మోగని బడి గంట .. 61 సర్కారు స్కూళ్లు మూసివేత

  • గత సర్కారు విధానాలతో గిరి పుత్రులు చదువులకు దూరం
  • హైస్కూళ్లలో వేధిస్తున్న సబ్జెక్ట్​ టీచర్ల కొరత

నాగర్​కర్నూల్,​ వెలుగు: వెనుకబడిన నాగర్​కర్నూల్​ జిల్లాలోని గిరిజన తండాల్లో పిల్లలు సర్కారు చదువులకు దూరమవుతున్నారు. రాష్ట్రంలో సింగిల్​ టీచర్​ స్కూల్స్​ ఉండవంటూ గత ప్రభుత్వం ఆర్బాటంగా ప్రకటించి, టీచర్ల ఖాళీలను భర్తీ చేయక, విద్యా వలంటీర్ల నియామకాలు చేయక ప్రభుత్వ విద్యను అటకెక్కిచింది. జిల్లాలో 825 గవర్నమెంట్​ స్కూల్స్​ ఉంటే, అందులో 61 బడులను శాశ్వతంగా మూసేశారు. 

ఇందులో ఎక్కువగా గిరిజన తండాల్లోనివే కావడం విశేషం. తెలుగు మీడియం స్కూళ్లకు ఆదరణ తగ్గడంతో గిరిజన తండాలు, చిన్న పల్లెల నుంచి పిల్లలను మండల కేంద్రాల్లోని ఇంగ్లిష్​ మీడియం స్కూల్స్​కు పంపిస్తున్నారు. మిగిలిన వారు చదువు మానేసి ఇతరత్రా పనులకు 
వెళ్తున్నారు.

61 బడులు మూతపడినయ్..

జిల్లాలో 825 బడులు ఉండగా, వివిధ కారణాలతో  రెండేండ్లలో 61 ప్రైమరీ స్కూల్స్  మూతబడ్డాయి. కల్వకుర్తి, అచ్చంపేట పట్టణాలతో పాటు నాగర్​ కర్నూల్​ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సొంత ఊరిలోనూ స్కూల్​ మూత పడింది. నాగర్​కర్నూల్​ మండలంలో 2, బిజినేపల్లి మండలంలో 4, తాడూరు మండలంలో1, తెల్కపల్లిలో 3 ,తిమ్మాజీపేటలో 2, పెద్దకొత్తపల్లిలో 2, కోడేరులో 4, కొల్లాపూర్​లో 3, పెంట్లవెల్లిలో 1, బల్మూరులో 3, ఉప్పునుంతలలో 9, చారకొండలో 4, అచ్చంపేట పట్టణంలో 6,  అమ్రాబాద్ లో 3​, పదరలో 3, లింగాలలో 2, కల్వకుర్తి పట్టణంలో 1, వెల్దండలో 7,  ఊర్కొండలో 3 స్కూల్స్​ క్లోజ్​ చేశారు.  మరో 107 గవర్నమెంట్​ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య అంతంతమాత్రంగానే ఉంది.

వేధిస్తున్న ఖాళీలు..

పిల్లలు లేరని స్కూల్స్​ మూసేస్తే మరోవైపు స్టూడెంట్స్​ ఉన్న హైస్కూళ్లలో సబ్జెక్ట్​ టీచర్ల కొరత వేధిస్తోంది. జిల్లాలో 1,034 మంది స్కూల్​ అసిస్టెంట్లు, ఎస్జీటీలు, పండిత్​లు బదిలీలకు సిద్దమైతే, 512 మందికి ప్రమోషన్లు దక్కనున్నాయి. ఇదిలాఉంటే జిల్లాలోని పలు స్కూళ్లలో కీలకమైన మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్, బయాలజీ సబ్జెక్ట్​ టీచర్లు లేకుండా, ఒక్క​లెసన్​ కూడా చెప్పకుండానే  విద్యా సంవత్సరం గడిచిపోయింది. జిల్లాలో 900 టీచర్​ పోస్టులు ఖాళీ అవుతాయని విద్యాశాఖ అధికారుల అంచనా. 

డిప్యుటేషన్లతో స్టూడెంట్లకు అన్యాయం..

గత విద్యా సంవత్సరంలో ఎమ్మెల్యేలు, ఉపాధ్యాయ సంఘాల లీడర్లను పట్టుకుని తిమ్మాజీపేట, బిజినేపల్లి, వెల్దండ మండలాల్లోని హైవేలు, మెయిన్​ రోడ్ల పక్కన ఉండే స్కూళ్లకు టీచర్లు డిప్యుటేషన్లు వేయించుకున్నారు. స్కూల్​ కాంప్లెక్స్​ పరిధిలోని హై స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్​లోని ఖాళీలను వర్క్​ అడ్జస్ట్​మెంట్​ కింద డిప్యుటేషన్ల మీద పంపించడానికి ఏటా 200 మందిని టీచర్లను కోరుకున్న బడికి పంపించే ఆచారం జిల్లాలో కొనసాగుతోంది. 

అయితే మారుమూల ప్రాంతాలకు మాత్రం టీచర్లను డిప్యుటేషన్​పై పంపించడం లేదు. దీంతో అచ్చంపేట, కొల్లాపూర్​ నియోజకవర్గాల్లోని ఏజెన్సీ ప్రాంత స్కూళ్లు, కోడేరు, పెద్దకొత్తపల్లి, అమ్రాబాద్, పదర, లింగాల, బల్మూర్, వంగూరు మండలాల్లోని హైస్కూళ్లలో ఏండ్ల తరబడి సబ్జెక్ట్​ టీచర్లు లేకపోయినా డిప్యుటేషన్​పై పంపించడం లేదు. కోడేరు మండల కేంద్రంలోని హైస్కూల్​లో గత ఏడాది మొత్తం బయాలజీ, ఇంగ్లిష్,​ హిందీ బోధించే టీచర్​ లేకుండానే నడిచిపోయింది. 

ప్రభుత్వం చర్యలు తీసుకున్నా..

విద్యా సంవత్సరానికి ముందే గవర్నమెంట్​ స్కూల్​ స్టూడెంట్స్​కు యూనిఫాం, టెక్ట్స్, నోట్​ బుక్స్, మిడ్​ డే మీల్స్​​ఇస్తున్నా ప్రభుత్వ​పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడం లేదు. ఇక బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్చడానికి ప్రారంభించిన బడిబాట మొక్కుబడిగా సాగింది. టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్​ ప్రకటించడంతో టీచర్లు ట్రాన్స్​ఫర్లపైనే దృష్టి పెట్టారు. 

ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఇంట్రస్ట్​ చూపించలేదు. జిల్లాలోని 20 మండలాల్లో గవర్నమెంట్​ స్కూల్​ టీచర్లు బడిబాట నిర్వహించినా ఫలితం అంతంత మాత్రమే. మధ్యాహ్న భోజనం సమకూర్చే ఏజెన్సీల బిల్లులు పెండింగ్​లో ఉండడంతో చాలా స్కూళ్లలో మిడ్​ డే మీల్స్​కు గ్యారెంటీ లేకుండాపోయింది. గత ప్రభుత్వం పుణ్యమాని పోయిన ఏడాది స్కూళ్లలో మధ్యాహ్న భోజనం అంతంతమాత్రంగానే పెట్టారు.