100 రోజుల్లో 4,400KM సైకిల్ యాత్ర.. భార్య ప్రేమ కోసం చైనీయుడి సాహసం

విడిపోయిన భార్యతో రాజీ కోసం ఓ చైనీయుడు ఎవరూ చేయని సాహసం చేశాడు. 100 రోజుల్లో 4,400 కిలో మీటర్లు సైకిల్‌పై ప్రయాణించి ఆమె ప్రేమను తిరిగి పొందాడు. ఈ ప్రయాణంలో అతను రెండుసార్లు మృత్యువును జయించాడు. ఒకానొక సమయంలో విడిపోయిన భార్య తన ప్రయాణాన్ని విరమించుకోవాలని సూచించినా.. అతను మాత్రం వెనకడగు వేయలేదు. ఇచ్చిన మాట ప్రకారం, గమ్య స్థానాన్ని చేరుకొని భార్య మనసు గెలుచుకున్నాడు. 

వివాహ జీవితంలో ట్విస్టులు

తూర్పు చైనా, జియాంగ్సు ప్రావిన్స్‌లోని లియాన్యుంగాంగ్‌కు చెందిన 40 ఏళ్ల జౌ కథ ఇది. ఇతనికి 2007లో లీ అనే మహిళతో వివాహం జరిగింది. వీరి దాంపత్య జీవితం రెండేళ్లు సజావుగా సాగగా.. అనంతరం కలతలు మొదలయ్యాయి. ఇక కలిసి ఉండలేక ఈ జంట 2013 లో విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం వేర్వేరుగా ఉండలేక ఈ జంట రాజీపడి మళ్లీ వివాహం చేసుకున్నారు. ఆ తరువాత ఒక కొడుకు, కూతురు పుట్టారు. వీరు జన్మించిన రెండేళ్ల తరువాత భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవలు మొదలయ్యాయి. దాంతో, లీ భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. 

Also Read : బీర్ తాగడం ఎప్పుడు మానేయాలి..?

భర్త వెళ్లి ఎంత బ్రతిమలాడినా, బుజ్జగించినా లీ కరుణించలేదు. అలా అని భర్త వెనకడుగు వేయలేదు. అప్పుడు లీ.. తన భర్త జౌకు ఓ కండిషన్ పెట్టింది. లాసాకు సైకిల్‌కు ప్రయాణించాలని సూచించింది. ఇది వారుంటున్న నాన్జింగ్ నగరం నుండి 4,400 కిల్లీ మీటర్ల దూరం. ఆ పందెంలో గెలిస్తేనే తన వెంట వస్తానని లీ తేల్చి చెప్పింది. జౌ భార్య పెట్టిన కండిషన్‌కు తలూపిన జౌ.. జూలై 28న ఆగ్నేయ నగరం నాన్జింగ్ నుండి సైకిల్‌పై తన ప్రయాణాన్ని ప్రారంభించి 100 రోజుల్లో అక్టోబర్ 28న లాసా చేరుకున్నాడు. 

రెండుసార్లు మృత్యువును జయించి..

ఈ పర్యటనలో జౌ ​రెండుసార్లు మృత్యువు నుంచి బయట పడినట్లు వెల్లడించాడు. మొదటిసారి తూర్పు చైనాలోని అన్‌హుయ్ ప్రావిన్స్‌లో హీట్‌స్ట్రోక్‌కు గురై ఆసుపత్రి పాలయ్యానని తెలిపాడు. రెండోసారి 40-డిగ్రీల వేడిలో సైకిల్ తొక్కుతున్నప్పుడు రోడ్డుపై కుప్పకూలిపోయానని అన్నాడు. ఆ సమయంలో తనకు నీళ్లివ్వడానికి కూడా చుట్టూ ఎవరు లేరని ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకున్నాడు. కొద్దిసేపటి తరువాత అటునుంచి వెళ్తున్న వారు  తనను రక్షించారని చెప్పుకొచ్చాడు.

మొత్తానికి తన ప్రయాణాన్ని పూర్తి చేయడంతో జౌ.. భార్య లీ దగ్గరయ్యాడు. ఈ పందెం కాస్త బయటకు రావడంతో చైనా మీడియా చానెళ్లు ఈ జంటను పోటీ పడి మరీ ఇంటర్వ్యూ చేస్తున్నాయి.