ముంపు భయంతో .. సగం ఊరు ఖాళీ

  • చెట్టుకొకరు, పుట్టకొకరుగా చిన్నోనిపల్లి నిర్వాసితులు
  • ఏండ్లుగా అందని పరిహారం
  • ఆర్అండ్ఆర్  సెంటర్ లో సౌలతులు కరువు
  • ముంపు బాధితుల గోస పట్టని అధికారులు

గద్వాల, వెలుగు: చిన్నోనిపల్లి నిర్వాసితుల రోదన ఎవరికీ పట్టడం లేదు. జోరుగా కురుస్తున్న వానలకు రిజర్వాయర్ లోకి నీరు వస్తుండడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని మూటాముల్లె సర్దుకుని అన్నమో రామచంద్రా అంటూ చెట్టుకొకరు.. పుట్టకొకరుగా కన్నీరు పెట్టుకుంటూ తరలివెళ్తున్నారు. 15 రోజుల నుంచి భయంతో గడుపుతున్న నిర్వాసితులకు ఆఫీసర్లు భరోసా ఇవ్వకపోవడంతో గత్యంతరం లేక ఊరిని ఖాళీ చేస్తున్నారు. గ్రామంలో ఉంటే ముంపు భయం, మరోవైపు ఆర్అండ్ఆర్  సెంటర్ లో సౌలతులు లేకపోవడంతో బంధువుల ఇండ్లల్లో  తలదాచుకుంటున్నారు. ముంపు భయంతో ఇప్పటికే సగం ఊరు ఖాళీ కాగా, మిగిలిన సగం మంది బిక్కుబిక్కుమంటూ అక్కడే కాలం వెల్లదీస్తున్నారు.

పెండింగ్  పనులతోనే తిప్పలు..

 నెట్టెంపాడు లిఫ్ట్​లో భాగంగా గట్టు మండలం చిన్నోనిపల్లి రిజర్వాయర్  చేపట్టారు. గత ప్రభుత్వం ఆర్అండ్ఆర్  సెంటర్  ఏర్పాటు చేయకపోవడంతో పాటు రిజర్వాయర్​ పనులు కంప్లీట్  చేయకపోవడంతో ఎప్పటిలాగే ఊళ్లో ఉంటున్నారు. ఇప్పుడు కురుస్తున్న వానలకు రిజర్వాయర్ లోకి నీరు వచ్చి చేరుతుండడంతో నిర్వాసితులు భయంభయంగా కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. ఊరి నుంచి పోదామంటే ఆర్అండ్ఆర్ సెంటర్ లో సౌలతులు లేవు. ఊళ్లో ఉందామంటే ముంపు భయం. కొన్నేండ్ల కింద ఇచ్చిన పరిహారం అంతా ఖర్చు అయిపోయాయని, ఇండ్లు కట్టుకునేందుకు చిల్లిగవ్వ కూడా లేదని వాపోతున్నారు.

12 ఏండ్లుగా పోరాటం..

చిన్నోనిపల్లి రిజర్వాయర్ కు ఆయకట్టు లేకపోవడం, పూర్తి స్థాయిలో నిర్మాణం చేయకపోవడం, అప్పట్లో ఎకరాకు కేవలం రూ.75 వేలు ఇవ్వడంతో రిజర్వాయర్ ను రద్దు చేయాలని నిర్వాసితులు పోరాటం చేస్తూనే ఉన్నారు. రిజర్వాయర్ ను రద్దు చేసి తమ భూములు తమకు ఇవ్వాలని రైతులు, నిర్వాసితులు 12 ఏండ్లుగా డిమాండ్  చేస్తున్నారు. రిజర్వాయర్‌‌  కోసం ప్రభుత్వం 2005లో సర్వే చేసి, 2006లో గట్టు మండలంలోని చిన్నోని పల్లి, చాగదోన, బోయలగూడెం, ఇందువాసి, లింగాపురం గ్రామాల్లోని రైతుల నుంచి 2,650 ఎకరాలు భూసేకరణ చేసింది. ఇందుకుగాను అప్పట్లో ఎకరాకు రూ.75 వేల పరిహారం ఇచ్చారు. అనంతరం కట్ట పనులు ప్రారంభించినా మధ్యలోనే  వదిలేశారు. దీంతో రైతులు తమ భూములను ఎప్పటిలాగే మళ్లీ సాగు చేసుకుంటున్నారు.

ఆర్‌‌అండ్‌ఆర్‌‌  సెంటర్‌‌నూ పట్టించుకోలే..‌

రిజర్వాయర్‌‌లో చిన్నోనిపల్లి గ్రామంలోని 250 ఇండ్లు ముంపునకు గురవుతుండగా..  ఆఫీసర్లు తొలి విడత పరిహారం అందించారు. నిర్వాసితుల కోసం అంతంపల్లి దగ్గర ఆర్‌‌అండ్‌ఆర్‌‌  సెంటర్‌‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్లాట్లు కేటాయించి, వాటర్  ట్యాంక్,  డ్రైనేజీ కట్టి వదిలేశారు. ప్రస్తుతం వాటర్  ట్యాంక్​ శిథిలావస్థకు చేరుకుంది. స్కూల్  బిల్డింగ్​ పనులు పిల్లర్ల దశ కూడా దాటలేదు. బోర్లన్నీ ఖరాబ్ అయ్యాయి.

చెట్టుకొకరు.. పుట్టకొకరుగా..

నిర్వాసితులకు పరిహారం, ప్లాట్లు ఒకేసారి ఇవ్వాల్సి ఉన్నా, గత ప్రభుత్వం, ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో నిర్వాసితులు చెట్టుకొకరు పుట్టకొకరుగా వెళ్తున్నారు. ఇప్పటికే చాలా మంది అయిజ, మిట్టదొడ్డి, మిట్టదొడ్డి స్టేజి, బలిగేరా, కొత్తపల్లి తదితర ప్రాంతాలకు వెళ్లగా, మరికొందరు తమ బంధువుల ఇండ్లలో తలదాచుకుంటున్నారు. ఆర్అండ్ఆర్  సెంటర్ లో 10 ఫ్యామిలీలు గుడిసెలు వేసుకొని ఉంటున్నాయి.

గుడిసెలు వేసుకోవడానికి ఒక్కో ప్లాట్ ను లెవెల్  చేసుకోవడానికి 100 ట్రాక్టర్ల మట్టి వేయాల్సి వస్తోందని నిర్వాసితులు వాపోతున్నారు. ఆఫీసర్లు ఇవేవీ పట్టించుకోకుండా పైసలు ఇచ్చాం.. వెళ్లిపోవాలని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏండ్లుగా చిన్నోనిపల్లి నిర్వాసితుల సమస్యను పరిష్కరించకుండా ఆఫీసర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెబుతున్నారని వాపోతున్నారు.  

16 ఇండ్లకు పరిహారం ఇయ్యలే..

రిజర్వాయర్  నిర్మాణం జరిగేటప్పుడు 250 ఇండ్లు చిన్నోనిపల్లిలో ఉన్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. ఇందులో 16 ఇండ్లకు పరిహారం, 60 ఇండ్లకు షిఫ్టింగ్  చార్జీలు ఇవ్వలేదు. ఆర్అండ్ఆర్  సెంటర్ లో 360 ప్లాట్లు ఇవ్వాల్సి ఉండగా, 250 ఫ్యామిలీలకు మాత్రమే ప్లాట్లు ఇచ్చారు. ఈ సమస్యలు పట్టించుకోకుండా రిజర్వాయర్  పనులు కంప్లీట్  చేస్తామని చెప్పి తమను ఇబ్బంది పెడుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ఆయకట్టు లేని రిజర్వాయర్ ను రద్దు చేసి న్యాయం చేయాలని కోరుతున్నారు.

సమస్యను పరిష్కరిస్తాం..

నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తాం. ప్రస్తుతం వానలు పడుతుండడంతో, నీటిని బయటికి పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నిర్వాసితులతో మాట్లాడి ఇబ్బందులు లేకుండా చూస్తాం.

రాంచందర్, ఆర్డీవో, గద్వాల