బీజింగ్: టిబెట్‌లోని బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ డ్యామ్‌ను నిర్మించాలనే తన ప్రణాళికను చైనా సమర్థించుకుంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంతో దిగువనున్న దేశాలపై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొంది. నది నీరు ప్రవహించే పరిసర రాష్ట్రాల్లో భద్రత సమస్యలు దృష్టిలో ఉంచుకునే నిర్మాణం చేపడతానని స్పష్టం చేసింది. ఇందుకు దశాబ్దాలుగా అధ్యయనం చేసినట్టు పేర్కొంది. బ్రహ్మపుత్ర నదిపై టిబెట్‌లోని భారత సరిహద్దుకు సమీపంలో నెలకొల్పనున్న ఈ భారీ డ్యామ్ నిర్మాణానికి ఈ నెల 25న చైనా ఆమోదం తెలిపింది.
దీనిపై భారతదేశం, బంగ్లాదేశ్ ఆందోళనలను లేవనెత్తాయి. ఈ డ్యామ్ నిర్మాణం పూర్తయితే నది ప్రవాహంపై చైనాకు నియంత్రణ వస్తుందని, యుద్ధ సమయాల్లో పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేయడానికి అవకాశం ఉంటుందని భారత్ పేర్కొంది. అలాగే, బంగ్లాదేశ్‌లో సరిహద్దు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతాయని ఆ దేశం ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో ఈ అంశంపై శుక్రవారం చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ స్పందించారు. ఈ డ్యామ్ విషయంలో ఎలాంటి భయాందోళనలు పెట్టుకోవద్దని ఆమె సూచించారు.