మహిళలకు మేలు చేసేలా సర్కారు స్కీంలు: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

  • ఫ్రీ బస్ కోసం నెలకు రూ.300 కోట్లు కేటాయింపు: వివేక్ వెంకటస్వామి  
  • అర్హులందరికీ గ్యాస్ సబ్సిడీ అమలుకు చర్యలు 
  • లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన చెన్నూర్ ఎమ్మెల్యే 

కోల్​బెల్ట్, వెలుగు: కాంగ్రెస్ సర్కార్ మహిళలకు మేలు చేకూర్చేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, మందమర్రి మున్సిపాలిటీల్లో మహాలక్ష్మి స్కీం లబ్ధిదారులకు గ్యాస్ సబ్సిడీ సర్టిఫికెట్ల పంపిణీని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల అమలు కష్టమని కొందరు అపోహ పడ్డారని.. కానీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి గ్యారంటీల అమలును ప్రారంభించారన్నారు.

 ఇప్పటికే ఆరు గ్యారంటీల్లో ఐదింటిని విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. మహిళలకు ఫ్రీ బస్ స్కీం అమలు కోసం నెలకు రూ.300 కోట్లను ఆర్టీసీకి సర్కారు చెల్లిస్తోందన్నారు. లింక్ చేయని కారణంగా కొన్ని చోట్ల గ్యాస్ సబ్సిడీ రావడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. లబ్ధిదారులందరికీ రాయితీ వచ్చేలా సర్కారు త్వరలోనే చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 

బీఆర్ఎస్ సర్కార్ రుణమాఫీ అంటూ ఐదేండ్లు కాలం వెళ్లదీసిందని.. కానీ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రూ. 2 లక్షలలోపు రుణమాఫీ చేసిందని వివేక్ అన్నారు. త్వరలోనే ఫ్యామిలీ హెల్త్ డిజిటల్ కార్డులు, రేషన్ కార్డులు ఇవ్వాలని సీఎం నిర్ణయించారని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయ్యాయన్నారు. 

ప్రయారిటీ ప్రకారం అభివృద్ధి పనులు.. 

క్యాతనపల్లి,మందమర్రి మున్సిపాలిటీల్లో రోడ్లు, డ్రైయినేజీలు నిర్మించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత క్యాతనపల్లి లో రూ.6.80 కోట్లతో, మందమర్రిలో రూ.4 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించానని వివేక్ చెప్పారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులను ప్రయారిటీ ప్రకారం చేపడుతున్నామని తెలిపారు. పదకొండేండ్ల కిందట తాను పెద్దపల్లి ఎంపీగా ఉన్నప్పుడు క్యాతనపల్లి రైల్వే గేట్ వద్ద ఆర్వోబీని శాంక్షన్ చేయించానని, కానీ అప్పటి బీఆర్ఎస్ సర్కార్ అప్రోచ్​రోడ్డును నిర్మించలేకపోయిందన్నారు. 

త్వరలోనే ఆర్వోబీని పూర్తి చేయించి, అందుబాటులోకి తెస్తామన్నారు. కాగా, క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో రూ. 14 లక్షలతో ఏర్పాటు చేయనున్న ఓపెన్ జిమ్ ల పనులకు వివేక్ భూమిపూజ చేశారు. కార్యక్రమంలో క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, సాగర్​రెడ్డి, పల్లె రాజు, నోముల ఉపేందర్​గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 

కాగా, మందమర్రి,క్యాతనపల్లి పట్టణాల్లో వివిధ కారణాలతో ఇటీవల పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు మృతిచెందారు. మృతుల కుటుంబాలను శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే వివేక్ పరామర్శించారు. అలాగే ప్రమాదాల్లో గాయపడ్డ ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తలను పరామర్శించి, ఆర్థిక సాయం చేశారు.   

కొండా లక్ష్మణ్ బాపూజీకి సీఎం నివాళి

స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ కోసం సర్వస్వం ధారపోసిన త్యాగశీలి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, మైనంపల్లి రోహిత్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి పాల్గొన్నారు.