కేటీఆర్​ ఫెయిల్యూర్​ లీడర్​ : వివేక్​ వెంకటస్వామి

  • సీఎం కావాలన్న ఆశతో బీఆర్​ఎస్​ను పతనం చేసిండు: వివేక్​ వెంకటస్వామి
  • పదేండ్ల పాలనలో ఏం చేశారో ఆత్మ విమర్శ చేసుకోవాలి
  • కాళేశ్వరం, మిషన్​ భగీరథ పేరుతో లక్షల కోట్లు దోచుకున్నరు
  • కార్పొరేషన్లని చెప్పి ప్రజలపై ఆర్థిక భారం మోపారని ఫైర్​
  • మందమర్రి, జైపూర్, భీమారం మండలాల్లో పర్యటన

కోల్​బెల్ట్, వెలుగు:​ కేటీఆర్​ ఓ ఫెయిల్యూర్​ లీడర్​ అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి విమర్శించారు. ‘‘సీఎం కావాలన్న ఆశతో వర్కింగ్​ ప్రెసిడెంట్​గా బీఆర్​ఎస్​ను లీడ్​ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పతనానికి కారణమైండు. 2019 పార్లమెంట్​ ఎన్నికల్లోనూ సారు.. కారు..పదహారు అంటూ ప్రచారం చేసి ఏం సాధించిండు? ఆయనో  ఫెయిల్యూర్​ లీడర్​” అని వ్యాఖ్యానించారు. కార్పొరేషన్ల పేరుతో గత బీఆర్​ఎస్​ సర్కార్​ ప్రజలపై ఆర్థిక భారం మోపిందని, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.లక్ష కోట్లు, మిషన్​ భగీరథలో రూ. 40 వేల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆయన ఆరోపించారు.

‘‘బీఆర్​ఎస్​ నేతల అవినీతి సొమ్మును కక్కించాలని సీఎం రేవంత్​రెడ్డిని కోరుతున్న. బీఆర్​ఎస్​ లీడర్లు అవినీతి, అక్రమాలతో వేల కోట్లు దండుకున్నరు” అని పేర్కొన్నారు. గత బీఆర్​ఎస్​ప్రభుత్వం డబుల్​బెడ్రూం ఇండ్లు అని, నిరుద్యోగ భృతి అని చెప్పి మాట తప్పిందని ఫైర్​ అయ్యారు. ‘‘పదేండ్లు అధికారంలో ఉండి ప్రజలకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో  కేటీఆర్​ ఆత్మ విమర్శ చేసుకోవాలి. బీఆర్ఎస్​గతంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై వైట్​పేపర్​ రిలీజ్​ చేయాలి” అని సవాల్​ చేశారు.

 బుధవారం మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీలోని నార్లపూర్, ఊరు రామకృష్ణాపూర్, దొరలబంగ్లా పరిధిలోని 6,7,10 ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి వార్డుల్లో మార్నింగ్​ వాక్​ కార్యక్రమాన్ని  నిర్వహించారు. జైపూర్​ మండలం నర్వ, ఇందారం గ్రామాల్లో జిల్లా కలెక్టర్​ కుమార్ దీపక్​తో కలిసి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మహిళ భవన్​కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వివేక్​ వెంకటస్వామి మాట్లాడారు. కాంగ్రెస్​ సర్కార్​ మూసీ ప్రాజెక్టును రూ.1,500 కోట్లతో చేపడుతుంటే కేటీఆర్​ లక్షన్నర కోట్లు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.  

లెదర్​ పార్కు పునరుద్ధరణకు కృషి

మందమర్రిలోని లెదర్​ పార్కు పునరుద్ధరణకు కృషి చేస్తానని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటానని వివేక్​ వెంకటస్వామి అన్నారు. మందమర్రిలో లిడ్​క్యాప్  ఆధ్వర్యంలో ఏర్పాటైన లెదర్​ పార్కు భూములను సింగరేణి యాజమాన్యం సోలార్​ ప్లాంటుకు  అక్రమంగా  కట్టబెడుతున్నదని దళిత సంఘాలు, చర్మకారుల ఫిర్యాదు నేపథ్యంలో.. సింగరేణి ఏజెంట్​ రాందాస్​, ఎస్టేట్​ ఆఫీసర్​ వెంకటరెడ్డి, దళిత సంఘాల నేతలతో కలిసి  భూములను ఎమ్మెల్యే పరిశీలించారు. 

ఈ భూములను సోలార్ ప్లాంట్​కు కేటాయించొద్దని, లెదర్​ పార్క్​ చుట్టూ ప్రహరీని నిర్మించాలని ఆయన సింగరేణి అధికారులను  ఆదేశించారు.  మందమర్రి ఏరియా సింగరేణి జీఎంతో మాట్లాడి పార్కు భూములకు నష్టం కలుగకుండా చూస్తానని దళిత సంఘాలకు భరోసా ఇచ్చారు.  కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి హయంలో లిడ్​క్యాప్​ ​ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కోసం లెదర్​ పార్కుల ఏర్పాటుకు కృషి చేశారని ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి గుర్తుచేశారు. రాష్ట్రంలో లిడ్​ క్యాప్​కు విలువైన భూములన్నాయని తెలిపారు. మందమర్రిలోని లెదర్​ పార్క్​ పునరుద్ధరణకు సీఎం రేవంత్​రెడ్డితో మాట్లాడినట్లు చెప్పారు. గతంలో రూ.10లక్షలతో భవనం నిర్మించారని, ప్రస్తుతం డీఎంఎఫ్​టీ కింద రూ.20లక్షలు కేటాయిస్తున్నట్లు చెప్పారు.

 కులగణన తర్వాత లెదర్​ పార్కుల విషయంపై సీఎంతో మరోసారి చర్చిస్తానని ఆయన హామీ ఇచ్చారు. చెన్నూరు నియోజకవర్గం పరిధిలో రూ.500 కోట్ల ఫండ్స్​ను అభివృద్ధి పనులకు ​ కేటాయించినట్లు తెలిపారు. గ్రామాలు, పట్టాణాల్లో రోడ్లు, డ్రైయినేజీల నిర్మాణపనులు సాగుతున్నాయన్నారు. రూ.60 కోట్ల ఫండ్స్​తో చేపట్టిన పనులు ప్రోగ్రెస్​లో ఉన్నాయని వివరించారు. రూ.100 కోట్ల నిధులతో  అమృత్​ స్కీం ద్వారా మందమర్రి, క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీల్లో డ్రికింగ్​ వాటర్​ సప్లై కోసం పనులు చేపట్టినట్లు తెలిపారు. రూ.100 కోట్లను నేషనల్​ హైవే 63లో కొత్త రోడ్డు, విస్తరణ పనులకు మంజూరు చేయించామని, రూ.2 కోట్లతో నేషనల్​ హైవేలోని జోడు వాగుల వద్ద పర్మినెంట్​ రిపేర్లు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. 

కాగా, మార్నింగ్​ వాక్​లో భాగంగా వివేక్​ వెంకటస్వామి స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించాలని సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు. కాకా వెంకటస్వామి పేరుతో ఊరు రామకృష్ణాపూర్​ మహిళలకు వంట పాత్రలను ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అందజేశారు. జైపూర్​ మండలం రాసూల్​పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్​ కార్యకర్త, నూతన వరుడు  జంగం సురేశ్​ ను ఆయన ఆశీర్వదించారు. భీమారం మండలం మద్దికల్​లో రెండు రోజుల కింద గుండెపోటుతో మృతిచెందిన ఓడెటి రాంరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు.