జోరుగా పీడీఎస్​రైస్​ రీసైక్లింగ్

  • ఆర్గనైజింగ్ విధానంలో బియ్యం సేకరణ
  • గోదాంల వద్ద రౌడీలతో కాపలా
  • నిందితులు దొరికినా ఉదాసీనం
  • పెద్దల అండదండలతో అదే దందా కొనసాగింపు

నిజామాబాద్,  వెలుగు: బాల్కొండ సెగ్మెంట్​వేల్పూర్ మండల శివారులోని వజ్ర ఇండస్ట్ర్రీస్​ మిల్లులో ఈనెల 8న సివిల్​సప్లయ్​ ఎన్​ఫోర్స్​మెంట్​టీం 700 క్వింటాళ్ల పీడీఎస్​ రైస్​ పట్టుకున్నారు. తహసీల్దార్, పోలీస్​స్టేషన్​కు కూతవేటు దూరంలో ఈ స్థాయిలో రేషన్​ బియ్యం దొరకడం తనిఖీల డొల్లతనాన్ని బహిర్గతం చేసింది.  ఒక రాజకీయ పార్టీ నేతకు చెందిన ఈ మిల్లును సీజ్​ చేసినప్పటికీ, స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని మొదట 1400 క్వింటాళ్లుగా ప్రకటించి తరువాత 700 క్వింటాళ్లకు తగ్గించడంపై ప్రజలలో అనుమానాలున్నాయి. ఈ మిల్లులో పీడీఎస్​ రైస్ పట్టుకోవడం ఇది రెండోసారి. రీసైక్లింగ్​బిజినెస్​ కోసం వీటిని తెప్పిస్తున్నట్లు విచారణలో అధికారులు తేల్చారు. 

9న నగరంలోని ఓ గోదాంపై వన్​టౌన్​పోలీసులు రైడ్​చేసి లారీలో లోడ్​ చేస్తున్న రెండు టన్నుల పీడీఎస్​ రైస్​ పట్టుకున్నారు. మహారాష్ట్రలో అమ్మడానికి లోడ్​ చేస్తున్న టైంలో దాడి చేసి సుల్తాన్, సుమేర్​ అనే వారిని అదుపులోకి తీసుకున్నారు. గత నెలలో వీరిద్దరిపై మాక్లూర్​ ఠాణాలో పీడీఎస్​ దందాపై కేసులు నమోదయ్యాయి. 

10న ఆజంకాలనీలోని ఐస్ ఫ్యాక్టరీలో టాస్క్​ఫోర్స్​ పోలీసులు 30 క్వింటాళ్ల పీడీఎస్​ రైస్​ పట్టుకొని 5వ టౌన్​లో అప్పగించారు. ట్రాన్స్​పోర్ట్​ చేయడానికి సిద్ధం చేసిన వ్యాన్​ను, డ్రైవర్​ను పట్టుకున్నారు.  అదే రోజు బోధన్​శివారు ఆటోనగర్​వద్ద బొలేరో లో మహారాష్ట్ర తరలిస్తున్న 20 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్టు చేశారు. నిజామాబాద్​గోదాం నుంచి రైస్​ను పొరుగు రాష్ట్రం తీసుకెళ్తున్నట్లు పోలీస్​ విచారణలో వెల్లడించాడు.  అంతకు ముందు   పట్టణంలోని ఓ రైస్​ మిల్​లో భారీగా పీడీఎస్​ రైస్​ దొరికాయి. రీసైక్లింగ్​ చేసి అక్కడి నుంచి 8 కిలోమీటర్ల దూరంలోని మరాఠా బార్డర్​కు లారీలలో రాత్రి వేళ పంపుతున్నట్లు తేలింది. 

దుకాణాల సమాచారం తెలుసుకొని..

జిల్లాలో 3,65,366 రేషన్​ కార్డులున్నాయి.  ప్రతీ నెలా 64.49 లక్షల కిలోల రైస్​ను ప్రభుత్వం​సప్లయ్​ చేస్తోంది. ఇందులో దొడ్డు రకం,  సన్న రకం బియ్యం ఉంటాయి.  అయితే దొడ్డురకం రైస్​ట్రాన్స్​పోర్ట్​ అయిన దుకాణాల సమాచారం తెలుసుకొని  డీలర్ల నుంచి ఆర్గనైజ్డ్​ ముఠా సభ్యులు కిలోకు రూ.15 లకు కొంటున్నారు.  దొడ్డు బియ్యం ఉపయోగించని కుటుంబాల వివరాలు సేకరించి పెట్టుకునే డీలర్ ద్వారా ఫస్ట్​స్టెప్ దందా నడుస్తోంది.

 కార్డుదారులకు కొంత ముట్టజెబుతున్నారు.  ఇలా జిల్లా వ్యాప్తంగా సేకరించిన బియ్యాన్ని రీసైక్లింగ్​ బిజినెస్​ చేసే మిల్లర్లకు రూ.30 చొప్పున విక్రయిస్తున్నారు.  మిల్లర్లు తిరిగి వాటిని సన్నబియ్యంగా మార్చి మహారాష్ట్ర మార్కెట్​లో క్వింటాల్​కు రూ.5 నుంచి రూ.6 వేల దాకా అమ్ముకుంటున్నారు. ఆరుతడి పంటలు అధికంగా సాగయ్యే పక్క రాష్ట్రంలో బియ్యానికి బాగా డిమాండ్​ ఉంది. 

కిలోకు రూ.15 పెట్టుబడితో కొంటున్న పీడీఎస్​ రైస్​ డబుల్ లాభాలు ఇవ్వడంతో నాలుగు ముఠాలు  నిత్యం సేకరణపైనే ఫోకస్​పెడుతూ నగర శివారులోని అర్సాపల్లి వద్దగల రెండు గోడౌన్స్​లో నిల్వచేస్తున్నారు. ఇటీవల గోదాంపై పోలీసులు రైడ్​ చేసిన సందర్భంలో బియ్యంతో పాటు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. 

కాపలా విధులు నిర్వహిస్తున్న ఇద్దరు రౌడీలను అదుపులోకి తీసుకున్నారు. దాడులు చేయడానికి ఆఫీసర్లు భయపడేలా దందా నడుపుతున్నారు. నగదు పంపిణీలో ముఠాల మధ్య తేడా వచ్చినప్పుడే స్టాక్ వివరాలు​ లీకవుతున్నాయి. అప్పుడు మాత్రమే అధికారులు సోదాలు చేస్తున్నారు. కేవలం పీడీఎస్​ దందా విబేధాల కారణంగా ఆరు నెలల కింద ఇద్దరు రౌడీలు హత్యకాగా, ఓ ఏఎస్​ఐ బదనామ్​
అయ్యాడు.   

జిల్లాలో పీడీఎస్​ రైస్ ​రీసైక్లింగ్​ దందా జోరుగా నడుస్తోంది. ముఠాగా ఏర్పడి సేకరించిన పీడీఎస్​ బియ్యాన్ని  సన్న బియ్యంగా మార్చి మహారాష్ట్రకు రవాణా చేస్తున్నారు.  క్వింటాల్ రూ.3 వేల చొప్పున కొనుగోలు చేసి ​బయట రూ.5 వేలకు అమ్ముతున్నారు. అడపాదడపా కేసులు నమోదవుతున్నా పెద్దల అండదండలతో  అదే దందా కొనసాగిస్తున్నారు.  రెవెన్యూ ఆఫీసర్లు దీనికి సహకరిస్తున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి.