వాగు ఆవల పంట చేన్లు..వానస్తే పనులు బంద్

  • పెద్ద వాగుపై వంతెనల నిర్మాణానికి ఎమ్మెల్యే హామీ
  • పంట పొలాలకు వెళ్లలేని దుస్థితిలో అందుగులపేట, పులిమడుగు రైతులు, కూలీలు
  • పదేండ్లు పాలించినా పట్టించుకోని బీఆర్ఎస్
  • కల్వర్టుల కోసం ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామికి వినతులు
  • మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీతో గ్రామస్తుల్లో ఆశలు

కోల్​బెల్ట్, వెలుగు : మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని పెద్ద వాగు చిన్న వానకే  పొంగిపొర్లుతుండడంతో దాన్ని దాటలేని రైతులు సకాలంలో వ్యవసాయ పనులు చేసుకోలేకపోతున్నారు. బ్రిడ్జీలు నిర్మించాలని గ్రామస్తులు గత బీఆర్​ఎస్ ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. అందుగులపేట, పులిమడుగు పంచాయతీలను ఆనుకొని ఉన్న పెద్ద వాగు వర్షాలకు ఉధృతంగా పారుతుండడంతో అవతలి వైపున్న పంట పొలాల్లోకి రైతులు,

కూలీలు వెళ్లలేకపోతున్నారు. ప్రతి ఏటా వర్షాకాలంలో ఆ గ్రామస్తులకు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. శ్మశాన వాటికలు సైతం అటే ఉండడంతో వర్షాల సమయంలో ఎవరైనా చనిపోతే వారి బాధలు అన్నీ ఇన్నీ కావు. ఇటీవల వారి సమస్య విన్న చెన్నూర్ ​ఎమ్మెల్యే వివేక్ ​వెంకటస్వామి రెండు గ్రామాల్లో పర్యటించారు. వాగుపై కల్వర్టుల నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో వారిలో ఆశలు రేకెత్తాయి. 

వ్యవసాయ పనులుండవ్.. కైకిలికి కష్టం

పెద్దవాగు అవతలి వైపు అందుగులపేట గ్రామస్తులకు చెందిన1,500 ఎకరాలు, పులిమడుగు గ్రామస్తులకు  సంబంధించి 1000 ఎకరాల పంట పొలాలున్నాయి. వారితోపాటు ఊరు మందమర్రి, నార్లపూర్​కు చెందిన సుమారు 700 మంది రైతులు వాటిపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే చిన్న పాటి వానకే అక్కడి పెద్ద వాగు ఉప్పొంగి ప్రవాహిస్తుంటుంది. వాగుపై వంతెనలు లేకపోవడంతో వ్యవసాయ పనులు చేసుకోలేక, కోతకు వచ్చిన పంటను ఇంటికి తీసుకురాలేక రైతులు, వ్యవసాయ కూలీలు, సోలార్​ ప్లాంటుకు వెళ్లే కార్మికులు ఏటా  ఇంటికే పరిమితమవుతున్నారు.  

ఏడేండ్ల క్రితం కూలిన వంతెన

అందుగులపేట శివారులో తొమ్మిదేండ్ల క్రితం రెన్యూ, గ్రీన్​కో సోలార్​ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ప్లాంట్​ యాజమాన్యం పెద్దవాగుపై కల్వర్టు నిర్మించడంతో రాకపోకలు ఈజీగా సాగాయి. వాగులోని కల్వర్టు ఫిల్లర్ల పక్కన ఇసుకను కొందరు అక్రమంగా తరలించడంతో కింది భాగం బలహీనంగా మారి 2018లో వరద ఉధృతికి కల్వర్టు కూలిపోయింది. అప్పటి నుంచి ఆ గ్రామస్తులకు మళ్లీ ఇబ్బందులు మొదలయ్యాయి. పులిమడుగు గ్రామస్తులకు మొదటి నుంచే ఈ సమస్య ఉంది. వాగును దాటుతూ వరద ఉధృతికి గ్రామస్తులు, పశువులు కొట్టుకుపోయిన ఘటనలున్నాయి. ఉదయం పనులకు వెళ్లి సాయంత్రం వాగు ఉధృతి పెరగడంతో తిరిగి రాలేక అవతలి వైపు ఒడ్డుపై గంటల తరబడి నిరీక్షించిన ఘటనలు ఎన్నో.. 

బీఆర్ఎస్​ పాలకులు పట్టించుకోలే..

రాష్ట్రాన్ని పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం..​పెద్దవాగుపై వంతెనలు నిర్మించాలని గ్రామస్తుల డిమాండ్​ను పట్టించుకోలేదు. చివర్లో ఎన్నికల ముందు 2023 అక్టోబర్​1  హడావిడిగా పంచాయతీరాజ్​అండ్​ రూరల్ ​డెవలప్​మెంట్​ ద్వారా రూ.6 కోట్ల ఫండ్స్​తో రెండు చోట్ల బ్రిడ్జీలకు అప్పటి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కానీ నిర్మాణ పనులు మాత్రం చేపట్టలేదు. 

పెద్దవాగుపై కల్వర్టుల నిర్మాణానికి కృషి

ఇటీవల అందుగులపేట, పులిమడుగు గ్రామాలను సందర్శించిన ఎమ్మెల్యే వివేక్​ఆ గ్రామస్తులతో మాట్లాడారు. ‘పెద్ద వాగుపై వంతెనల నిర్మాణానికి కృషి చేస్తా. గత బీఆర్ఎస్​ పాలకులు ఎన్నికల్లో ఓట్ల లబ్ధి కోసం రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ కల్వర్టుల నిర్మాణానికి ఫండ్స్ శాంక్షన్ చేయించారు. ఫండ్స్​ రీ శాంక్షన్​ చేయించాల్సిన అవసరం ఉందని, కల్వర్టుల నిర్మాణానికి రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి సీతక్క దృష్టికి తీసుకువెళ్లి స్పెషల్ గ్రాంట్స్ మంజూరుకు కృషి చేస్తా’ అని అన్నారు. - ఎమ్మెల్యే వివేక్ ​వెంకటస్వామి