Good Idea : మీ ఇంట్లోని మొక్కలకు ఈ చెక్క వేయండి.. దోమలు, చీమలు, ఫంగస్ రావు..!

దాల్చినచెక్కలో ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. అనేక ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తాయి. అరోమా థెరపీలో దీని పాత్ర ప్రత్యేకమైంది. మామూలుగా దాల్చిన చెక్క ప్రాముఖ్యత గురించి అందరికీ తెలుసు. కానీ దీనికి సంబంధించిన ఒక విషయం మాత్రం చాలామందికి తెలియదు. అదేంటంటే, ఇది కేవలం ఆరోగ్యం, సౌందర్య పోషణకే కాదు... గార్డెన్ ని సంరక్షించడంలో కూడా తోడ్పడుతుంది. అదెలాగంటారా? అయితే తెలుసుకోవాల్సిందే.

చీమలను నిరోధిస్తుంది:

 గార్డెన్లో చీమలు ఆకులను తినేస్తాయి. దాంతో మొక్కల అందం పోతుంది. ఇదొక్కటేనా... మొక్కల ఎదుగుదలకు కూడా ఇబ్బందులు తీసుకొస్తాయి. ఒక చిన్న చీమ వల్ల మొక్కలకు పెద్ద ఇబ్బంది రాదు. కానీ చీమ చిన్నదే అయినా.. గుంపులుగా రావడం వల్ల నష్టం ఎక్కువ మొత్తంలో జరుగుతుంది. అలాంటప్పుడు ఒక చీమ ఇంకొక చీమతో కమ్యూనికేట్ అవ్వకుండా చేస్తే చీమలను నిరోధించొచ్చు. దాల్చిన చెక్క సువాసన చీమలకు అంతగా పడదు. దానివల్ల అవి ఉక్కిరిబిక్కిరి అవుతాయి. దాల్చినచెక్క ఘాటుకు గందరగోళానికి గురై మొక్కలకు దూరంగా వెళ్లిపోతాయి.

ఫంగస్ పై పోరాటం:

మొక్కల ఆరోగ్యకరమైన ఎదుగుదలను ఫంగస్ అడ్డుకుంటుంది. అలాంటి పరిస్థితుల్లో దాల్చిన చెక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. దాల్చినచెక్క పొడిని ఫంగై ఉన్న చోట వేస్తే, అది త్వరగా నాశనమవుతుంది. దానివల్ల మొక్కలకు తగినంత పోషణ లభిస్తుంది.

విత్తనాల సంరక్షణ:

విత్తనాలు మొలకెత్తడం అనేది అత్యంత సున్నితమైన అంశం. వాతావరణ మార్పులు, ఫంగస్ తో పాటు మొక్కలకు సోకే మరికొన్ని వ్యాధుల నుంచి కూడా విత్తనాలను సంరక్షించాలి. విపరీతమైన తేమ ఉన్నప్పుడు. మొలకెత్తే దశలో విత్తనాలు పాడవుతాయి. అప్పుడు దాల్చినచెక్క పొడిని మొక్కలకు వేయాలి. అందులో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు విత్తనాలను కాపాడతాయి.

త్వరగా కోలుకునేలా చేస్తుంది:

మిగతా జీవుల్లాగానే మొక్కలు కూడా అనారోగ్యానికి గురవుతాయి. అలాంటప్పుడు సరైన పోషణ అందిస్తే, ఆ మొక్కలు త్వరగా కోలుకుంటాయి. దానికోసం దాల్చినచెక్క బాగా సహాయపడుతుంది. ప్రతిరోజూ చెంచాడు దాల్చినచెక్క పొడి మొక్కలపై చల్లుతూ, తగినన్ని నీళ్లు పోస్తే ఆరోగ్యంగా లేని మొక్కలు త్వరగా కోలుకుంటాయి.

దోమల బాధను తగ్గిస్తుంది:

దోమలతో పాటు మరికొన్ని కీటకాలకు కూడా దాల్చిన చెక్క వాసన పడదు. అలా మొక్కల ద్వారా వ్యాప్తి చెందే కీటకాలను అరికట్టేందుకు ఇది తోడ్పడుతుంది. గార్డెన్ లో దాల్చిన పొడిని చల్లుతూ ఉంటే దోమల బాధ పోతుంది. దీని వల్ల డెంగ్యూ, మలేరియా వంటి సమస్యల బారిన పడే ప్రమాదమూ తగ్గుతుంది. మంచిది.