పిల్లలు ఎందుకు భయపడతారో తెలుసా....

కొందరు పిల్లలకి... రాత్రిపూట వాష్​ రూమ్​ కు  వెళ్లాలంటే భయం... మరికొంత మందికి బల్లినో, పిల్లినో చూస్తే భయం. ఒంటరిగా వీధి చివర దుకాణం వరకూ వెళ్లమంటే అమ్మో! అంటారు. ఇలా పిల్లలకు అడుగడుగునా భయం వెంటాడుతూ ఉంటుంది. అయితే ఈ భయం పుట్టుకతో వస్తుందనుకుంటే పొరపాటే. పిల్లల్లోని భయానికి బాహ్య కారణాలు చాలానే ప్రభావితం చేస్తాయని ఓ పరిశోధన వెల్లడి చేసింది.

బాల్యంలో పిల్లలకు లెక్కలేనన్ని భయాలు చుట్టుముడుతుంటాయి. పెద్దయ్యే కొద్దీ ఈ భయాలు చెదిరిపోతుంటాయి. కొందరిలో మాత్రం అవి జీవితాంతం ఉండిపోతాయి.. వీటికి కారణాల గురించి ఇంగ్లండ్ లోఓ పరిశోధన చేశారు. అందులో తేలిందేంటంటే.. పిల్లల్లో మెదిలే భయాలను వారి స్నేహితులు కూడా ప్రభావితం చేస్తారంట. ఇంగ్లండుకి చెందిన కొందరు నిపుణులు ఓ ప్రయోగాన్ని నిర్వహించారు. దీనికోసం వారు 242 మంది పిల్లలను ఎంచుకున్నారు. వీరంతా ఏడు నుంచి పదేళ్ల లోపువారే. వీరందరినీ రెండు గ్రూపులుగా విడగొట్టి వాళ్లకు గతంలో ఎప్పుడూ చూడని ఓ రెండు జంతువుల చిత్రాలను చూపించారు. ఒక గ్రూపు పిల్లలకి ఈ కొత్త జంతువుల గురించి మంచిగా చెప్పారు. రెండో గ్రూపు పిల్లలకి వీటి గురించి భయం కలిగించే వివరాలను చెప్పారు.

స్నేహితుల వల్లనే..

ప్రయోగంలో రెండో దశలో రెండు గ్రూపుల పిల్లల్నీ ఇద్దరిద్దరుగా జతచేశారు. కాసేపటి తరువాత వాళ్లని మళ్లీ పరీక్షించారు. కొత్త జంతువు గురించి భయపడుతున్న పిల్లలు, తమ భయాన్ని తోటివారిలో కూడా చొప్పించారు. ఆ జంతువు పట్ల భయాన్నీ, ఆ భయాన్ని ఎదుర్కొనేందుకు ఎలా ప్రవర్తించాలి అన్న విషయాన్నీ కూడా వీళ్లు ఇతరులకు చెప్పారు. పైకి సాధారణంగా కనిపించే ఈ పరిశోధన పిల్లల్లోని అనేక సమస్యలకు పరిష్కారాన్ని చూపవచ్చునంటున్నారు నిపుణులు. తీవ్రమైన భయాందోళనలతో బాధపడుతున్న పిల్లలు, ధైర్యంగా మెలిగే పిల్లలతో స్నేహం చేస్తే... వారిలోని భయాందోళనలు తగ్గే అవకాశం ఉందంటున్నారు. విపరీతమైన భయాలతో బాధపడుతున్న పిల్లలకు చికిత్సను అందిస్తున్నప్పుడు, వారిలో అలాంటి భయాలను ప్రోత్సహిస్తున్న మిత్రులు ఎవరన్నా ఉన్నారేమో గమనించుకోవాలి అని కూడా సూచిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పిల్లల్లో అనవసరమైన భయాలను నివారించాలన్నా, పరిమితి దాటిన ఆందోళనకు చికిత్సను అందించాలన్నా... వారి స్నేహితులను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నమాట.

కొట్టిపారేయకూడదు

ఇదే కాకుండా మరికొన్ని విషయాలు కూడా. పరిశోధనలో వెల్లడించారు. చాలాసార్లు తల్లిదండ్రులు పిల్లల భయాల్ని తేలిగ్గా తీసుకుంటారు. చిన్నారులు ఏదైనా చెప్పినప్పుడు 'దానికి భయమెందుకు...' అంటూ కొట్టిపారేస్తుంటారు. అలా చేస్తే అమ్మానాన్నలు తమని అర్ధం చేసుకోవడం లేదనుకుంటారు పిల్లలు. క్రమంగా చెప్పడం మానేసి.. లోలోపల భయపడుతుంటారు. ఒత్తిడికి లోనవుతారు. ఇలా ఎక్కువ కాలం కొనసాగితే భయం కాస్తా ఫోబియాగా మారే ప్రమాదం ఉంటుందంటున్నారు వాళ్లు. 

వెంటాడే భయాలు 

భయాలను అడ్డుపెట్టుకుని తిననప్పుడూ, చదవనప్పుడూ, చెప్పిన మాట విననప్పుడు 'చీకట్లో ఉంచేస్తా... బొద్దింకను తెస్తా.." అంటుంటారు తల్లిదండ్రులు. ఇలా చేయడం వల్ల ఆ భయం వారిని జీవితాంతం వెంటాడుతుందట. ఇంకొన్నిసార్లు అతి జాగ్రత్త కూడా పిల్లలపై ప్రభావం చూపుతుంది. "చీకట్లోకి వెళ్లకు, మేడ ఎక్కకు, వీధిలోకి ఒంటరిగా వెళ్లొద్దు..' ఇలా చెబుతుంటారు. క్రమంగా పిల్లలు అలా చేయకూడదనీ, చేయడానికీ భయపడే ఆస్కారముంటుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఈ భయాలన్నీ పిల్లల్ని కలల రూపంలోనూ వెంటాడతాయట. కొందరు చిన్నారులకు అభద్రతా భావం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. ఎలాగంటే... సరిగ్గా చదవలేకపోవడం, మార్కులు తగ్గడం, ఉపాధ్యాయులూ, తోటి పిల్లల మధ్య అవమానాలు పడాల్సి వస్తుందనే అభద్రత భయాలకు దారితీస్తుంది.