస్తున్నారు. ఎందుకంటే... అవి మళ్లీ వాడుకోవడానికి కూడా పెద్దగా పనికిరావు. ఎందుకంటే.. సింథటిక్ ఫ్యాబ్రిక్స్ తయారు చేసే టైంలో ఉపయోగించే విష రసాయనాల వల్ల ఫ్యాబ్రిక్ రీసైక్లింగ్ చేయడం కష్టం.
అవగాహన లేకపోవడం
యువత చాలావరకు ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లి బట్టలు కొంటుంటారు. కానీ.. వాళ్లలో ఒక్కరికి కూడా బట్ట నాణ్యత గురించి తెలియదు. దాని లైఫ్ ఎన్ని రోజులు వస్తుందనే విషయం మీద అవగాహన ఉండదు. దాంతో కంటికి నచ్చింది కొంటారు. ఆ తర్వాత కూడా వాటిని ఎలా మెయింటెయిన్ చేయాలో తెలియక పోవడం వల్ల బట్టలు తొందరగా పాడైపోతున్నాయి. బట్టలు ఎలా ఉతకాలి? ఎక్కడ ఆరబెట్టాలి? అనేది తెలియాలి. కొన్ని రకాల బట్టలు ఎక్కువసార్లు ఉతికితే అరిగిపోయి క్లాత్ పలుచగా అయిపోతుంది. ఉతకడానికి కఠినమైన డిటర్జెంట్లను వాడినా ప్రమాదమే. సరిగ్గా ఇస్త్రీ చేయకపోయినా తొందరగా చిరిగిపోతాయి. ఇలాంటి విషయాల మీద ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి. అలాలేదంటే.. పర్యావరణ కాలుష్యానికి మీరూ కారణం అయినట్టే.
పాడయ్యే వరకు వాడాలి
సెల్‌ఫోన్ లాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌ని చాలామంది పాడైపోయే వరకు వాడతారు. బట్టల విషయంలో మాత్రం ఆ పని చేయరు. కానీ.. బట్టలను చిరిగిపోయే వరకు వాడాలి. సాధారణంగా ఒక జత బట్టలను వాటి క్వాలిటీ బట్టి 100 నుంచి 200 సార్లు వేసుకోవచ్చు. అప్పటివరకు అవి పాడైపోవు. కానీ.. కొందరు నాలుగైదు సార్లు వేసుకుని పక్కన పడేస్తారు. సగటున ప్రజలు ప్రతి ఏడాది 56 కొత్త బట్టలను కొంటున్నారు. వాటిలో కొన్నింటిని మాత్రమే ఎక్కువ సార్లు వేసుకుంటారు. మిగతావి వార్డ్‌రోబ్‌లో కొన్నాళ్లు ఉండి, ఆ తర్వాత చెత్త బుట్టలోకి చేరుతాయి. కాబట్టి బట్టల మీద ఎక్కువ ఖర్చు పెట్టడం తగ్గించుకోవాలి. ప్రతి ఒక్కరు కొత్త బట్టలు కొనేముందు వార్డ్‌రోబ్ చెక్ చేసుకోవాలి. కొంతకాలంగా వేసుకోని బట్టలను బయటకు తీసి మళ్లీ వాడాలి. అలా చేస్తే.. కాలుష్యాన్ని తగ్గించడంలో మీ వంతు సాయం చేసినట్టే.
రిపేర్
బట్టలు కాస్త చిరిగిపోగానే పడేస్తుంటారు చాలామంది. కానీ.. వాటిని రిపేర్ చేసుకుని వాడుకోవచ్చు. మరీ ఎక్కువగా చిరిగిపోతే... వాటిని మరో విధంగా ఎలా వాడొచ్చనేది ఆలోచించాలి. చిరిగిన బట్టలను ఎలా రిపేర్ చేసుకోవాలి? చిరిగిన బట్టలు ఎలా వాడుకోవాలి? అనే అంశాల మీద యూట్యూబ్‌లో చాలా ట్యుటోరియల్స్ ఉన్నాయి. వాటిని ఫాలో అయితే.. సరిపోతుంది.
జాగ్రత్తగా చూసుకోవాలి
వాడే వస్తువులను జాగ్రత్తగా చూసుకున్నట్టే బట్టలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. కొందరైతే.. మేడపై బట్టలు ఆరేసి రెండు మూడు రోజులు అలానే ఉంచుతారు. దాంతో ఎండకు తొందరగా పాడైపోయి, చిరిగిపోతాయి. బాగా వేడిగా ఉండే నీళ్లలో బట్టలు నానబెట్టొదు. సాధ్యమైనంత వరకు చల్లటి నీళ్లతోనే బట్టలు ఉతకాలి. దానివల్ల ఎక్కువ కాలం పాడవ్వవు.
క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం
తక్కువ క్వాలిటీ ఉండే ఎక్కువ బట్టలు కొనడం కంటే ఎక్కువ క్వాలిటీ ఉండేవి తక్కువగా కొంటే సరిపోతుంది. బట్టలపై చేసే ఖర్చును ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఉదాహరణకి తక్కువ క్వాలిటీ ఉన్నవి ఎక్కువ కొనడం కంటే.. మంచి క్వాలిటీ ఉన్నవి తక్కువ కొని ఎక్కువ కాలం వాడితే కాలుష్యాన్ని తగ్గించినట్టే. కొందరైతే ట్రెండ్ మారిన ప్రతిసారి కొత్త బట్టలు కొంటుంటారు. దానివల్ల డబ్బులు ఖర్చు కావడంతో పాటు పర్యావరణానికి హాని కలుగుతుంది. ట్రెండ్ మారిన ప్రతిసారి కొనకుండా.. అవసరం ఉన్నప్పుడే కొనాలి. కొన్నప్పుడే ట్రెండింగ్‌లో ఉన్న మోడల్స్ తీసుకోవాలి.
రెంట్‌కి..
కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మంచి బట్టలు వేసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు కొనడం కంటే అద్దెకు తీసుకోవడం బెటర్. ఎందుకంటే.. ప్రత్యేక సందర్భాల్లో చాలా కాస్ట్‌లీ బట్టలు కొంటారు. దాని బదులు అద్దెకు తీసుకుంటే సరిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఒక డ్రెస్‌ని ఒకేసారి వేసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు కూడా అద్దెకు తీసుకోవడమే బెటర్ ఛాయిస్.
బడ్జెట్ పెట్టుకోవాలి
ఈ మధ్య ఆన్‌లైన్ షాపింగ్ బాగా పెరిగిపోయింది. దాంతో అవసరం ఉన్నా లేకున్నా.. ఆఫర్ ఉంటే చాలు బట్టలు కొనేస్తున్నారు. అలాంటప్పుడు తెలియకుండానే ఖర్చు పెరిగిపోతుంటుంది. వార్డ్ రోబ్ నిండిపోతుంది. అందుకే బట్టల కోసం కొంత బడ్జెట్ పెట్టుకోవాలి. అంతకుమించి ఖర్చు చేయకూడదు.
స్వాపింగ్
బట్టలు ఇచ్చిపుచ్చుకోవడం వల్ల వార్డ్‌రోబ్‌ని రిఫ్రెష్ చేసుకోవచ్చు. డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ వేస్ట్ తగ్గించొచ్చు. రోజూ వేసుకునే బట్టలు బోర్ కొడితే.. ఫ్రెండ్స్, అక్కచెల్లెళ్లు, అన్నాదమ్ములు, సహోద్యోగులకు వాటిని ఇచ్చి, వాళ్ల బట్టలు తీసుకోవచ్చు. ‘కొత్త’ సెకండ్ హ్యాండ్ బట్టలతో వార్డ్‌రోబ్ నింపుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో అమ్మండి
సెకండ్ హ్యాండ్ వస్తువులను అమ్మినట్టే బట్టలను కూడా అమ్మేయొచ్చు. ఇలా బట్టలు అమ్మడానికి చాలా రకాల వెబ్‌సైట్లు ఉన్నాయి. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో కూడా బట్టలు అమ్మే అవకాశం ఉంది. సెర్చ్ చేసి చూడండి. బోలెడు మార్గాలు కనిపిస్తాయి.
డొనేట్ చేయొచ్చు
ఇవేవీ నచ్చకపోతే.. వాటిని డొనేట్ చేయడం బెస్ట్ ఛాయిస్. చాలా సంస్థలు బట్టలను డొనేషన్‌గా తీసుకుని పేదలకు, అనాథలకు పంచుతున్నాయి. కాబట్టి డొనేషన్‌గా ఇచ్చిన బట్టలను పూర్తిగా వాడుకున్నట్టే. కానీ.. పాడైపోయే వరకు వార్డ్‌రోబ్‌లో పెట్టి పారేసే అలవాటు ఉంటే మాత్రం దాన్ని మానుకోవాలి.
బ్రాండ్స్ వల్ల నష్టమే!
కొన్ని లగ్జరీ బ్రాండ్స్ స్టోర్లకు వెళ్లిన ప్రతిసారి కొత్త మోడల్స్ కనిపిస్తుంటాయి. ట్రెండ్‌కు తగ్గట్టు ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లను తెస్తుంటాయి ఆ కంపెనీలు. అదిసరే పాత డిజైన్‌తో తయారుచేసిన బట్టలను ఏం చేస్తున్నాయి? అనే అనుమానం వచ్చిందా? అయితే.. అలాంటి బట్టలను పెద్ద బ్రాండ్స్ తగలబెడతాయనే వాదన చాలా రోజుల నుంచి వినిపిస్తోంది. లగ్జరీ బ్రాండ్స్ కస్టమర్లను సంతృప్తి పరచడానికి, బ్రాండ్ వ్యాల్యూ తగ్గకుండా ఉండేందుకు ఇలాంటి పనులు చేస్తుంటాయి. అదెలాగంటే.. ఓల్డ్ మోడల్స్ అమ్మితే కస్టమర్ల దృష్టిలో బ్రాండ్‌కు విలువ ఉండదు. అలాగని తక్కువ ధరకు అమ్మితే వాటిని అందరూ కొంటారు. బ్రాండ్ వ్యాల్యూ తగ్గుతుంది. అందుకే అలాంటి బట్టలను కాల్చేస్తుంటాయట బ్రాండ్ కంపెనీలు. దీనివల్ల కూడా పెద్ద మొత్తంలో గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు ఉత్పత్తి అవుతాయి.
ఖర్చు ఎక్కువ
అమ్ముడుపోని బట్టలను బ్రాండ్స్ రీసైక్లింగ్ లేదా అప్ సైక్లింగ్ చేయొచ్చు కదా! అని చాలామంది అనుకుంటారు. కానీ.. ఈ రెండింటిలో ఏది చేసినా దానిమీద మళ్లీ పెట్టుబడి పెట్టాలి. ఆ బట్టల స్టిచ్చింగ్ విప్పడానికి, సెపరేట్ చేయడానికి మాన్యువల్‌గా కార్మికులు అవసరం. ఆ ఖర్చంతా ఎందుకని సింపుల్‌గా కాల్చేస్తుంటారు. ఇది ఫ్యాషన్ పరిశ్రమలో అనుసరించే పాత పద్ధతి. దీనికి మొదట్లో నిబంధనలు ఏవీ లేవు. కానీ.. దానివల్ల పర్యావరణం మీద ఎఫెక్ట్ పడుతుందని తరువాత ఒకట్రెండు దేశాల్లో స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు. దాంతో ఆ దేశాల్లో ఆ బ్రాండ్స్ వెనక్కి తగ్గాయి.
ఫ్యాక్ట్స్
పరిస్థితి ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో మరింత నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఫాస్ట్ ఫ్యాషన్ వేస్ట్‌ని తగ్గించడానికి ఎటువంటి చర్యలు తీసుకోకపోతే ఈ ఇండస్ట్రీ నుంచి వచ్చే వేస్ట్ 2030 నాటికి మరో 50 శాతం పెరిగే అవకాశం ఉంది.
ఒక్క అమెరికాలోనే ఏడాదికి 11.3 మిలియన్ టన్నుల ఫ్యాబ్రిక్ వేస్ట్ అవుతుంది. అంటే సగటున ఒక అమెరికన్ ఏడాదికి 37 కిలోల బట్టలు పారేస్తున్నాడు. ఈ లెక్కన దేశ వ్యాప్తంగా సెకనుకు 2,150 బట్టలు పారేస్తున్నారు.
మనం నిర్లక్ష్యంగా పారేసిన బట్టల్లో ఎక్కువ భాగాన్ని రీసైకిల్ చేయడం లేదు. ప్రపంచవ్యాప్తంగా బట్టలు తయారుచేసేందుకు వాడిన మెటీరియల్‌లో కేవలం 12 శాతం మాత్రమే రీసైకిల్ అవుతోంది. మిగతావి రీసైకిల్ చేయకపోవడం వల్ల ప్రతి ఏడాది 500 బిలియన్ల డాలర్లు నష్టపోతున్నాం.
ప్రతి ఏడాది సముద్రంలో చేరుతున్న మైక్రోప్లాస్టిక్స్‌లో దాదాపు 10 శాతం బట్టల నుంచి వచ్చిందే. ఎందుకంటే ఇప్పుడు నైలాన్, పాలిస్టర్‌తో బట్టలు తయారీ బాగా పెరిగింది. అవి ఉతికిన ప్రతిసారి వాటి నుంచి కొన్ని మైక్రోఫిలమెంట్లు నీటిలో కలుస్తున్నాయి. ఇవి ఏడాదికి దాదాపు 50 బిలియన్ ప్లాస్టిక్ బాటిళ్ల పరిమాణంలో సముద్రంలో చేరుతున్నాయి.
పాత బట్టలకు కేరాఫ్
ఘనా దేశంలో నీటి కాలుష్యం పెరగడానికి ప్రధాన కారణం ఈ పాత బట్టలే. ఘనా రాజధాని అక్రాలో నీటి కాల్వల్లో, చెత్త డంప్‌ల్లో, మురికివాడల్లో.. ఎక్కడ చూసినా పాత బట్టలే కనిపిస్తుంటాయి. ఇందుకు కారణం.. ఘనాకు వారానికి సగటున 15 మిలియన్ల సెకండ్ హ్యాండ్ బట్టలు దిగుమతి అవ్వడమే. వీటిని స్థానికంగా ‘ఓబ్రోని వావు’( చనిపోయిన తెల్ల మనిషి బట్టలు) అని పిలుస్తారు. 2021 ఒకే ఏడాదిలో ఘనా.. 214 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన సెకండ్ హ్యాండ్ బట్టలను దిగుమతి చేసుకుని ప్రపంచంలోనే అతిపెద్ద దిగుమతిదారుగా నిలిచింది.
బ్రిటన్, అమెరికా, చైనాతో సహా ఇతర దేశాల్లో డొనేట్ చేసిన బట్టలు, సెకండ్ హ్యాండ్ బట్టలు, షాపుల్లో అమ్ముడుపోని బట్టలు దిగుమతి అవుతుంటాయి. వాటిని ఇక్కడి వ్యాపారులు ప్రపంచంలోని అతిపెద్ద సెకండ్ హ్యాండ్ దుస్తుల మార్కెట్లలో ఒకటైన అక్రలోని ‘కాంటా మాంటో’లో అమ్ముతారు. అందుకే అక్కడ ఎటువైపు చూసినా బట్టల దుకాణాలే కనిపిస్తాయి. కొన్ని వేల స్టాల్స్ ఉన్నాయి. అంతేకాదు.. హెచ్ అండ్ ఎం, టెస్కో, ప్రిమార్క్, న్యూలుక్ లాంటి చాలా బ్రాండ్స్ బట్టలు ఇక్కడ దొరుకుతాయి. ఈ మార్కెట్‌పై ఆధారపడి 30,000 మంది బతుకుతున్నారు.
30 శాతం మాత్రమే
గతంలో ఇక్కడికి వచ్చే బట్టల్లో 70 శాతం బాగుండేవి. కానీ.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పన్నెండేండ్ల నుంచి సెకండ్ హ్యాండ్ బట్టల పేరుతో ఇక్కడికి పనికిరాని బట్టలను ఎగుమతి చేస్తున్నారు. అక్రాకు ఎగుమతి అయ్యే బట్టల్లో 30 శాతం మాత్రం వాడుకోవడానికి పనికొచ్చేవి. మిగతా 70 శాతం ఎందుకూ పనికిరానివే. వాటిలో నుంచి కూడా కొంత భాగం అప్‌సైకిల్ చేస్తున్నారు. కానీ.. మిగతావి సిటీ శివార్లలో కాల్చి వేస్తారు లేదా సిటీ చుట్టుపక్కల గుట్టలుగా పారేస్తారు. వాటివల్ల అక్కడి వాతావరణం చాలావరకు దెబ్బతింటోంది.
చిలీలో బట్టల కుప్పలు
ప్రపంచంలోనే అత్యంత పొడి ఎడారిగా పేరున్న చిలీలోని అటాకామాలో క్రిస్మస్ స్వెటర్లు, స్కీ బూట్‌లతో సహా చాలా రకాల బట్టలు పెద్ద కుప్పలుగా పడి ఉన్నాయి. చిలీ కొన్నాళ్లుగా ఫాస్ట్ ఫ్యాషన్ వల్ల ఏర్పడే కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.సెకండ్ హ్యాండ్, అమ్ముడుపోని బట్టలకు కేంద్రంగా మారింది చిలీ. చైనా, బంగ్లాదేశ్‌లో తయారైన బట్టలు చిలీకి చేరుకోవడానికి ముందు యూరప్, ఆసియా, యునైటెడ్ స్టేట్స్ ప్రజలు వాడతారు. ఆ తర్వాత ఉత్తర చిలీలోని ఆల్టో హోస్పిసియో ఫ్రీ జోన్‌లోని ఇక్విక్యూ పోర్ట్‌కు చేరుకుంటాయి. ఇలా ప్రతి ఏడాది దాదాపు 59,000 టన్నుల బట్టలు వస్తుంటాయి.
ఆ పోర్ట్‌కు1,800 కిలోమీటర్ల దూరంలో రాజధాని శాంటియాగో నుండి బట్టల వ్యాపారులు వచ్చి క్వాలిటీ ఉన్న వాటిని కొంటారు. వాటిలో చాలావరకు లాటిన్ అమెరికా దేశాలకు రవాణా అవుతాయి. ‘‘ ఏటా దాదాపు 39,000 టన్నుల సేల్ కాని బట్టలు పోర్ట్ దగ్గరే మిగిలిపోతాయి. అవన్నీ ఎడారిలో చెత్తకుప్పలుగా మారుతున్నాయి. పాత బట్టలు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ పేరుకుపోతున్నాయి. ఇక్కడ సమస్య ఏమిటంటే... బట్టలు అంత ఈజీగా మట్టిలో కలిసిపోవు. పైగా రసాయనాలు ఉంటాయి. కాబట్టి మునిసిపల్ ల్యాండ్‌ఫిల్స్‌లో వేయడానికి అధికారులు ఒప్పుకోవడం లేదు. అవి ఇలా ఎడారిలో గుట్టలుగా పేరుకుపోతున్నాయ’’ని పోర్ట్ మాజీ ఉద్యోగి అలెక్స్ కారెనో ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ చెప్పాడు.
కరుణాకర్ మానెగాళ్ల