కోల్డ్​ స్టోరేజీల్లో మిర్చి, శనగ.. గిట్టుబాటు ధర లేక నిల్వ చేస్తున్న రైతులు

  • గోదామ్​లు సరిపోక ఏపీలోనూ స్టాక్​ చేసుకుంటున్న జిల్లా రైతాంగం
  • ఏడాదికే మూతపడిన గద్వాల మిర్చి కొనుగోలు కేంద్రం

గద్వాల, వెలుగు: పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో జిల్లాలోని మిర్చి, శనగ రైతులు తమ సరుకును కోల్డ్​ స్టోరేజీల్లో నిల్వ చేసుకుంటున్నారు. తాము పండించిన పంటలను ఏసీ గోదామ్​లో నిలువ ఉంచుకొని రేటు పెరిగాక అమ్ముకునేందుకు ప్లాన్  చేస్తున్నారు. గద్వాల జిల్లాలో 7 ఏసీ గోదామ్​లు ఉండగా, ఒకటి పని చేయడం లేదు. మిగిలిన 6 గోదాముల్లో 6 నుంచి 7 లక్షల బస్తాలు నిల్వ ఉన్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు.

వీటిలో 3లక్షల క్వింటాళ్ల చొప్పున మిర్చి, శనగల నిల్వలు ఉన్నాయి. గద్వాల జిల్లాలో గోదామ్​లు సరిపోక ఏపీలోని నందికొట్కూర్, ఆత్మకూరు జిల్లాల్లోని కోల్డ్​ స్టోరేజీల్లో మిర్చి, శనగలు ఉంచుకున్నారు. సరైన మార్కెట్​ లేక ఈ పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. మిర్చి కొనుగోలు చేసేందుకు గద్వాల వ్యవసాయ మార్కెట్ లో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి సోమవారం కొనుగోలు చేసేలా ప్లాన్  చేశారు. అయితే ఈ సెంటర్​ ఏడాది తిరగకముందే మూతపడడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.

ధర, నిల్వ చేసుకునే సౌకర్యం లేక తిప్పలు..

కృష్ణ, తుంగభద్ర నదుల మధ్య ఉన్న నడిగడ్డలోని ఎర్ర నేలలు, నల్ల రేగడి నేలలు అన్నిరకాల పంటల సాగుకు అనువుగా ఉన్నాయి. ఇక్కడి రైతులు ఎక్కువగా మిర్చి, శనగ, పప్పు దినుసులు సాగు చేస్తుంటారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా శనగ అంతంత మాత్రమే సాగైంది. అయితే గత ఏడాది మిర్చికి బాగా ధర ఉండడంతో ఈ ఏడాది పెద్ద ఎత్తున మిర్చి సాగు చేశారు. వర్షాలు అంతంత మాత్రమే కురవడం, చీడపీడలు సోకడంతో రైతులు తిప్పలు పడి పంటలను కాపాడుకున్నారు.

చేతికొచ్చిన పంటను అమ్ముకుందామంటే గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడ్డారు. మిర్చి, శనగను ఏసీ గోదాముల్లో నిల్వ చేస్తారు. నడిగడ్డలో ప్రభుత్వ కోల్డ్​ స్టోరేజీలు లేకపోవడంతో ప్రైవేట్  గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. దీంతో కోల్డ్​ స్టోరేజీలకు డిమాండ్ పెరిగింది. జిల్లాలో మిర్చి అమ్మేందుకు సరైన మార్కెట్  లేక ఇక్కడి రైతులు ఏపీలోని గుంటూరు, కర్నాటకలోని బెంగళూరు, మాన్వి, బ్యాడిగి ప్రాంతాల్లో అమ్ముకునేందుకు వెళ్తూ ప్రమాదాల బారిన పడిన 
ఘటనలున్నాయి. 

జిల్లాలో మిర్చి సాగు ఇలా..

గద్వాల జిల్లాలో ఈ ఏడాది 65,113 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ఇటిక్యాల మండలంలో 15,945 ఎకరాలు, మానవపాడు లో 10,815, ఉండవల్లిలో 5,679 గట్టులో 5,506, అయిజలో 7,700, గద్వాలలో 7,586, మల్దకల్ లో 4,600, అలంపూర్ లో 2,502, రాజోలిలో 2,084, వడ్డేపల్లిలో 1,609, ధరూర్ లో 649, కేటీదొడ్డిలో 389 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా దిగుబడి తగ్గింది. ఎకరాకు 20 నుంచి 25 కింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, 10 నుంచి 12 క్వింటాళ్లకే దిగుబడి పరిమితమైంది. ధర కూడా రూ.8 వేల నుంచి రూ.10 వేలే ఉండడంతో పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది.

ఇంట్లోనే ఉంచుకున్న..


నాకున్న 5 ఎకరాల పొలంలో మిర్చి వేశాను. తెగుళ్లు, వర్షం లేని కారణంగా దిగుబడి తగ్గింది. పంటను అమ్ముకుందామంటే ధర కూడా లేదు. కోల్డ్​ స్టోరేజీల్లో ఖాళీ లేకుంటే ఇంట్లోనే నిల్వ చేసుకున్న. ప్రభుత్వం మద్దతు ధర కల్పించి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి.
- దేవర గోపాల్, సంకాపురం

గోదామ్​లు ఫుల్​ అయ్యాయి..


జిల్లాలోని కోల్డ్​ స్టోరేజీలు మిర్చి, శనగ బస్తాలతో నిండిపోయిన మాట వాస్తవమే. మరిన్ని గోదామ్​ల ఏర్పాటుకు కృషి చేస్తాం. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నాం.
- పుష్ప, మార్కెటింగ్ ఆఫీసర్, గద్వాల