ప్రపంచంలోనే అత్యంత చౌకగా మందులను అందించే దేశాల్లో భారతదేశం ఒకటి. దీనికి కారణం.. భారతీయ ఫార్మా కంపెనీలు. వాటిలో ప్రముఖంగా వినిపించే పేరు సిప్లా. ఇండియాలోని పేదలకు తక్కువ ధరకు మెడిసిన్ అందించాలనే ఉద్దేశంతో పెట్టిన కంపెనీ ఇది. అంతేకాదు.. ఆఫ్రికాలో ఎయిడ్స్‌తో చనిపోతున్న లక్షలాది మంది ప్రాణాలను కాపాడింది ఈ కంపెనీ.
దేశంలోని మూడో అతిపెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీ సిప్లా. మన దేశంతో పాటు ఆసియా, ఆఫ్రికాల్లోని ఎన్నో దేశాల్లో మెడిసిన్ అమ్ముతోంది. దీనికి ప్రపంచంలో 47 మెడిసిన్ తయారీ యూనిట్లు ఉన్నాయి. ప్రస్తుతం 86 దేశాలకు మెడిసిన్ ఎక్స్‌పోర్ట్ చేస్తోంది. గత ఏడాది రూ.14,518 కోట్లు సంపాదించింది. ఇంత ఎత్తుకు ఎదిగిన ఈ కంపెనీ మొదలైంది ఇలా...
సిప్లా కంపెనీ ఒక చిన్న ల్యాబ్‌లో మొదలైంది. దీనిని ఖ్వాజా అబ్దుల్ హమీద్ స్థాపించాడు.
ఆయన 1898లో అలీగఢ్‌లోని ఒక సంపన్న కుటుంబంలో పుట్టాడు. తండ్రి జడ్జి. కొడుకు కూడా ‘లా’ చదివి పెద్ద లాయర్‌గా ఎదగాలని కోరుకున్నాడు. అబ్దుల్ హమీద్‌ను ‘లా’ చదివించడానికి లండన్ పంపాడు. కానీ.. హమీద్‌కు మాత్రం కెమిస్ట్రీ చదవాలనే ఇష్టం ఉండేది. అందుకే ‘లా చదువు’ మధ్యలోనే ఆపేసి జర్మనీలోని బెర్లిన్‌కు వెళ్లాడు. అప్పట్లో బెర్లిన్ కెమిస్ట్రీ రీసెర్చ్‌లకు కేరాఫ్‌గా ఉండేది. అక్కడ పీహెచ్‌డీ చేస్తున్నప్పుడు పోలాండ్‌కు చెందిన లూబా అనే అమ్మాయి పరిచయమైంది. ఆ స్నేహం తర్వాత ప్రేమగా మారి, ఇద్దరూ పెండ్లి చేసుకున్నారు. అదే టైంలో జర్మనీ అడ్మినిస్ట్రేషన్ హిట్లర్ చేతిలోకి వెళ్లింది. అల్లర్లు మొదలయ్యాయి. ఎలాగోలా ఖ్వాజా అబ్దుల్, లూబా ప్రాణాలను కాపాడుకుని ఇండియాకి వచ్చారు.
చిన్న ల్యాబ్‌తో మొదలై..
జర్మనీ నుండి1927లో ఇండియాకు వచ్చాడు హమీద్. అప్పట్లో ఎక్కువగా జర్మనీకి చెందిన కంపెనీలే ఇండియాలో మెడిసిన్స్ అమ్మేవి. మన దేశానికి పెద్ద ఎత్తున మందులు దిగుమతి అయ్యేవి. వాటి ధరలు ఎక్కువగా ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో హమీద్ మన దేశంలో మెడిసిన్ తయారీ మొదలుపెట్టాలి అనుకున్నాడు. విదేశీ మెడిసిన్‌తో పోలిస్తే తక్కువ ధరకే అందించాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే1935లో ఒక చిన్న ల్యాబ్‌ని ప్రారంభించాడు. అతని నిర్ణయాన్ని మహాత్మాగాంధీ, పండిట్ నెహ్రూ, నేతాజీ సుభాష్ లాంటి వాళ్లంతా మెచ్చుకున్నారు. ల్యాబ్‌కు ‘‘ఇండియన్ ఇండస్ట్రియల్ అండ్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్’’ అని పేరు పెట్టాడు. తర్వాత కంపెనీ పేరుని‘‘ కెమికల్ ఇండస్ట్రియల్ అండ్ ఫార్మాస్యూటికల్ లాబొరేటరీస్’’ (సిప్లా)గా మార్చి1937లో ప్రొడక్షన్ మొదలుపెట్టాడు. ఆయన నాయకత్వంలో కంపెనీ బాగా డెవలప్ అయ్యింది.
మొదట్లో ఇబ్బందులు
కంపెనీ పెట్టిన మొదట్లో పెద్దగా లాభాలు రాలేదు. కంపెనీ గోదాములు మందులతో నిండిపోయేవి. అబ్దుల్ హమీద్ ఖజానా రోజురోజుకూ ఖాళీ అయ్యింది. ప్రొడక్షన్‌కు డబ్బు లేకుండా పోయింది. కానీ.. సరిగ్గా అదే టైంలో సిప్లాకు లాభాలు తెచ్చేందుకే అన్నట్టు ప్రపంచ యుద్ధం మొదలైంది. దాంతో విదేశాల నుండి వచ్చే మందుల సప్లై చైన్ దెబ్బతిన్నది. ఇంపోర్ట్స్ చాలావరకు ఆగిపోయాయి. అలా సిప్లా లాంటి ఇండియన్ కంపెనీల మందులకు డిమాండ్ పెరిగింది. దీనివల్ల చాలావరకు కంపెనీలు లాభపడ్డాయి. సిప్లా స్టాక్ అంతా అమ్ముడుపోయింది. ఇక1944 నుంచి సిప్లా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మలేరియా, టీబీ, షుగర్‌ని తగ్గించే జనరిక్ మందుల ఉత్పత్తిని ప్రారంభించింది కంపెనీ. ఈ మందులు మార్కెట్లో తక్కువ ధరలో దొరకడంతో సేల్స్ బాగా పెరిగాయి.
జిన్నా ప్రతిపాదన
కంపెనీ బాగా నడుస్తున్నప్పుడు దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. దేశాన్ని రెండుగా విభజించాలని బ్రిటిషర్ల నుంచి ఆర్డర్. అప్పుడు హమీద్‌ను మహ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్‌కు రమ్మనమన్నాడు. కానీ.. హమీద్ అందుకు ఒప్పుకోలేదు. ఇండియాలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. అంతలోనే అబ్దుల్ హమీద్ కొడుకు యూసుఫ్ హమీద్ కేంబ్రిడ్జ్ నుంచి కెమిస్ట్రీలో పీహెచ్‌డీ పూర్తి చేసి ఇండియాకు తిరిగొచ్చాడు. తర్వాత 1966లో యూసుఫ్ సిప్లాలో ట్రైనీగా చేరాడు. మొదటి ఏడాదిన్నర కాలం అతను టేబుల్స్ శుభ్రం చేయడం లాంటి పనులు చేసేవాడు. ఆ తరువాత కంపెనీలో అన్ని పనులను ఒక్కొక్కటిగా నేర్చుకుని ఎదిగాడు. కానీ.. అతని చేతికి కంపెనీ వచ్చేసరికి వృద్ధిలో వేగం కాస్త తగ్గింది. అయితేనేం కొత్త విధానాలతో మళ్లీ కంపెనీకి పూర్వ వైభవం తీసుకురాగలిగాడు.
ప్రాణాలను కాపాడిన..
యూసుఫ్ హమీద్ 1990ల్లో ఒక పత్రికలో మొదటిసారిగా హెచ్‌ఐవీ గురించి చదివాడు. అప్పటికి జనాలకు దానిగురించి తెలియదు. 1993లో నేషనల్ కెమికల్ లాబొరేటరీకి సంబంధించిన డాక్టర్ రామారావు ‘‘ఎయిడ్స్ చికిత్స కోసం ఏజెడ్‌టీ ఫార్ములా తయారు చేశాన’’ని చెప్పాడు. దాన్ని తయారుచేసేందుకు ప్రభుత్వం పర్మిషన్ కూడా ఇచ్చింది. ఆ తర్వాత రెండేండ్లకు డాక్టర్ రావు సాయంతో సిప్లా మెడిసిన్ రెడీ చేసింది. ఒక్కరోజు మందులకు కంపెనీ ధర రూ.63గా నిర్ణయించింది.
ఇతర కంపెనీలు 376 రూపాయలకు అమ్మేవి. అయినా.. కొన్ని కారణాల వల్ల సిప్లా ఆ మందుల ఉత్పత్తి ఆపేసింది. కానీ.. ఎయిడ్స్ కేసులు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. 2000 సంవత్సరంలో యూసుఫ్ హమీద్ లండన్‌లో ఒక కార్యక్రమానికి వెళ్లాడు. అక్కడ ‘‘ఎయిడ్స్ వ్యాధికి అతి తక్కువ ధరకే మందును తయారు చేస్తాన’’ని చెప్పాడు. ఆ తర్వాత ఆయనే ఎయిడ్స్ చికిత్సలో వాడే మెడిసిన్ కాక్టెయిల్ని క్రియేట్ చేశాడు. 2001లో ఈ మెడిసిన్ ఒక ఏడాది డోస్ ధర రూ. 17,000గా నిర్ణయించారు.
ఇతర కంపెనీలు ఒక ఏడాదికి సరిపోయే మందులకు 5.5 లక్షల రూపాయలు వసూలు చేసేవి. తక్కువ ధరకు క్వాలిటీ మందులు అందుతుండడంతో సిప్లా తక్కువ టైంలో ఫేమస్ అయ్యింది. అంతేకాదు.. ఎక్కువ మంది ఎయిడ్స్‌తో బాధపడుతున్న ఆఫ్రికన్ దేశాలకు మందులను సప్లయ్ చేసింది. అప్పటికే అక్కడ హెచ్‌ఐవీ వల్ల వేల మంది చనిపోయారు. అలాంటి దేశాల్లో సిప్లా తయారు చేసిన మెడిసిన్ కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడింది. అంతేకాదు.. సిప్లా ఈ మందుని లాభాలు పొందేందుకు మార్కెట్‌లోకి తీసుకురాలేదు. ఇదే విషయం గురించి 2001లో మాట్లాడుతూ ‘‘సిప్లా హెచ్‌ఐవీ మందులను లాభం తీసుకోకుండా అమ్ముతోంద”ని చెప్పాడు యూసుఫ్ హమీద్.
అంత ఈజీ కాదు
సిప్లాకు సక్సెస్ అంత ఈజీగా రాలేదు. అబ్దుల్ హమీద్ ఆ తర్వాత యూసుఫ్ హమీద్ కంపెనీ కోసం ఎంతో కష్టపడ్డారు. అందుకే అప్పటికే ఉన్న బడా కంపెనీల పోటీని తట్టుకోగలిగింది. అంతేకాదు.. సిప్లా వల్ల ఇప్పుడు ఇండియాలోని ప్రజలు మలేరియా నుంచి క్యాన్సర్ వరకు ఎన్నో వ్యాధులకు తక్కువ ధరలకే మందులు అమ్ముతోంది. 1970 శకంలో సిప్లా న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ కంపెనీ పేటెంట్ తీసుకున్న ప్రొప్రానోలోల్ అనే మెడిసిన్ తయారీ మొదలుపెట్టింది.
రక్తపోటు, మైగ్రేన్, గుండె జబ్బుల చికిత్సలో దీన్ని వాడతారు. దాంతో అమెరికా సిప్లా కంపెనీ మీద ఇండియన్ గవర్నమెంట్‌కు ఫిర్యాదు చేసింది. అప్పడు ఇందిరాగాంధీ యూసుఫ్ హమీద్‌ను పిలిపించుకుని మాట్లాడారు. డ్రగ్స్ పేటెంట్ చట్టాన్ని ఉల్లంఘించి దేశాన్ని ఇబ్బందుల్లోకి నెట్టడంపై ఆరా తీశారు. ‘‘పేద ప్రజలకు తక్కువ ధరలకు మందులు అందించాలనేదే నా ఉద్దేశం. అందుకే అలా చేశామ’’ని చెప్పాడు ఇందిరతో చెప్పాడు హమీద్. అసలు విషయం తెలుసుకున్న ఇందిరాగాంధీ అమెరికా ఫిర్యాదుని పట్టించుకోలేదు. పైగా మెడిసిన్ పేటెంట్ చట్టంలో మార్పులు చేశారు. కొత్త చట్టం ప్రకారం.. తయారీ ప్రక్రియను మాత్రమే ఉల్లంఘించకూడదు. వేరే పద్ధతుల్లో అదే మందు తయారు చేసుకోవచ్చు. దాంతో సిప్లా పేదల కోసం తక్కువ ధరకు జనరిక్ మందులను తయారు చేయడం విపరీతంగా పెంచింది.
వివాదాలు
సిప్లా లాభాలు ప్రతి ఏడాది పెరుగుతూనే ఉన్నాయి. కానీ.. అలాగే కంపెనీ మీద వివాదాలు వచ్చాయి. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ మందులపై అధిక ధరలు వసూలు చేసినందుకు కంపెనీకి మూడు వేల కోట్ల రూపాయల జరిమానా విధించింది. అంతేకాదు.. అధిక ఛార్జీ విధించిన కేసులో సిప్లాపై సుప్రీంకోర్టు175 కోట్ల రూపాయల జరిమానా విధించింది. ఆ తర్వాత 2007లో వైద్య సలహా లేకుండా అత్యవసర గర్భనిరోధక మందులను అమ్మడంతో మరో వివాదం తలెత్తింది. అయినా వీటన్నింటినీ తట్టుకుని కంపెనీ ఎదిగింది. రెండు లక్షల రూపాయలతో మొదలైన కంపెనీ మార్కెట్ క్యాప్ ఇప్పుడు లక్ష కోట్ల రూపాయలకు పైనే ఉంది.
పోరాడాడు
1995 చట్టం ప్రకారం.. సిప్లా వంటి ఇండియన్ కంపెనీలు తక్కువ ధరలకే మందులు అమ్మగలిగాయి. కానీ.. 2005లో చట్టాన్ని మార్చడం వల్ల ఇలాంటి కంపెనీలకు సమస్యలు తలెత్తాయి. ఈ కంపెనీలు ముఖ్యంగా ‘రివర్స్ ఇంజనీరింగ్’ పద్ధతి ద్వారా మందులు తయారు చేస్తుంటాయి. అంటే.. వేరే కంపెనీల మందులను కాపీ చేసి తక్కువ ఖర్చుతో తయారుచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాయి. ఈ చట్టం దాన్ని నిషేధించింది. ఆ తర్వాత వైద్య రంగం పూర్తిగా మారిపోయింది. యూసుఫ్ హమీద్ దీనిమీద చాలాకాలం పోరాడాడు.
అబ్దుల్ హమీద్