తైవాన్ చుట్టూ చైనా సైనిక విన్యాసాలు..

  • మా దేశంలో అంతర్భాగమని ఒప్పుకోవాలని డిమాండ్
  • దేశానికి ప్రాతినిధ్యం వహించే హక్కు చైనాకు లేదన్న తైవాన్​

తైపీ: తైవాన్ తో పాటు దాని చుట్టుపక్కల ఉన్న ద్వీపాల చుట్టూ చైనా పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నది. ఇందుకోసం చైనా తన లియానింగ్ ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్ క్యారియర్‌‌‌‌, మరి కొన్ని నౌకలు, జే15 యుద్ధ విమానాలను తైవాన్ చూట్టూ మోహరించింది. చైనా చర్యతో తైవాన్ జలసంధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ దేశంలో అంతర్భాగమని ఒప్పు కోవాల్సిందిగా చైనా చేస్తున్న డిమాండ్ ను తైవాన్​ అధ్యక్షుడు నిరాకరించారు. అందుకు ప్రతిస్పందనగానే ఈ సైనిక విన్యాసాలు చేపట్టినట్టు చైనా రక్షణ శాఖ తెలిపింది. 

తైవాన్​ జాతీయ దినోత్సవం ముగిసిన నాలుగు రోజులు తర్వాత సోమవారం నుంచి చైనా వీటిని చేపట్టింది. తైవాన్‌‌‌‌ను చుట్టూ ఆరు పెద్ద బ్లాక్‌‌‌‌లను ఉంచినట్టు ఉన్న ఒక మ్యాప్​ను కూడా చైనా ప్రభుత్వ మీడియా ప్రసారం చేసింది. అందులో తైవాన్, దాని చుట్టు ఉన్న ద్వీపాల చుట్టూ సర్కిల్స్ గీసి ఉన్నాయి. నేవీ, ఎయిర్​ఫోర్స్, మిసైల్​కార్ప్​తో కలిసి ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నామని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఈస్టర్న్ థియేటర్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ లీ జి తెలిపారు. ‘‘తైవాన్ స్వాతంత్ర్యానికి మద్దతు ఇచ్చేవారికి ఇది ఒక ప్రధాన హెచ్చరిక. మా జాతీయ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలనే సంకల్పానికి సూచన” అని అన్నారు. అయితే ఈ సైనిక విన్యాసాలు ఎన్ని రోజులు కొనసాగుతాయనే విషయం మాత్రం వెల్లడించలేదు.

చైనాపై తైవాన్ ఆగ్రహం

తమ దేశానికి ప్రాతినిధ్యం వహించే హక్కు చైనాకు లేదని తైవాన్ ప్రెసిడెంట్​లై చింగ్​తే ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని అణగదొక్కే సైనిక కవ్వింపులను నిలిపివేయాలని. మాదేశం స్వేచ్ఛ, ప్రజాస్వామ్యంపై బెదిరింపులు ఆపాలి’’ చైనాకు సూచించారు. అలాగే తైవాన్​సెక్యూరిటీ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి జోసెఫ్ వూ తైపీలోని ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చైనా నుంచి వచ్చే ఎలాంటి ముప్పునైనా తమ సైన్యం కచ్చితంగా ఎదుర్కొంటుందని చెప్పారు. ఇతర దేశాలపై బలప్రయోగం, బెదిరింపులు అనేవి శాంతియుత మార్గంలో వివాదాలను పరిష్కరించుకోవాలనే యునైటెడ్ నేషన్స్(యూఎన్)​​ ప్రాథమిక స్ఫూర్తికి విరుద్ధమని చైనా దాన్ని ఉల్లంఘిస్తున్నదని ఆరోపించారు.