మంత్రి జూపల్లి పర్యటనలో ప్రొటోకాల్ రగడ

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్​లో జిల్లా ఇన్​చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన సందర్భంగా ప్రొటోకాల్ పాటించడంలేదని బీజేపీ, కాంగ్రెస్​ నాయకుల మధ్య గొడవ జరిగింది. గురువారం పెర్కిట్​లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. మంత్రి జూపల్లి రాకముందు ఎమ్మెల్యే పైడి రాకేశ్ ​రెడ్డి అక్కడికి వచ్చారు. కొనుగోలుకు కేంద్రానికి సంబంధించి ఏర్పాటు చేసిన ప్లెక్సీలో ప్రొటోకాల్​ పాటించలేదని, ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే రాకేశ్​రెడ్డి ఫొటోలు ఎందుకు వేయలేదని బీజేపీ నాయకులు, కాంగ్రెస్​ నాయకులను ప్రశ్నించారు.

దీంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. కాంగ్రెస్ ​నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు వారు చించేశారు. దీంతో గొడవ మరింత ముదరింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇరువురిని సముదాయించారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ నియోజకవర్గ ఇన్​చార్జి వినయ్​ కుమార్ రెడ్డి, బీజేపీ, కాంగ్రెస్​నాయకులు పాల్గొన్నారు.