మాలల ఆత్మగౌరవం కోసమే సభలు నిర్వహిస్తున్నామని.. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో ఆయన శనివారం పర్యటించారు. గ్రామంలో పోచమ్మ అమ్మవారిని వివేక్ వెంకట స్వామి దర్శించుకున్నారు. అనంతరం డా. బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఆవునూర్ గ్రామంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ర్యాలీలో పాల్గొన్నారు. --అన్ని కులాల వారు సభలు ఏర్పాటు చేసుకుంటున్నారని చెన్నూర్ ఎమ్మెల్యే అన్నారు.
మాలలు సమావేశమై ఏకమైతే.. ఎందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో డిసెంబర్ 1 జరిగే మలాల సింహ గర్జన సభను విజయవంతం చేయాలని గడ్డం వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. సభకు భంగం కలిగించాలని కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది మాలలు సభకు హాజరు కావాలని కోరారు. సభకి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించామని చెప్పారు.