మాలలు హక్కుల కోసం ఉద్యమించాల్సిన టైమొచ్చింది

  • రాజకీయ పార్టీలకు మన సత్తా తెలియాలి: వివేక్
  • వచ్చే నెల 1న జరిగే సభకు 30 లక్షల మంది మాలలు తరలిరావాలని పిలుపు
  • గ్రామ స్థాయిలో కమిటీలు వేసి మాలల ఉద్యమాన్ని బలోపేతం చేయాలని విజ్ఞప్తి
  • కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో మాలల సమ్మేళనంలో చెన్నూరు ఎమ్మెల్యే

కరీంనగర్, వెలుగు: మాలలు ఐక్యమై, తమ హక్కుల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం కరీంనగర్‌‌‌‌‌‌‌‌లోని పద్మనాయక ఫంక్షన్ హాల్‌‌‌‌లో నిర్వహించిన మాలలు, మాలల ఉపకులాల ఐక్యత, అభివృద్ధి సమ్మేళనానికి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. మాలల ఐక్యత కోసం నిర్వహించిన నాగర్ కర్నూల్ సభ విజయవంతమైందని, అదే స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

 డిసెంబర్ 1న హైదరాబాద్‌‌‌‌లో జరిగే బహిరంగ సభకు మాలలు లక్షలాదిగా తరలివచ్చి, విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది మాలలు ఈ మీటింగ్‌‌‌‌కు తరలిరావాలన్నారు. ఆ సభ ద్వారా అన్ని రాజకీయ పార్టీలకు మనం స్ట్రాంగ్ అనే మెసేజ్ పంపించాలన్నారు. తాను రూ.5 లక్షలతో విశాక ఇండస్ట్రీ పెట్టి ఈ స్థాయికి వచ్చానన్నారు.

నీతి, నిజాయితీతో పనిచేయాలని ఎవ్వరికీ భయపడొద్దని తన తండ్రి వెంకటస్వామి చెప్పేవారని, ఆయన దారిలోనే నడుస్తున్నానని చెప్పారు. తన వ్యాపారాల్లో నిజాయితీ ఉన్నందుకే ఈడీ దాడులకు భయపడలేదన్నారు. ఆస్తులు సంపాదించుకునేందుకు తాను ప్రభుత్వంతో బాగుంటానని కొందరు విమర్శిస్తుంటారని, అయితే ఇప్పటివరకు ఏ ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి పొందలేదని చెప్పారు. 

మాలల లీడర్‌‌‌‌‌‌‌‌ అవుతావా అని అడిగారు.. 

‘‘మనం మన సత్తా చూపించినప్పుడు విమర్శలు వస్తాయి. మనపై విమర్శలు చేస్తున్నారంటే వాళ్లు మనకు భయపడుతున్నట్లే లెక్క. మాలల కోసం మాట్లాడితే నన్ను మాలల లీడర్‌‌‌‌‌‌‌‌ అవుతావా అని కొందరు అడిగారు. నేను బీజేపీలో ఉన్న టైంలో మాలలు 23 శాతం మాత్రమే ఉంటారని దుష్ప్రచారం జరిగితే, అమిత్ షాతో సైతం కొట్లాడాను. మాల, మాదిగల సంఖ్య తేలితేనే ఏ నిర్ణయమైనా తీసుకోవాలని చెప్పాను”అని వివేక్‌‌‌‌ వెంకటస్వామి అన్నారు. ఈ మీటింగ్‌‌‌‌ను చూస్తే మాలల్లో జోష్, ఉత్సాహం, ధైర్యం వచ్చినట్లు తెలుస్తోందని చెప్పారు. గ్రామ స్థాయిలో కమిటీలు వేసి ఉద్యమాన్ని బలోపేతం చేయాలని సూచించారు. 

అంబేద్కర్ అందరికి స్ఫూర్తి అని, ఆయన మన జాతి కోసం గాంధీజీతో సైతం కొట్లాడాడని గుర్తుచేశారు. మన జాతిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. తన తండ్రి వెంకటస్వామి 75 వేల గుడిసెలు నిర్మించినప్పుడు, 40 వేల మందికి ఉద్యోగాలు కల్పించినప్పుడు మాలలు, మాదిగలు అని చూడలేదన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. మన జాతికి ఎక్కడ అన్యాయం జరిగినా ముందువరుసలో ఉండి కొట్లాడుతానని, మీలో ఒక్కడిగా, మీతో ఉంటానని స్పష్టం చేశారు. 

మాజీ మంత్రి సుద్దాల దేవయ్య మాట్లాడుతూ.. తాను మంత్రిగా ఉన్నప్పుడు 1,200 అంబేద్కర్ సంఘాలు స్థాపించానని గుర్తుచేశారు. దళితుల ఐక్యత చూసి ఆ రోజుల్లో అందరు భయపడేవారన్నారు. ఈ సమావేశంలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య, నాయకులు దామెర నర్సయ్య, అర్ష మల్లేశం, కొరివి వేణుగోపాల్, జక్కుల జగన్ మోహన్, జనార్దన్, దాసరి దశరథం, మామిడి నారాయణ, గంట కళ్యాణి శ్రీనివాస్, మేడి రాజవీరు, మేడి మహేశ్, తీట్ల ఈశ్వరి, మేడిఅంజయ్య, బైరి కుమార్, రొడ్డ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. 

మాలలంతా ఐక్యం కావాలి... 

సికింద్రాబాద్, వెలుగు: వివక్షకు గురవుతున్న మాల వర్గానికి చెందిన ప్రజలంతా ఐక్యం కావాల్సిన సమయం ఆసన్నమైందని ఎమ్మెల్యే వివేక్‌‌‌‌ వెంకటస్వామి అన్నారు. మాలల జాతి పరిరక్షణకు, హక్కుల సాధనకు ఐకమత్యంతో పోరాడాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో బొల్లారంలో నిర్వహించిన సమావేశంలో వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశానికి ముందు బొల్లారంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మన జాతిని, హక్కులను మనమే కాపాడుకోవాలన్నారు. 

ఇంట్లో కూర్చుంటే ఏమీ రాదని, బస్తీ, బస్తీకి వెళ్లి మాలలను చైతన్యవంతం చేయాలని కోరారు. గతంలో మా నాన్న వెంకటస్వామి మీ వెంట ఉండి మాలల హక్కుల కోసం పోరాడారని, ఇప్పుడు తాను మీ వెంట ఉంటానన్నారు. జాగో మాల నినాదంతో మాలలు అందరినీ చైతన్య పరచాలని సూచించారు. ప్రజల ఒత్తిడి మీదనే సమస్యలు పరిష్కరం అవుతాయన్నారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ చెన్నయ్య మాట్లాడుతూ.. మాలలు అందరూ ఐక్యంగా పోరాడాలంటూ వివేక్ వెంకటస్వామి మనలో ధైర్యాన్ని నింపారన్నారు.

 వివేక్ మన వెంట ఉన్నారని, ఆయన మనకు ఇచ్చిన బలంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలన్నారు. వర్గీకరణ పేరుతో కులాల మధ్య చిచ్చుపెట్టిన మంద కృష్ణ ఖబర్దార్ అని హెచ్చరించారు. మాలల హక్కులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వంపైనా పోరాటం చేస్తామన్నారు.