చిన్నపిల్లలు ఏం మాట్లాడాలన్నా.. ఎలా మాట్లాడాలన్నా... అది తల్లిదండ్రులను చూసే నేర్చుకుంటారు. అయితే మంచి మాటలు.. మంచి నడవడి... ఇలా ఏదైనా వాళ్ల వల్లే సాధ్యమవుతుంది. పిల్లలకు మొదట వచ్చే అలవాటు... పెద్దవాళ్లను అనుసరించడం. ఏది మంచి, ఏది చెడు అని వాళ్లకు తెలీదు. ఏది విన్నా, ఏది చూసినా... ఇట్టే పట్టేసి అనుసరిస్తారు. వాళ్లను మంచి మార్గంలో పెట్టాలంటే ఇలాంటి కొన్ని చిట్కాలు పాటించాలి. ఇప్పుడు ఆ చిట్కాల గురించి తెలుసుకుందాం. . .
పిల్లలు ఏం చెప్పినా వినాలి తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నా... పిల్లల విషయంలో ఇద్దరూ శ్రద్ధ చూపాలి. పగలంతా ఆఫీసు పనుల్లో బిజీగా ఉన్నా రాత్రుళ్లు మాత్రం పిల్లలతో సరదాగా గడపాలి. ఫోన్లు, టీవీలు అన్నీ ఆఫ్ చేసి, పక్కన కూర్చోపెట్టుకుని మరీ మాట్లాడాలి. ఆ సమయంలో పిల్లలు తమకు వచ్చిన ఐడియాలు, స్కూళ్లో జరిగిన సంఘటనలు... ఇలా ఏం చెప్పినా వినాలి. వాళ్లు చెప్పే కథలు, పాడే పాటలను ఎంజాయ్ చేయాలి.
ఆసక్తి చూపాలి : సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే... ఆ రోజు స్కూల్లో ఎలా గడిచిందని అడగాలి. ఎంతసేపు హోమ్ వర్క్, ఎగ్జామ్స్ గురించే కాకుండా... మిగతా విషయాల గురించి కూడా ముచ్చటించాలి. వాళ్లు చెప్పేటప్పుడు, మాటల్లో ఏదైనా తప్పు దొర్లితే.. సున్నితంగా వాటిని సరిచేయాలి. ఏం చెప్పినా ఆసక్తిగా వినాలి. ప్రతి దాంట్లోనూ ఎంకరేజ్ చేయాలి.
'ఎస్ ఆర్ నో' ప్రశ్నలు వద్దు: పిల్లలతో ఎంత కుదిరితే అంత ఎక్కువగా మాట్లాడాలి. అంతేకానీ, అవును లేదా కాదు లాంటి జవాబులొచ్చే ప్రశ్నలు వేయొద్దు. వాళ్లకు తెలిసింది చెప్పనివ్వాలి. ప్రతి విషయాన్ని విశ్లేషించేలా ప్రోత్సహించాలి. కమ్యూనికేషన్ పెంచుకోవాలి పిల్లలతో కమ్యూనికేషన్ ఎంత ఎక్కువగా ఉంటే, బంధం అంత దృఢంగా ఉంటుంది. అంతేకాదు, వాళ్లు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఎదుగుతారు. మాట్లాడటం మాత్రమే కాదు... వినడం,ప్రేమను పంచడం, అవతలి వాళ్లపై శ్రద్ధ చూపడం వంటివి కూడా కమ్యూనికేషన్ లో భాగమే