Good Health : పిల్లల్లో రోజురోజుకు తగ్గుతున్న ప్రొటీన్లు.. ఇవి తింటే బలంగా తయారవుతారు..!

తిండి కలిగితే కండ కలదోయ్.. కండ కలవాడేసు మనిషోయ్... అన్నారు  గురజాడ అప్పారావు. .మరి తిన తినే తిండిలో మాంసకృత్తులు (ప్రొటీన్లు) లేకపోతే కండరాలకు నష్టమంటున్నారు డాక్టర్లు. ఈ మాంసకృత్తులు శరీర నిర్మాణానికి ఎంతో అవసరం. మరి అలాంటివి తినే ఆహారంలో లేకపోతే కండరాలు బలహీనపడతాయి. అంతేకాదు వాటి పెరుగుదల కూడా ఆగిపోతుంది. అయితే ఈ పరిస్థితి మన భారతీయుల్లో చాలా ఎక్కువగా కనిపిస్తోందని ఓ సర్వేలో తేలింది.  పిల్లల బలంగా.. కండరాల సమస్య లేకుండా లేకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం పెట్టాలో తెలుసుకుందాం. . .

దక్షిణ  కొరియాకు చెందిన ఇప్పోస్​ – ఇన్​ బాడీ అనే సంస్థ   హైదరాబాద్ ఢిల్లీ ముంబై, కోల్ కతా, చెన్నై, అహ్మదాబాద్.. లక్నో, పాట్నా మొత్తం ఎనిమిది నగరాల్లోని 30 నుంచి -35 ఏళ్ల వయసున్న వాళ్లపై అధ్యయనం చేసింది. దాని ప్రకారం... 68  శాతం మంది.. భారతీయులు మాంసకృత్తుల లోపాన్ని ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ లో ఇలాంటి వాళ్ల సంఖ్య 75 శాతం కన్నా ఎక్కువ ఉందట.

అయితే ఇండియన్ మార్కెట్ రీసెర్చ్ బ్యూరో (ఐఎంఆర్ బీ) అనే సంస్థ ఇంతకు ముందు విడుదల చేసిన నివేదిక ప్రకారం.. దేశంలో 73 శాతం మందిలో మాంసకృత్తులు లోపించాయి. అలాగే 84 శాతం మంది భారతీయ శాఖాహారులు.. 65 శాతం మంది మాంసాహారులు  శరీరానికి సరిపడా ప్రొటీసు తీసుకోవడం లేదని నివేదికలో తెలిపింది.   అంతేకాదు 93 శాతం మందికి రోజుకు ఎంత మేరకు ప్రొటీన్లు తీసుకోవాలో కూడా తెలియదని ఆ నివేదిక వెల్లడించింది. ఇప్సోస్​–  -ఇన్ బాడీ అధ్యయనం ప్రకారం దేశంలో 71శాతం మందికి కండరాల ఆరోగ్యం సరిగా లేదు. భారతీయుల కండరాలు బలంగా లేకపోవడానికి ప్రోటీర్ల లోపమే కారణమంటున్నారు నిపుణులు.

కండరాలకు ప్రొటీన్లే ముఖ్యం

ప్రతి ఒక్కరు తమ శరీరానికి కావల్సినంత ప్రొటీన్ ను  రోజువారీ ఆహారంలో తీసుకోవాలి. అయితే మన భారతీయుల్లో 30 నుంచి 40 శాతం మంది సరిపడా ప్రొటీన్లను తీసుకోవట్లేదు.   ఇప్పుడు చాలామంది ప్యాట్ తో బరుపు పెరుగుతున్నారు తప్ప... ఆరోగ్యవంతమైన కండరాలతో కాదు. ముఖ్యంగా పిల్లలకు కూడా సరైన పద్ధతిలో ప్రొటీన్లు అందించడం లేదు.  ఒకప్పుడు ఆరు నెలలు దాటగానే పప్పులతో తయారు చేసిన ఉగ్గుపెట్టే వాళ్లు.  ఇప్పుడు అలా కాకుండా షాపుల్లో దొరికే రెడీమేడ్ ఫుడ్స్ పెడుతున్నారు. పల్లీలు, బెల్లం కలిపి చేసే పల్లిపట్టీ లాంటివి కాకుండా చాకొలెట్స్.. చిప్స్.. ఇస్తున్నారు. దాంతో పిల్లలకు ప్రోటీన్లు సరిగా అందక కండరాల సమస్యతో బాధపడుతున్నారు. 

Also Read : చియా గింజలతో ఎన్ని లాభాలో.. ప్రతి ఒక్కరి డైట్లోఉండాల్సిందే..!

చాలామందికి ఎదుగుదల మందగిస్తోంది. అలాగే టీనేజర్లు కూడా బయట దొరికే ఆహారానికే అలవాటు పడి..  ఇంట్లో పాలు తాగడం, గుడ్లు తినడం మానేస్తున్నారు. దాని వల్ల సహజంగా లభించే ప్రొటీన్లకు దూరమవుతున్నారు. పసి పిల్లలో ఆరు నెలల తర్వాత నుంచి ఇంట్లో తయారు చేసిన ఉగ్గునే పెట్టాలి. అందులో అన్నిరకాల  పప్పు ధాన్యాలు ఉంటాయి.   కాబట్టి ప్రొటీన్లు పుష్కలంగా అందుతాయి. అలాగే పాలు తప్పని సరిగా పట్టాలి. ఏడో నెల నుంచి గుడ్డు పచ్చసొన మొదలు పెట్టాలి. అలా చేస్తే ఏడాది వయసు వచ్చేసరికి మొత్తం గుడ్డును తినగలుగుతారు.

స్కూల్ కి వెళ్లే పిల్లలకు కూడా రోజూ తప్పనిసరిగా రెండుసార్లు పాలు తాగించాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో కచ్చితంగా ఒక గుడ్డు, అన్నిపూటలా ఆహారంలో ఉడికించిన శెనగలు, బొబ్బర్లు, అలసందలు వంటివి పెట్టాలి. ఏ వయసు వాళ్లైనా పాలు, గుడ్లు తీసుకోవాలి. మాంసాహార్లు అయితే చేపలు, చికెన్. గుడ్లు వంటివి తినాలి. అలా అని బయట దొరికే బిర్యానీలు, వెరైటీ స్నాక్స్ కాకుండా, ఎక్కువ మసాలాలు లేకుండా ఉడికించినవి తింటే మంచిది.

ఇవి తినాలి..

  • పాల సంబంధిత ఉత్పత్తులు పాలు, పెరుగు. చెన్న, పనీర్ మొదలైనవి
  • గుడ్లు
  •  చేపలు, రొయ్యలు, కోడి మాంసం 
  •  పల్లీలు, పుట్నాలు, సోయాబీన్స్ శనగలు, కందులు, పెసళ్లు, బొబ్బర్లు, రాజ్మా మొదలైనవి
  • తాజా కూరగాయలు.. ఆకుకూరలు

-వెలుగు, లైఫ్​–