ఇన్‌‌‌‌ఫార్మర్ల నెపంతో ముగ్గురి హత్య

భద్రాచలం, వెలుగు : ఇన్‌‌‌‌ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు ముగ్గురు యువకులను హత్య చేశారు. ఈ ఘటనలు చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ రాష్ట్రంలోని బీజాపూర్‌‌‌‌ జిల్లాలో సోమవారం వెలుగు చూశాయి. జిల్లాలోని గంగులూరు పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌ పరిధిలోని కొర్చోలి గ్రామానికి చెందిన కమ్లు, పోతం అనే ఇద్దరు యువకులను ఆదివారం మావోయిస్టులు కిడ్నాప్‌‌‌‌ చేశారు. సమీప అడవుల్లో ప్రజాకోర్టు నిర్వహించి ఇద్దరినీ ఉరి తీసి చంపారు. అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు.

ఈ విషయం పోలీసులకు చెబితే ప్రతీకార దాడులకు పాల్పడతారన్న భయంతో కుటుంబసభ్యులు గుట్టుగా అంత్యక్రియలు జరిపారు. ఇదే పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌ పరిధిలోని రెడ్డి గ్రామానికి చెందిన ముఖేశ్‌‌‌‌ హేమ్లా అనే యువకుడిని వారపు సంతలోనలుగురు మావోయిస్టులు తమ వెంట తీసుకెళ్లారు. సోమవారం ఉదయం గ్రామ సమీపంలోని పొదల్లో ముఖేశ్‌‌‌‌ హేమ్లా డెడ్‌‌‌‌బాడీ కనిపించింది. గంగులూరు ఏరియా కమిటీ పేరుతో ఓ లెటర్‌‌‌‌ సైతం దొరికింది.

దళాల సమాచారాన్ని ముఖేశ్‌‌‌‌ పోలీసులకు చేరవేస్తున్నాడని ఆరోపిస్తూ కత్తులతో పొడిచి చంపారు. దీనిపై గంగులూరు పోలీసులు విచారణ చేపట్టారు. ఒకేరోజు ముగ్గురిని హతమార్చడంతో బీజాపూర్‌‌‌‌ జిల్లాలో కలకలం రేపింది.