దేవ దేవుడా: తిరుమల లడ్డూను ఇంట్లోనే ఇలా తయారుచేస్కోండి: సోషల్ మీడియాలో కోట్ల మంది చూశారు..!

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి ఉన్న గుర్తింపు, ప్రాశస్త్యం ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల వివాదం రేగడంతో తిరుమల లడ్డూ ప్రసాదం గురించి దేశం మొత్తం చర్చించుకుంది. ఈ క్రమంలో.. ఇంట్లోనే ఇలా రుచికరంగా తిరుమల లడ్డూ తయారుచేసుకోండని తమిళనాడుకు చెందిన ప్రవీణ్ కుమార్ అనే చెఫ్ ఇన్స్టాగ్రాంలో ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఇంకేముంది.. ఆ వీడియో తెగ  వైరల్ అయింది. ‘‘TIRUPATI LADDU’’ అనే టైటిల్తో పోస్ట్ చేసిన ఈ వీడియోకు ఏకంగా.. 15.4 మిలియన్ వ్యూ్స్ వచ్చాయి. అంటే కోటిన్నర మందికి పైగా ఈ వీడియో చూశారు.

 

 

దేవుడి ప్రసాదానికి సంబంధించి చేసిన వీడియో కావడంతో ఈ చెఫ్ తన వీడియోలో ఆధ్యాత్మికతను గుబాళింపజేశాడు. దీపారాధన చేసి లడ్డూ తయారీ విధానాన్ని మొదలుపెట్టాడు. లడ్డూ తయారు చేయడం పూర్తయిన తర్వాత ఆ లడ్డూలను తులసి ఆకులు ఉన్న ఒక పాత్రలో ఉంచాడు. తిరుమల లడ్డూకు ఉన్న రుచి, సువాసన ప్రపంచంలో మరే ఇతర లడ్డూ ప్రసాదానికి లేదనడంలో అతిశయోక్తి లేదేమో. అందువల్లే ఈ లడ్డూ ప్రసాదానికి పేటెంట్ దక్కింది. ఈ పేటెంట్ ప్రకారం.. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ విధానాన్ని ప్రపంచంలో ఎవరూ అనుకరించకూడదు.

ఈ లడ్డూ తయారీకి వినియోగించే పదార్థాల గురించి కూడా పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించిన దాఖలాలు లేవు. లడ్డూ ప్రసాదం తిన్న తర్వాత.. ఓహో ఇవి వాడారు.. అవి వాడారు.. అని అనుకోవడం తప్ప ఇంట్లో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి ఎవరూ పూనుకోలేదు. ఈ విషయం గురించి చెఫ్ ప్రవీణ్ కుమార్కు అవగాహన లేకపోవడం వల్లో లేక తిరుమల లడ్డూ ప్రసాదం ట్రెండింగ్లో ఉందనో గానీ వీడియో చేసేశాడు. వ్యూస్ అయితే వచ్చాయి గానీ విమర్శలు కూడా అంతే స్థాయిలో వచ్చే ప్రమాదం లేకపోలేదు.

హిందువులు పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదాన్ని ఇంట్లోనే తయారుచేసుకోమని సలహాలు ఇవ్వడం ఆ లడ్డూ ప్రసాదం స్థాయిని తగ్గించడమేనని కొందరు భక్తులు ఆ వీడియో కింద కామెంట్ చేస్తున్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని మండిపడుతున్నారు. తిరుపతి లడ్డూ ప్రసాదం ఇటీవల వివాదంలో చిక్కుకుంది. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ నెయ్యి వాడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు రాజకీయంగా అగ్గి రాజేసిన సంగతి తెలిసిందే.