ఇంటర్వ్యూ..ఇష్టంతో చేస్తే... కష్టం అనిపించదు

అరవై నాలుగు కళల్లో నృత్య కళ ఒకటి. అందులో ఎన్నో రకాలున్నప్పటికీ క్లాసికల్​ డాన్స్​కు ప్రత్యేక స్థానం ఉంటుంది. కళ్లతో చేసే కదలికలు.. లయబద్ధంగా కదిలే పాదాలు.. శరీర భంగిమలు.. వీక్షకులను కట్టిపడేస్తాయి. కానీ, డాన్స్​ నేర్చుకోవడం అంత సులువు కాదు. ఏండ్ల తరబడి చేసే తపస్సుతో సమానం. ఆ కష్టానికి ఫలితం కూడా అదే స్థాయిలో ఉంటుంది. అలాంటి అందమైన కళను అవపోసన పట్టి, అంతర్జాతీయంగా కీర్తిప్రతిష్టలు పొందిన క్లాసికల్ డాన్సర్స్​లో ఒకరు డాక్టర్ అనురాధ (జొన్నలగడ్డ) తడకమళ్ల. ఆమె నలభై ఏండ్ల కూచిపూడి నాట్య ప్రయాణం గురించి...


మీ నేటివ్​ ప్లేస్​, ఫ్యామిలీ బ్యాక్​గ్రౌండ్​?

నేను పుట్టి పెరిగింది హైదరాబాద్​లోనే. అత్తగారి ఊరు నల్గొండ. నాన్న బ్యాంక్​ ఉద్యోగి.

కూచిపూడి నాట్యం నేర్చుకోవడం ఎప్పుడు? ఎలా మొదలుపెట్టారు?

మా ఫ్యామిలీలో, రిలేటివ్స్​లో డాన్సర్స్​ ఎవరూ లేరు. డాన్స్​ గురించి ఇప్పుడు ఉన్నంత అవగాహన  అప్పట్లో ఉండేది కాదు. కానీ, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి డాన్స్ చేస్తుండేదాన్ని. అది చూసి క్లాసికల్ డాన్స్ నేర్పిస్తే బాగుంటుంది అనుకున్నారు మా అమ్మానాన్న. నా ఐదేండ్ల వయసులోనే కూచిపూడి నేర్చుకోవడం మొదలుపెట్టా. 

కూచిపూడి కెరీర్​ ఎప్పుడు మొదలైంది? 

నా కూచిపూడి నాట్య ప్రయాణం​1976లో మొదలుపెట్టా.1993లో ప్రొఫెసర్​గా కెరీర్ స్టార్ట్ చేశా. ప్రస్తుతం హైదరాబాద్ యూనివర్సిటీలో డాన్స్​ డిపార్టెంట్​ హెడ్​గా ఉన్నా. 

పేరుతెచ్చిన పర్ఫార్మెన్స్​లు... 

హైదరాబాద్​ యూనివర్సిటీలో పాతికేండ్లకు పైగా కెరీర్ నాది. అక్కడ ఇచ్చిన ప్రతి పర్ఫార్మెన్స్ నాకు పేరుతెచ్చినవే. ఈ మధ్యకాలంలో ‘మహాకాళి’ అని డాన్స్ పర్ఫార్మెన్స్ ప్రొడ్యూస్ చేశా. దానికి చాలామంచి అప్రిసియేషన్ వచ్చింది. 

అంతకుముందు బాంబేలో, సెంట్రల్​ అకాడమీకి చేసిన వాటికి కూడా ప్రశంసలు వచ్చాయి. మారిషస్​లో జరిగిన 60 ఏండ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు గవర్నమెంట్ నుంచి డెలిగేట్​గా ఆహ్వానం అందింది. అక్కడ ఒక సిరీస్​లాగా పర్ఫార్మెన్స్​లు ఇప్పించారు. చైనాలో ‘ఫెస్టివల్​ ఆఫ్ ఇండియా’ పేరుతో జరిగిన ప్రారంభోత్సవ వేడుకలన్నింటికీ మా టీం పర్ఫార్మెన్స్ చేసింది. 

ఎంతవరకు చదువుకున్నారు? ఎక్కడ చదివారు?

హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఇంగ్లిష్​ లిటచరేచర్​లో డిగ్రీ పూర్తి చేశా. ఎందుకంటే అప్పట్లో డాన్స్ కోర్సులు డిగ్రీలో లేవు. అందుకే డిగ్రీ హిస్టరీ చదివితే పీజీలో ఆర్కియాలజీ చేసి, డాన్స్​కి సంబంధించి చదువుకోవచ్చు అనుకున్నా.1988లో డిగ్రీ పూర్తయ్యే టైంకి సెంట్రల్ యూనివర్సిటీలో డాన్స్​లో మాస్టర్స్ డిగ్రీ కోర్స్ పెట్టారు. వెంటనే ఆ కోర్సు​లో జాయిన్​ అయ్యా. ఆర్ట్స్ పర్ఫామ్​ చేసిన ఫస్ట్​ బ్యాచ్ మాది. ​డాన్స్​లో పీహెచ్​డీ చేయడానికి యూజీసీ ఫెలోషిప్ వచ్చింది నాకు.1996లో పీహెచ్​డీ పూర్తి చేశా.  

వేదాంతం రాఘవయ్య గారి మీద పుస్తకం రాయాలని ఎందుకు అనిపించింది?

వేదాంతం రాఘవయ్యగారి గురించి పబ్లిక్​కి ఎక్కువగా తెలియదు. ఒక సినిమా డైరెక్టర్​గా మాత్రమే ప్రేక్షకులకు తెలుసు. కానీ, తెలియని విషయం ఏంటంటే.. ఆయన మూలాలు కూచిపూడిలో ఉన్నాయి. ఆయన ఒకప్పుడు మంచి పర్ఫార్మర్​. సినిమా రంగం మొదలవుతున్నప్పుడు ఆయన మద్రాసు వెళ్లారు. 

అలా సినిమాల్లోకి అడుగుపెట్టారు. ఈయనలాగే మరో నలుగురు కూడా కూచిపూడి నుంచి నటనా రంగం వైపు వెళ్లినవాళ్లు ఉన్నారు. వాళ్లందరూ సినిమాలకు కంట్రిబ్యూట్ చేశారు. డాన్స్​తోపాటు రకరకాల పనుల్లో ఇన్వాల్వ్ అయ్యేవాళ్లు. కానీ, చాలామంది వాళ్లను ఉపాధికోసం వెళ్లారని అనుకుంటారు. సినిమా రంగానికి వాళ్ల శాయశక్తులా కృషి చేశారు. ఈ విషయాలన్నీ అందరికీ తెలియజెప్పడానికే బుక్​ తీసుకొచ్చాం. 

ఈ పుస్తకం తీసుకొచ్చేందుకు ఎంత సమయం పట్టింది?

నా దగ్గర పీహెచ్​డీ చదివే అమ్మాయి ఆయన మీద రీసెర్చ్ చేసింది. అయితే, వేదాంతం రాఘవయ్య గారు సినిమాల్లో డైరెక్టర్​గా పేరుతెచ్చుకున్నారు. అందుకు కూచిపూడి ఎలా ఉపయోగపడింది? దాంతో ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్​ ఏంటి? అనే విషయాలు అందులో పొందుపరిచాం. ఆయన శతవసంతాల వేడుక రాబోతుందనగా ఏం చేద్దాం అనుకుంటుండగా.. ఒక పబ్లికేషన్ తీసుకురావాలనే ఆలోచన వచ్చింది. ‘ఆర్ట్ ఇండియా’​ పేరుతో ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేశాం. 

ఆయన ఫొటోలు కలెక్ట్ చేసేందుకు కొంచెం కష్టపడ్డాం. నా దగ్గర ప్రైమరీ సోర్స్ చాలా ఉంది. చాలా ఫీల్డ్ వర్క్ చేశా. స్వతహాగా నేను డాన్సర్​ని, నేర్చుకుని, పర్ఫార్మ్ చేసి, గురువులతో ఇంటరాక్ట్​ అయినదాన్ని అందుకని నాకు థియరిటికల్ పార్ట్​తోపాటు, ప్రాక్టికల్​ పార్ట్​ తెలుసు. కాబట్టి నేను ఆలోచించే కోణం వేరుగా ఉంటుంది. అలా నేను ఆ పుస్తకం​ ఎడిట్ చేశా. బుక్ పబ్లిష్​​ చేయడం కోసం దాదాపు తొమ్మిది నెలలు పనిచేశాం. ఇది నా ఒక్కరి కష్టం కాదు. నాతోపాటు శాస్త్రి గారు, కాత్యాయిని అనే అమ్మాయి ఒక టీంగా పనిచేశాం. ఆయన చేసిన కొరియోగ్రఫీలు కూడా రీ–క్రియేట్​ చేశాం. ఆ రోజు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కూడా వచ్చారు. ఆయన పుస్తకం చూసి చాలా సంతోషించారు. 
 

దీనికంటే ముందు ‘కూచిపూడి డాన్స్:​ హు అండ్​ హు’ అనే పుస్తకం రాశా. అది డాన్స్​ గురువుల బయోగ్రఫీ. అదే నా మొదటి పుస్తకం. తెలుగు మహాసభల కోసం తెలుగు యూనివర్సిటీ వాళ్లు ‘కూచిపూడి హిస్టరీ అండ్ ఎవల్యూషన్’​ మీద చిన్న బుక్స్ తీసుకొచ్చారు. దానికి తెలుగులో రాశా. ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ జరిగినప్పుడు సిలికానాంధ్ర వాళ్లకు కూచిపూడి మీద స్పెషల్ వాల్యూమ్స్ రాశా. 

తెలంగాణలో నాట్యం పుస్తకం గురించి..

‘తెలంగాణలో నాట్యం’ అనే పేరుతో తెలంగాణ నాటక అకాడమీ వాళ్లు పబ్లిష్ చేశారు. దాంట్లో భరతనాట్యం, కూచిపూడి డాన్స్​ల చరిత్ర గురించి రాశా. అందులో తెలంగాణలో డాన్స్​కు ఒక సంప్రదాయం ఉండేది. మొదట ఎవరు మొదలుపెట్టారు? ఎక్కడెక్కడ ఎలా వ్యాప్తి చెందింది? డాన్స్​కు సంబంధించి ఎడ్యుకేషన్​ ఎలా డెవలప్ అయింది? ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు నేను ఆర్టికల్స్ కూడా రాశా.

 అంతేకాకుండా నిజాంల కాలంలో కూడా డాన్సర్స్ ఉండేవాళ్లు. ఇలా అన్ని రకాల అంశాలతో సమగ్రంగా ఒక పుస్తకాన్ని తీసుకొచ్చాం. దానికి నేను చీఫ్​ ఎడిటర్​గా ఉన్నా. ఇప్పుడు డాన్స్​ గురించి చదువుకోవాలి అనుకునే వాళ్లకి హైదరాబాద్​లో రెండు యూనివర్సిటీల్లో మాస్టర్స్ డిగ్రీ ఉంది. అలాగే సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్​డీ ప్రోగ్రాం కూడా ఉంది. తెలంగాణ స్కాలర్​షిప్స్ ఇస్తోంది. 

ముందు ముందు ఇంకేమైనా పుస్తకాలు తీసుకొస్తారా?

ఇప్పటివరకు ఆరు పుస్తకాలు పబ్లిష్​ చేశా. ప్రత్యేకంగా కూచిపూడి చరిత్ర, డెవలప్​మెంట్, ఎవల్యూషన్​.. వంటి అంశాలన్నీ కలిపి ఒక పుస్తకం తీసుకురావాలనే ఆలోచన ఉంది. త్వరలో తీసుకొస్తాం. 

ఇన్నేండ్ల కెరీర్​లో ఎప్పుడైనా ఇక చాలు అనిపించిందా?

తృప్తి ఉంటే ఎదుగుదల ఆగిపోతుంది.​ అలాకాకుండా ఇంకా చేయాలనే తపన ఉండాలి. ఉంటేనే చేయగలం. తరువాతి తరాలను ఎంకరేజ్ చేయగలం. నేను అలా లేకపోతే నా స్టూడెంట్స్​కి ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది? అంతేకాకుండా నా స్టూడెంట్స్​ తీసుకున్న సబ్జెక్ట్స్​ గురించి వాళ్లతో పాటు నేను కూడా వర్క్ చేస్తా. దానివల్ల నేనూ నేర్చుకోగలను. వాళ్లకు కావాల్సిన గైడెన్స్ ఇస్తా. నా పని నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. చాలు ఇక అయిపోయింది అనే ఆలోచన నాకెప్పుడూ రాదు. నాలెడ్జ్​ అనేది అనంతం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటేనే మరో మెట్టు ఎక్కుతాం. లేదంటే అక్కడే ఆగిపోతాం. 

పెండ్లి తరువాత మీ లైఫ్​లో మార్పు వచ్చిందా?

పెండ్లి చేసుకునే అప్పటికే మంచి పర్ఫార్మర్​గా పేరు తెచ్చుకున్నా. నా గురించి తెలిసి, నన్ను ఇష్టపడి పెండ్లి చేసుకున్నారు మా వారు. మా ఆయన, వాళ్ల కుటుంబం కూడా నన్ను ఎంకరేజ్​ చేశారు. వాళ్లు నాకెప్పుడూ సపోర్ట్ చేస్తారు. 

అందుకే పెండ్లి అయ్యాక నా డాన్స్​ కెరీర్​లో బ్రేక్​ పడలేదు. పెండ్లి అయితే ఫ్యామిలీ పెద్దది అవుతుంది. పిల్లల్ని చూసుకోవాలి. ఇలా బాధ్యతలు పెరుగుతాయి. వాటిని బ్యాలెన్స్ చేయడానికి కాస్త ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. అందుకు ప్లానింగ్ చాలా అవసరం. దేనికి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వాలి? అనే విషయంలో కచ్చితంగా ఉండాలి. అప్పుడు వాళ్లు కూడా సపోర్ట్​ చేయడానికి ముందుకొస్తారు. వాళ్ల సపోర్ట్ దొరికితే కెరీర్ కంటిన్యూ చేయొచ్చు.  

ఛాలెంజింగ్​ అనిపించిన సందర్భం ఏదైనా ఉందా?

పీహెచ్​డీ చేయడం అనేది నాకు పెద్ద సవాలుగా అనిపించింది. ఎందుకంటే ప్రైమరీ సోర్స్ సేకరించడం, అకడమిక్ ఫ్రేమ్​ వర్క్​ రెడీ చేయడం చేశాం. మొదటి బ్యాచ్ కావడంతో అకడమిక్ స్ట్రక్చర్ ఏం లేదు. అవన్నీ చూసుకుని ప్రొఫెసర్స్ ఇచ్చిన సోర్స్​ని ఒక పద్ధతిలో పెట్టడం అనేది ఒక ఛాలెంజ్​. ఇప్పుడు కూచిపూడి మీద ఎవరైనా పీహెచ్​డీ చేయాలనుకుంటే... వాళ్లకు నా థీసిస్​ ఉపయోగపడుతుంది. అంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే... అంత అంకితభావంతో పని​ చేసి దాని ఫ్రేమ్​ వర్క్ కరెక్ట్​గా తీసుకురాగలిగాం. 

ఫీల్​ గుడ్ మెమొరీ ఏదైనా...

అప్పట్లో చాలా సన్నగా, చిన్న అమ్మాయిలా ఉండేదాన్ని. నన్ను చూసిన వాళ్లెవరూ డాన్సర్​ అనుకునే వాళ్లు కాదు. ఒకసారి మైసూర్​ ప్యాలెస్​లో నా ప్రోగ్రాం ఉంటే వెళ్లా. ఆర్టిఫిషియల్ లెగ్స్ మాన్యుఫాక్చరింగ్​ కోసం అని ఒక యూనిట్​ పెట్టి డొనేషన్ కలెక్ట్ చేస్తున్నారు. డొనేషన్ ప్రోగ్రాం కింద నా పర్ఫార్మెన్స్ ఏర్పాటు చేశారు. 

అది1980ల కాలం. అప్పట్లోనే లక్షన్నర డొనేషన్స్ కలెక్ట చేశారట వాళ్లు. అయితే ఆ ప్రోగ్రాంకి నేను వెళ్తే, వాళ్లు నన్ను చూసి డాన్సర్​ అనుకోలేదు. నేను రెండు ఐటమ్స్ పర్ఫార్మ్​ చేసేవరకు నమ్మలేకపోయారు. ఆ తర్వాత నా దగ్గరకొచ్చి ‘మమ్మల్ని మన్నించండి. అసలైన డాన్సర్​ కాకుండా వేరెవరో వచ్చారు అనుకున్నాం. కానీ, మీరు స్టేజ్​ పర్ఫార్మ్​ చేస్తుంటే ఆశ్చర్యపోయాం. చాలా  సంతోషంగా ఉంది’ అని చెప్పారు. అలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి.

యాక్టింగ్​ వైపు ఏమైనా ప్రయత్నించారా?

లేదు. నా ఇంట్రెస్ట్​ డాన్స్​ ఒక్కటే. యాక్టింగ్​ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. డాన్స్​లోనే అకడమిక్స్ చేయాలనుకున్నా. అదే చేశా.

బుక్స్ రాయడం ఎలా మొదలైంది?

నేను పీహెచ్​డీ చేసేటప్పుడు రైటింగ్​ కూడా ఆర్ట్​లో ఒక భాగం. కాబట్టి నేను సొంతంగా బుక్స్ రాశా. నేను కొన్ని బుక్స్​ ఎడిటింగ్​ కూడా చేశా. నా దగ్గర ఇప్పటివరకు13 మందికి పీహెచ్​డీ వచ్చింది. 

మీ దృష్టిలో డాన్స్ అంటే ఏంటి? క్లాసికల్ డాన్స్​ నేర్చుకోవాలనుకునే వాళ్లకు ఇచ్చే సలహా?

‘మనోవాక్కాయ కర్మణ’ అంటారు.. మనసు, వాక్కు, కాళ్లూచేతులు అన్నీ కలిసి ఒక ఇమేజ్​ ఏర్పరచడమే డాన్స్‌‌‌‌. మనలో ఉన్న భావాలను వ్యక్తీకరించేది. దానికి ఒక టెక్నిక్ ఉంటుంది. నిబద్ధత ఉంటుంది. 
 

డాన్స్ అనే కాదు.. ఎప్పుడైనా... ఏదైనా నేర్చుకోవాలి అంటే.. అందులో శ్రమ ఉంటుంది. ఆ శ్రమను ఓర్చుకోవాలి. ఒక దాంట్లో కంటిన్యుటీ ఉండాలి. ప్రత్యేకించి ఆర్ట్​ ఫామ్స్ విషయానికొస్తే... అవి చేస్తూనే ఉండాలి. శరీరానికి సంబంధించింది కాబట్టి అది మన ఆధీనంలో ఉండాలి. శరీరం ఎటు వంచితే అటు వంగాలి. 

ఫెక్సిబిలిటీ మెయింటెయిన్ చేయాలి. దానికి నిరంతర సాధన అవసరం. క్లాసికల్ డాన్స్​లో ఎక్కువకాలం ఉంటేనే ఒక స్థాయికి చేరగలుగుతాం. ఎన్నో ఏండ్ల  ప్రాక్టీస్​, కంటిన్యుటీ అనేది అవసరం. ఇందులో షార్ట్ కట్ పద్ధతి ఉండదు. ఆర్ట్​ ఫామ్​ ఏదైనా దాని పట్ల గౌరవం ఉండాలి. అప్పుడే బాగా నేర్చుకోగలం. ఇష్టపడి వచ్చినప్పుడు దాన్ని వదిలిపెట్టకుండా చేయాలి.  

-మనీష పరిమి