అధైర్యపడొద్దు.. ఆదుకుంటాం : రేవంత్​రెడ్డి

  • జలప్రళయానికి నష్టపోయిన బాధితులకు సీఎం రేవంత్​రెడ్డి భరోసా
  • మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ముంపు ప్రాంతాల పరిశీలన

మహబూబాబాద్, వెలుగు: అనుకోని జలప్రళయం సంభవించిందని, నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని, ఎవరూ అధైర్య పడొద్దని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి అన్నారు. మంగళవారం సీఎం ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ చార్జి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ శాఖ మంత్రి సీతక్కతో కలిసి  మహబూబాబాద్ ​జిల్లాలోని మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద దెబ్బతిన్న నేష్నల్​హైవే 365, ఆకేరు వాగుపై నిర్మించిన బ్రిడ్జి వద్ద ధ్వంసమైన రోడ్డును పరిశీలించారు. రోడ్డు మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ముంపునకు గురైన సీతారాం తండాలో ప్రజలను పరామర్శించారు. తక్షణ సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం కలెక్టరేట్​వద్ద ఏర్పాటు చేసిన వరద ముంపు ఫొటో ఎగ్జిబిషన్​ను పరిశీలించారు. కాన్ఫరెన్స్​హాల్​లో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్ష నిర్వహించారు. మానుకోట జిల్లాలో వరద విపత్తుపై మాట్లాడారు. వరద వల్ల నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలని సూచించారు. అనంతరం వరదల్లో సాహసోపేతంగా విధులు నిర్వర్తించిన పోలీసులను సీఎం, మంత్రులు అభినందించారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, విప్ డాక్టర్ రామచంద్రునాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య,  ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రామ్ నాథ్​కేకన్, వివిధ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.