ఐక్యతతోనే మాలల అభ్యున్నతి: చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

తెలంగాణలో మాల జాతిని కాపాడుకునేందుకు 30 లక్షల మంది మాలలు ఐక్యంగా ఉండాలని, ఐక్యతతోనే అభ్యున్నతి సాధించగలమని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు.పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన ఆయన .. కాకా వెంకటస్వామి ఎప్పుడూ మాలల అభ్యున్నతికి కృషి చేశారని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో, బ్రిటీష్ పాలనలో మాల కులస్థులు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు సాధించారన్నారు. నిజాం పాలనలో కొనసాగిన నియంతృత్వ పోకడ వలన ఉన్నత చదువులు అభ్యసించలేకపోయరని, ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల వ్యవస్థలో మాలలు అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  

మాలలకు అన్యాయం జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. మాలలు ఐక్యంగా ఉండాలని వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. ఐక్యమత్యంతో ఉంటేనే హక్కులను సాధించుకోగలమని చెప్పారు. 15 శాతం నుంచి 20 శాతం వరకు రిజర్వేషన్​ పెంచాలని, మాల కులస్థుల కులగణన చేయాలన్నారు. నవంబర్ లో హైదరాబాద్ లో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి పిలుపునిచ్చారు.

Also Read :- రైతులకు న్యాయం చేస్తాం

ప్రతి జిల్లాలోని మాల ఉద్యోగులను ఐక్యం చేయడమే తమ ముఖ్య ఉద్దేశమని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. మాలలకు కాంగ్రెస్​ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఎన్నికల సమయంలో మందకృష్ణ , ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మాలలకు వ్యతిరేకంగా మాట్లాడారన్నారు. అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ఎస్సీ వర్గీకరణకు పోరాడుతామన్నారు. అంబేద్కర్ స్పూర్తితో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలని ఎమ్మెల్యే నాగరాజు ఆకాంక్షించారు.