వరంగల్ సభతో బీఆర్‌ఎస్​కు చెక్​

తెలంగాణ  చైతన్యానికి  సంకేతనామం  వరంగల్.  ఉత్తర  తెలంగాణకు అది గరిమనాభి.  తెలంగాణకు  రెండో  రాజధానిగా  ఒక  గుర్తింపు ఉన్నది.  కాళోజీ  నుంచి పీవీ  నరసింహారావు దాకా  పలువురు  సుప్రసిద్ధులకు తీర్చిదిద్దిన నేల.  స్వరాష్ట్ర  సిద్ధాంతకర్త  జయశంకర్​కు  జన్మనిచ్చిన  గడ్డ.   హక్కుల కోసం  వీర పోరాటం చేసిన సమ్మక్క, సారలమ్మల జిల్లా.   దోపిడీకి వ్యతిరేకంగా పిడికిలి బిగించిన చాకలి ఐలమ్మ  యుద్ధక్షేత్రం.  విప్లవాల ఖిల్లాగా,  రాడికల్స్ నిలయంగానూ  వరంగల్​కు  ప్రత్యేక  చరిత్ర  ఉన్నది.   

గతంలో   తెలంగాణ  రాష్ట్ర  సమితి  వరంగల్  కేంద్రంగానే  పలు  భారీ బహిరంగసభలు  నిర్వహించింది.  2001  నుంచి 2023  డిసెంబర్ దాకా వరంగల్,   కరీంనగర్, నిజామాబాద్,  ఆదిలాబాద్  జిల్లాలు  ఆ పార్టీకి  కంచుకోటగా ఉండేవి.   పీసీసీ  అధ్యక్షుడు  రేవంత్ రెడ్డి  సారథ్యంలో  జరిగిన  ఎన్నికల్లో  ఆయా  కంచుకోటలు బద్దలుకావడం  తెలంగాణ  రాజకీయ సమీకరణాలలో  కీలక మలుపు.  కేసీఆర్​ను  ఒకప్పుడు  దేవునిగా  కీర్తించిన  గ్రామీణ  ప్రాంతాలే  ఆయనను  తిరస్కరించిన  సన్నివేశం  ఆసక్తికరం.

నవంబర్ 19న  వరంగల్​లో  కాంగ్రెస్  ప్రభుత్వం నిర్వహించిన 'ప్రజాపాలన  విజయోత్సవ సభ'  సూపర్ హిట్ కావడం  రాజకీయవర్గాల్లో  చర్చనీయాంశమైంది.  ఉత్తర తెలంగాణపై  తమ పార్టీ  పట్టు  పెంచుకోవడానికి, ఆ ప్రాంతాల్లో  మరింత  పట్టు  బిగించడానికి  సీఎం రేవంత్ రెడ్డి ఈ సభను అద్భుతంగా ఉపయోగించుకున్నారు. 

వరంగల్ అభివృద్ధికి  6 వేల కోట్లకు పైగా నిధులు మంజూరు చేయడం,  బీఆర్ఎస్  పార్టీని పూర్తిగా ఆత్మరక్షణలో పడేసింది.  ‘కాళోజీ  కళాక్షేత్రం’  కేసీఆర్  హయాంలో  ప్రారంభమైనా,  నిధులివ్వకుండా నిర్లక్ష్యం చేసినందున పూర్తి కాలేదు.   కేసీఆర్  హామీలు గుప్పించి,  నిధులివ్వని  కార్యక్రమాలన్నింటినీ  రేవంత్ రెడ్డి సీఎం కాగానే యుద్ధప్రాతిపదికన  చేపడుతున్నారు. ఈ కార్యక్రమాలు  రాజకీయంగా  కేసీఆర్​పై  సీఎం రేవంత్​ పైచేయి సాధించడానికి ఉపయోగపడుతున్నాయి.  

కేటీఆర్​ చేతిలో కారు స్టీరింగ్​

కేసీఆర్  ఫామ్​హౌస్​కు  పరిమితం కావడంతో  ‘కారు’  స్టీరింగ్ వర్కింగ్  ప్రెసిడెంట్  కేటీఆర్ చేతుల్లోకి వెళ్ళింది. అయితే,   తమ  పార్టీని బలోపేతం చేయడంపైన  దృష్టి పెట్టకుండా అధికార కాంగ్రెస్ పార్టీని,  సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ  క్యాడర్,  ప్రజలను రెచ్చగొట్టే చర్యలకు  ప్రాధాన్యమిస్తున్నారు.  దీంతో  పార్టీ  పరిస్థితేమిటన్న చర్చ జరుగుతోంది.  గ్రామ స్థాయి  నుంచి  రాష్ట్రస్థాయి వరకూ నాయకులు దిక్కు తోచని స్థితిలో పడ్డారు.  వారంతా  కాంగ్రెస్‌‌‌‌ లేదా బీజేపీలో చేరడానికి  సర్దుకుంటున్నట్టు  సమాచారం అందుతోంది.  పార్టీ  బలోపేతంపై  ఫోకస్   పెట్టకపోతే   స్థానికంగా రాజకీయాలు చేయలేమని ఆందోళన  వ్యక్తమవుతున్నది.  ఉమ్మడి  నిజామాబాద్,  వరంగల్ జిల్లాలో  నెలకొన్న  పరిస్థితులను వారు ఉదహరిస్తున్నారు. ఉమ్మడి  నిజామాబాద్  ఒకప్పుడు టీఆర్ఎస్​కు  కంచుకోట. పదేండ్లుగా బలంగా ఉన్న బీఆర్​ఎస్​కు ఇపుడు ఇక్కడ   బీటలు  పడుతున్నాయి.  అటు అ సెంబ్లీ, ఇటు లోక్​సభ ఎన్నికల్లో ఆ పార్టీ చేతులెత్తేసింది. దాంతో తాజా,  మాజీ  ఎమ్మెల్యేలు  నియోజకవర్గాలకు,  క్యాడర్‌‌‌‌కు దూరంగా ఉంటున్నారు. సీఎం రేవంత్​కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త  ఆందోళనకు  పార్టీ  వర్కింగ్  ప్రెసిడెంట్  కేటీఆర్  పిలుపునిస్తే .. నిజామాబాద్ జిల్లాలో  సగానికి పైగా  నియోజకవర్గాల్లో  నిరసన జరగలేదంటే  పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

బీఆర్​ఎస్​ క్యాడర్​లో  నిరాశ

రెండుసార్లు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన  బీఆర్ఎస్  వరంగల్  ఉమ్మడి  జిల్లాను  ఆరు ముక్కలుగా చేయడం రాజకీయంగా మైనస్.    వర్థన్నపేట  మాజీ ఎమ్మెల్యే  ఆరూరి  రమేష్  కారు దిగి  బీజేపిలో   చేరడంతో  వరంగల్ 'కారు స్టీరింగ్'  పట్టుకునేవారు  లేకుండా పోయారు. కడియం సైతం కాంగ్రెస్​లో  చేరడంతో వరంగల్​లో  బీఆర్​ఎస్​ ఉనికి దాదాపు శూన్యంగా మారింది.  పార్టీని  ముందుండి నడిపించే జిల్లా అధ్యక్షుడు  లేక  పార్టీ  క్యాడర్  నిరాశలో  కూరు
కుపోయింది. బీఆర్ఎస్  అధికారం కోల్పోయాక పూర్తిగా  ప్రజలకు  దూరం అవుతోంది.  నాయకుల మధ్య సయోధ్య లేదు.  సమన్వయం లేదు.  పలువురు  ముఖ్యులు  కాంగ్రెస్‌‌‌‌లో  చేరడం బీఆర్ఎస్​ను  కుంగదీస్తోంది.  ఓడినా,  గెలిచినా  ప్రజల్లో  ఉండి  ప్రజల  పక్షాన నిలవవలసిన  నాయకులు  ప్రజల్లో  లేకుండాపోయారు.  పైగా పార్టీని  నడపడం  ఖర్చుతో   కూడుకున్న పనిగా  బీఆర్ఎస్  నాయకులు ఆలోచిస్తున్నారు. 

అస్తిత్వానికే గడ్డు పరిస్థితులు​

వరంగల్,  నిజామాబాద్ పరిస్థితులలాగానే  రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్‌‌‌‌  ఎదుర్కొంటున్నది.   కేసీఆర్ కరీంనగర్​లో  చేసిన  సింహ గర్జన  మొత్తం ఉద్యమం  టేకాఫ్  తీసుకోవడానికి కారణం.  అలాంటి  జిల్లాలోనూ  కేసీఆర్  పార్టీ  ప్రస్తుతం  గడ్డు  పరిస్థితిని ఎదుర్కొంటున్నది.  దీనికంతటికీ కారణం పార్టీ  క్యాడర్​ను  విస్మరించి కేవలం ఎమ్మెల్యేలపై  ఆధారపడడం.  తమకు  కనీస  గౌరవం,  మర్యాద  లేకుండా  చూశారని బీఆర్ఎస్  కార్యకర్తల  ఆవేదన. ఈ పరిస్థితికి  కేటీఆర్ వైఖరే  కారణమని  పార్టీ   శ్రేణులు  చెబుతున్నాయి. 

పనికిరాని కేటీఆర్​ టాస్క్ 

రేవంత్ రెడ్డిని  అప్రతిష్టపాలుజేయడమే  తన టాస్క్ లాగ  కేటీఆర్  వ్యవహరిస్తున్నట్టు  విమర్శలు  వస్తున్నాయి.  కేటీఆర్,  తన  తండ్రిబాటలోనే   ఏకపక్ష  నిర్ణయాలు తీసుకుంటున్నట్టు విమర్శలున్నాయి.  కేటీఆర్  తీరుతో  సీనియర్లు సైతం విస్తుపోతున్న పరిస్థితి నెలకొన్నట్టు  వార్తాకథనాలు ఉన్నాయి.  తండ్రిలాగే   కేటీఆర్  కూడా  సలహాలు,  సూచనలు స్వీకరించే పరిస్థితిలో లేనట్టు చర్చ జరుగుతున్నది.   ప్రభుత్వంపై  నిత్యం ఏదో   ఒక రాద్ధాంతం చేద్దామనుకుంటున్న   కేటీఆర్  పనితీరును  రాజకీయ  విశ్లేషకులు సైతం తప్పుబడుతున్నారు. 

ట్రంప్​ గెలుపుకు, కేసీఆర్ ​ఓటమికి పోలికలు

అమెరికాలో  ట్రంప్ అధికారంలోకి రావడానికి, తెలంగాణలో కేసీఆర్ అధికారం కోల్పోవడానికి ఒకింత  పోలికలున్నాయి.   అమెరికా  ఎన్నికల ఫలితాలపై వెర్మోంట్  రాష్ట్రానికి  చెందిన  ఇండిపెండెంట్  సెనెటర్  బెర్నీ సాండర్స్ ఒక బహిరంగ లేఖ విడుదల చేశాడు.  ‘శ్రామిక వర్గాన్ని వదిలేసిన  డెమొక్రాటిక్ పార్టీని  ఇప్పుడు  శ్రామిక వర్గం ఆ పార్టీని వదిలేయడంలో ఆశ్చర్యమేమీ లేదు’ అని ఆయన అన్నాడు.  అమెరికా ఎన్నికల ఫలితాలకు  ఇంతకంటే  క్లుప్తమైన,  సంపూర్ణ విశ్లేషణ ఇంకొకటి ఉండదు.  కాగా,  తెలంగాణ వాదమే కవచంగా  పుట్టి  పెరిగిన టీఆర్ఎస్.. బీఆర్ఎస్​గా  మారడం  ప్రజలు  జీర్ణించుకోలేకపోయారు.  కేసీఆర్  దురహంకారం, అత్యాశకు వ్యతిరేకంగా వారు ఓటు వేశారు.  తెలంగాణవాదులు, ఆ వాదంపై ఇప్పటికీ భ్రమల్లో ఉన్న సామాన్య జనానికి కేసీఆర్ వైఖరి నచ్చలేదు.  తెలంగాణ వాదాన్ని వదిలేసిన  కేసీఆర్ పార్టీని  ఇప్పుడు తెలంగాణవాదులు వదిలేయడంలో ఆశ్చర్యమేమీ లేదు.

బీఆర్ఎస్ ​పరిస్థితి  తలకిందులు

నిజామాబాద్ అర్బన్ పార్టీ  దాదాపుగా ఖాళీ అయ్యే  అవకాశాలు  కనిపిస్తున్నాయి.  త్వరలో  మేయర్  సైతం  పార్టీ  మారేందుకు  రంగం  సిద్ధం  చేసుకున్నట్టు  ఒక టాక్.  మాజీ  ఎమ్మెల్యేలు బిగాల,  బాజిరెడ్డి పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నట్టు  కార్యకర్తలు చెబుతున్నారు.   బీఆర్ఎస్  శ్రేణులు 'చేతిలో చెయ్యివేసే' ఆలోచనతో ఉన్నారు.  బోధన్  మాజీ  ఎమ్మెల్యే  షకీల్  అసెంబ్లీ  ఎన్నికల్లో ఓటమి  నుంచి ఇంకా తేరుకోలేక పోతున్నారు.  ఆర్మూర్‌‌‌‌,  ఎల్లారెడ్డి,  జుక్కల్  మాజీ  ఎమ్మెల్యేలు చాలా రోజులుగా  నియోజకవర్గానికి  దూరంగా ఉంటున్నట్టు  పార్టీ  శ్రేణులు విమర్శిస్తున్నారు.  ఉద్యమాల  పురిటిగడ్డగా  బీఆర్ఎస్  పార్టీకి  మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలబడ్డ ఉమ్మడి  వరంగల్​లో పార్టీకి ‘పెద్దదిక్కు’ లేరు.  2 023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత  ఆ జిల్లాలో  బీఆర్ఎస్  పరిస్థితి  తలకిందులయ్యింది. రేవంత్​వరంగల్​ సభ సక్సెస్​ చూశాక.. ఆ జిల్లాలో బీఆర్​ఎస్​ పనైపోయిందనే భావన రాజకీయ వర్గాల్లో ఇప్పటికే  ఏర్పడింది.

- ఎస్.కే. జకీర్,
సీనియర్ జర్నలిస్ట్