అమ్మానాన్నల పుట్టినరోజు, పెండ్లి రోజు లేదా ఫ్రెండ్స్ బర్త్‌డే... ఇలా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు గిఫ్ట్స్ ఇవ్వాలని చిన్న పిల్లలు తెగ ఉత్సాహపడతారు. కానీ గిఫ్ట్ కొనాలంటే అమ్మానాన్నలే డబ్బులు ఇవ్వాలి. అలాంటప్పుడు వాళ్లు తల్లిదండ్రులని డబ్బులు అడిగితే ‘నువ్వు పెద్దయ్యాక సంపాదించి కొనొచ్చు.. ఇప్పుడేం వద్దు’ అని అంటారా? అయితే అలా అనొద్దు అంటున్నారు చైల్డ్ సైకాలజిస్ట్‌లు. ఎందుకంటే పిల్లలు గిఫ్ట్స్ ఇస్తామని అడిగినప్పుడు ‘ఓకే’ చెప్తే... పిల్లల్లో ఓ ఐదు ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి అంటున్నారు చైల్డ్ సైకాలజిస్ట్‌లు.
‘‘గిఫ్ట్స్ ఇవ్వడం వల్ల పంచుకోవడం, ఒకరికొకరు సహకరించుకోవడం వంటివి తెలుస్తాయి. ఎంపతీ(సహానుభూతి) ఫీలవడం అనేది చిన్నప్పట్నించే అలవాటు అవుతుంది. పిల్లల ఎదుగుదలలో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది చాలా మంచి రోల్ ప్లే చేస్తుంద’’ని న్యూయార్క్ యూనివర్సిటీలో ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఎరిన్ ఓ కోనర్ చెప్పారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ అలవాటు పిల్లల్ని బెటర్ పీపుల్‌గా తయారు చేస్తుంది. మరీ ముఖ్యంగా ఐదు స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి. అవేంటంటే...
జ్ఞానంలో సాయం...
గిఫ్ట్ ఇవ్వాలనే ఆలోచన వచ్చిన తరువాత ఏ సందర్భానికి? ఎలాంటి గిఫ్ట్? ఇవ్వాలి అనేదాని గురించి ఆలోచిస్తారు. కళ్లముందు ఉండే రకరకాల గిఫ్ట్స్ నుంచి ఒకదాన్ని ఎంపిక చేసుకుని ఇవ్వాలంటే బుర్రకి పని చెప్పాల్సిందే! పిల్లలకు నాలుగేండ్ల వయసు వచ్చేవరకు అవతలి వాళ్ల పాయింట్ నుంచి అర్థంచేసుకునే సామర్ధ్యం డెవలప్ కాదు.
అలాగని అంతకంటే ముందు నుంచి ఇప్పించకూడదా అంటే ఇవ్వొచ్చు... కాకపోతే టెంపర్ టాంట్రమ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కొందరు తల్లిదండ్రులు పిల్లలకు 18 నెలల వయసునుంచే గిఫ్టింగ్ కల్చర్ అలవాటు చేయాలి అనుకుంటారు. అలాంటప్పుడు పిల్లలకు నచ్చిన బొమ్మ ఏదైనా వేయమనండి. ఇలా చేయడం వల్ల మెదడు చురుకుగా తయారవుతుంది.
కమ్యూనికేషన్ పెరుగుతుంది
గిఫ్ట్స్ ఇవ్వడం వల్ల సంభాషణ, ఒకరితో ఒకరికి కనెక్టివిటీ పెరుగుతుంది . ఐదేండ్ల నుంచి ఆరేండ్ల వయసు పిల్లలు ఇచ్చే గిఫ్ట్స్ లేదా బొమ్మలు ... ఆ పిల్లలకు ఏం కావాలి అనుకుంటున్నారో అవే గిఫ్ట్‌గా ఇవ్వాలి అనుకుంటారు. అందుకే పిల్లలు వాళ్ల స్నేహితులకి గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని ‘మీ ఫ్రెండ్స్‌కు ఎలాంటి గిఫ్ట్స్ నచ్చుతాయి?’, ‘నువ్వు ఏం గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నావు?’ వంటి ప్రశ్నలు అడగాలి. ఇలా అడగడం వల్ల పిల్లలు ఆలోచిస్తారు. అలాగే రిటర్న్ గిఫ్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అనేది కూడా అర్థమవుతుంది.
ఏం కొనాలనే సంభాషణను పక్కన పెడితే, గిఫ్ట్ ఇవ్వాలనే ఆలోచనే పిల్లల్లో నాన్ వెర్బల్ కమ్యూనికేషన్‌ను ప్రోత్సహిస్తుంది. వాళ్లలోని ప్రేమను గిఫ్ట్ రూపంలో వ్యక్తం చేస్తారు. అలాగే గిఫ్ట్ తీసుకునేవాళ్ల ముఖంలోని హావభావాలు గమనిస్తారు కాబట్టి అవతలి వాళ్లు మాట్లాడకుండా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తే కూడా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.
సెన్సరీ ఎక్స్‌పీరియెన్స్
పిల్లల్లో మోటార్ స్కిల్స్ పెంచాలంటే వాళ్లు స్వయంగా తయారుచేసిన గిఫ్ట్స్ ఇవ్వడాన్ని ఎంకరేజ్ చేయాలి. సెన్సరీ ప్లే అనేది పిల్లల్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెంచుతుంది. శరీరం గురించి అవగాహన కలుగుతుంది. ఒకవేళ సొంతంగా తయారుచేయకపోయినా పర్వాలేదు. షాపులో కొన్న గిఫ్ట్స్‌ని ర్యాప్ చేయమనండి. అది కూడా మోటార్ స్కిల్స్ ప్రాక్టీస్‌కి పనికొస్తుంది. వాళ్లకు నచ్చిన యాక్టివిటీ చేసినట్టు ఉంటుంది.
సృజనాత్మకత..
పెద్దవాళ్ల కంటే పిల్లల్లో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పిల్లల బుర్రల్లో ఆలోచనలు, జడ్జిమెంట్స్ పెద్దవాళ్లకి ఉన్నట్టు ఉండవు. అందుకే వాళ్లు ఆలోచించి ఇచ్చే గిఫ్ట్‌లో క్రియేటివిటీ ఉంటుంది. చేతితో తయారుచేసిన వాటిలో అయితే అదింకా పెరుగుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ‘అవుటాఫ్ ద బాక్స్’ ఆలోచనలకు ఈ టెక్నిక్ కారణం అవుతుంది.
ఎమోషనల్ ఇంటెలిజెన్స్
గిఫ్టింగ్ వల్ల అవతలి వాళ్ల స్థానంలో ఉండి ఆలోచించడం, కృతజ్ఞత వంటి ఎమోషనల్ స్కిల్స్ పెరుగుతాయి. సోషల్ రిలేషన్షిప్లో వాళ్ల స్థానం అర్థం చేసుకోగలుగుతారు. ఆలోచించే శక్తి వృద్ధి చెందుతుంది. రకరకాల పరిస్థితులను అర్థం చేసుకునే సామర్ధ్యం పెరుగుతుంది. ఇలా గిఫ్ట్స్ ఇవ్వడమే కాదు తీసుకోవడంలో కూడా ఎంత హుందాగా ఉండాలో తెలుస్తుంది పిల్లలకు.