పిల్లల ప్రశ్నలకు జవాబుల్లేవ్!

  • తడుముకుంటున్న పేరెంట్స్
  • 54% మంది దగ్గర సమాధానాల్లేవ్
  • తిప్పలైనా ప్రశ్నించడాన్ని సమర్థిస్తున్న పేరెంట్స్
  • అమెజాన్, కాంతర్ జాయింట్ సర్వేలో వెల్లడి

హైదరాబాద్: ఆఫీసు ముగించుకొని ఇంటికొచ్చి ఫ్రెష్ అయి.. కుర్చీలో కూర్చొని టీ తాగుతూ టీవీ రిమోట్ నొక్కుతూ న్యూస్ చూస్తున్నాడు రమేశ్. నాన్న అంటూ బుడి బుడి నడకలతో వచ్చి తండ్రి ఒళ్లో వాలిపోయింది త్రిష. ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్న త్రిష.. ‘నాన్న.. నాకో డౌట్.. మనం బతకాలంటే గాలిపీల్చుకోవాలి కదా.. చేపలు గాలెలా పీల్చుకుంటాయి’ అని అడిగింది. ఏం చెప్పాలో అర్థం కాలేదు రమేశ్ కు.. నువ్వు ఆడుకో వెళ్లు అంటూ తల్లిదగ్గరకు పంపించాడు. వెంటనే మొబైల్ అందుకొని గూగుల్ చేశాడు. రాత్రి డిన్నర్ టైంలో బిడ్డకు సమాధానం చెప్పాడు రమేశ్. ప్రస్తుతం ఈ సమస్య రమేశ్ ది ఒక్కడిదే కాదు దాదాపు అందరిదీ అంటోంది అమెజాన్ సర్వే. పిల్లలు అడిగిన ప్రశ్నలకు 54% మంది పేరెంట్స్ సమాధానాలు చెప్పలేక పోతున్నారంటోంది.

అమెజాన్ అలెక్సా, కాంతర్ ఈ ఏడాది జూన్ లో దేశంలోని ఆరు నగరాల్లోని 750 మంది తల్లిదండ్రులను సర్వే చేసింది. దాదాపు 54% మంది తక్షణం సమాధానం చెప్పలేక పోతున్నామని ఒప్పుకొన్నారు. 52% మంది సమాధానం కోసం వెతుకుతారని సర్వే చెబుతోంది. 80% మంది తల్లిదండ్రులు తమ పిల్లలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు వెతికేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్టు తేలింది. ప్రధానంగా గూగుల్ ను, ఏఐని ఆశ్రయిస్తున్నారు. 44% మంది అక్కడికక్కడే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తారని అంటోంది. ప్రధానంగా 63% పిల్లలు పేరెంట్స్ టీవీ చూస్తున్నప్పుడే ఇలాంటి ప్రశ్నలు అడుగుతారని తేలింది.  90% మంది తమ పిల్లలను ప్రశ్నలు అడగమని  ప్రోత్సహిస్తారని తేలింది. దాదాపు 92% మంది తల్లిదండ్రులు తమ పిల్లల ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు కొత్త విషయాలు నేర్చుకుంటున్నామని చెప్పారు.

గమ్మత్తైన ప్రశ్నలు
బుడి బుడి నడకల పిల్లలు అడిగే ప్రశ్నలు చాలా గమ్మత్తుగా ఉంటున్నాయని సర్వే వివరించింది. అవి సులభమైనవే అయినప్పటికీ కొంత సేపు గందరగోళంలో పడేస్తాయని తల్లిదండ్రులు అంటున్నారు.‘కారును ఎలా తయారు చేయాలి?’, ‘విశ్వం ఎంత పెద్దది?’, ‘విమానం ఎలా ఎగురుతుంది?’ చేపలు నీటి అడుగున ఎలా ఊపిరి పీల్చుకుంటాయి?’లాంటి ప్రశ్నలు వేస్తున్నారు. ఇవన్నింటికీ సమాధానాలు తెలిసినా వెంటనే  చెప్పలేక పోతున్నారు. ప్రధానంగా టీవీ చూస్తున్న సమయంలో కాన్ సెంట్రేషన్ అంతా స్క్రీన్ మీదే ఉంటుంది.. ఆ దృశ్యంలో నిమగ్నమైపోతారు.. సరిగ్గా అదే సమయంలో వచ్చి ప్రశ్ని అడగడంతో వెంటనే సమాధానం చెప్పలేక పోవడం ప్రధాన కారణమని సర్వే చెబుతోంది.

పిల్లలు ప్రశ్నలెప్పుడు అడుగుతారంటే..
టీవీ చూస్తున్నప్పుడు            64%
ప్రయాణం                57
బయటికి వెళ్లడం            55
స్టడీ చేయడం            56
గ్యాడ్జెట్స్ తయారీ వీడియోలు చూస్తూ..    52
పెద్దల సంభాషణ వినటం        50%