నర్సన్న సన్నిధిలో సీఎం రేవంత్

  • బర్త్ డే సందర్భంగా నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు 
  • స్వాగతం పలికిన మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల, కొండా, ఉత్తమ్, పొన్నం
  • పూర్ణకుంభంతో స్వాగతం పలికి చతుర్వేద ఆశీర్వచనం చేసిన ఆలయ అర్చకులు
  • యాదగిరిగుట్టలో 3 గంటలు గడిపిన సీఎం రేవంత్

యాదగిరిగుట్ట, వెలుగు : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శుక్రవారం తన పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. గర్భగుడిలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని ప్రధానాలయ ముఖ మంటపంలో స్వామివారి ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో యాదగిరిగుట్ట చేరుకున్న సీఎం రేవంత్ కు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్వాగతం పలికారు.

 అనంతరం రోడ్డు మార్గాన కాన్వాయ్ లో కొండపైకి చేరుకున్న సీఎంకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం చేసి లడ్డూప్రసాదం అందజేశారు.

ఆలయంలో మూడు గంటలు..

లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం యాదగిరిగుట్టకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి దాదాపుగా మూడు గంటలపాటు గడిపారు. స్వామివారి దర్శనం కోసం సీఎం కొండపైకి చేరుకుని నేరుగా విష్ణుపుష్కరిణి వద్దకు కాలినడకన వెళ్లి స్నానసంకల్ప పూజలు చేశారు. అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలో ఉన్న అఖండజ్యోతి వద్దకు చేరుకుని దీపారాధన పూజల్లో పాల్గొని, కొబ్బరికాయ కొట్టి మొక్కు చెల్లించుకున్నారు. తూర్పు రాజగోపురం నుంచి త్రితల గోపురం మీదుగా ప్రధానాలయంలోకి చేరుకున్నారు. 

ఆలయంలో ఆయనకు ఆలయ ప్రధానార్చకులు నల్లంథిఘల్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యుల అర్చకత్వంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రధానాలయ ముఖ మంటపంలో ఉన్న బంగారు ధ్వజస్తంభానికి మొక్కి గర్భాలయంలోకి వెళ్లి స్వయంభూ నారసింహుడిని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం అర్చకులు సీఎం రేవంత్ రెడ్డితో పాటు వచ్చిన మంత్రుల బృందానికి చతుర్వేద ఆశీర్వచనం చేశారు. ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ స్వామివారి మెమోంటోను అందజేయగా.. ఆలయ చైర్మన్ నరసింహమూర్తి లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు. ప్రధానాలయంలో దాదాపుగా 40 నిమిషాలపాటు సీఎం గడిపారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, దానం నాగేందర్, వేముల వీరేశం, మందుల సామేల్, జైవీర్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి ఉన్నారు.

కొండపై కాంగ్రెస్ కార్యకర్తల అత్యుత్సాహం..

సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టపైకి వచ్చిన సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. సీఎం రేవంత్ తోపాటు ఆలయంలోకి వెళ్లడానికి ఒక్కసారిగా దూసుకొచ్చారు. దీంతో సీఎం రేవంత్ వెనకాలే ఆలయంలోకి వెళ్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ కార్యకర్తల మధ్య ఇరుక్కుపోయారు. భద్రతా సిబ్బంది అతికష్టంగా ఆమెను ఆలయంలోకి పంపించారు. దూసుకొచ్చిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కార్యకర్తలను పోలీసులు సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది. 


ఫండ్స్ రిలీజ్​కు ఆదేశించిన సీఎంకు కృతజ్ఞతలు..సీఎం రేవంత్​రెడ్డికి ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బొకే అందించి బర్త్​ డే విషెస్​ చెప్పారు. యాదగిరిగుట్టకు వచ్చిన సీఎంకు ఆయన స్వాగతం పలికారు. ఆయనతోనే కలిసి కారులో కొండపైకి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కొండపై కల్పించాల్సిన సౌకర్యాలను సీఎం దృష్టికి తెచ్చారు. అనంతరం ఐలయ్య మీడియాతో మాట్లాడారు. కొండపైన వసతి సదుపాయాలు కల్పించడానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. పెండింగ్ పనులను కంప్లీట్ చేయడానికి వెంటనే నిధులు విడుదల చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి అడిగిన వెంటనే నిధులు మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించిన సీఎంకు ఐలయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఫండ్స్ రిలీజ్​కు ఆదేశించిన సీఎంకు కృతజ్ఞతలు..

సీఎం రేవంత్​రెడ్డికి ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బొకే అందించి బర్త్​ డే విషెస్​ చెప్పారు. యాదగిరిగుట్టకు వచ్చిన సీఎంకు ఆయన స్వాగతం పలికారు. ఆయనతోనే కలిసి కారులో కొండపైకి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కొండపై కల్పించాల్సిన సౌకర్యాలను సీఎం దృష్టికి తెచ్చారు. 

అనంతరం ఐలయ్య మీడియాతో మాట్లాడారు. కొండపైన వసతి సదుపాయాలు కల్పించడానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. పెండింగ్ పనులను కంప్లీట్ చేయడానికి వెంటనే నిధులు విడుదల చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి అడిగిన వెంటనే నిధులు మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించిన సీఎంకు ఐలయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సీఎం పర్యటన సాగింది ఇలా..


  ఉదయం 11:06 గంటలకు హెలికాప్టర్ లోయాదగిరిగుట్టకు వచ్చారు.
  ఉదయం 11:14 గంటలకు కాన్వాయ్ లో ప్రెసిడెన్షియల్ సూట్ కు వెళ్లారు.
  ఉదయం  11:34 గంటలకు రోడ్డుమార్గంలో ప్రెసిడెన్షియల్ సూట్ నుంచికొండపైకి పయనం
  ఉదయం 11:40 గంటలకు కొండపైకి చేరుకున్నారు.
  ఉదయం 11:43 గంటలకు  విష్ణుపుష్కరిణిలో స్నాన సంకల్ప పూజలు
  ఉదయం 11:53 గంటలకు అఖండజ్యోతి వద్ద దీపారాధన పూజలు
  ఉదయం 11:57 గంటలకు తూర్పు  రాజగోపురం నుంచి ఆలయంలోకి  ప్రవేశించారు. 
  ఉదయం 11:57 నుంచి మధ్యాహ్నం12:34 గంటల వరకు దర్శనం,ఆశీర్వచనం
  మధ్యాహ్నం 12:36 గంటలకు ఉత్తరరాజగోపురం నుంచి ఆలయం వెలుపలకు
  మధ్యాహ్నం 12:37 గంటలకు తిరిగి ప్రెసిడెన్షియల్ సూట్ కు పయనం
  మధ్యాహ్నం 12:43 గంటలకు ప్రెసిడెన్షియల్ సూట్ కు చేరిక
  మధ్యాహ్నం 1 గంటకు.. రివ్యూ సమాచారాన్ని ప్రారంభం
  మధ్యాహ్నం 2:10 గంటలకు రివ్యూ కంప్లీట్
  మధ్యాహ్నం 2:20 నుంచి 2:45 వరకు లంచ్
  మధ్యాహ్నం 2:50 గంటలకు గుట్ట నుంచి వలిగొండ మండలం సంగెం మూసీ పర్యటనకు కాన్వాయ్ లో పయనం