పత్తి పంటకు వైరస్ రాలిపోతున్న పూత, కాత

  • భారీ వర్షాలు, వాతావరణ మార్పులతో తీవ్ర ప్రభావం
  • పసుపు, ఎరుపు రంగులోకి మారుతున్న ఆకులు

మహబూబ్​నగర్, వెలుగు:వాతావరణంలో వస్తున్న మార్పులు, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పత్తి పంట దెబ్బతింటోంది. కాయ పడుతున్న సమయంలో పూత రాలిపోతోంది. ఆకులు పసుపు, ఎరుపు రంగులోకి మారిపోతున్నాయి. చేలల్లో నీరు నిల్వ ఉండడం, వాతావరణంలో తేమ పెరిగిపోవడంతో వైరస్​ సోకుతోంది. దీంతో పంట దిగుబడిపై రైతుల్లో ఆందోళన నెలకొంది.

2.30 లక్షల ఎకరాల్లో సాగు..

మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లో ఏటా వానాకాలం సీజన్​లో వరితో పాటు పత్తి సాగు చేస్తారు. చిన్నచింతకుంట, మిడ్జిల్, నర్వ, మరికల్, మక్తల్, దామరగిద్ద, అడ్డాకుల, కౌకుంట్ల, దేవరకద్ర, మాగనూరు, కృష్ణా మండలాల్లో వర్షాధార పంటగా రైతులు ఎక్కువగా ఈ పంటను సాగు చేస్తారు. ఈ ఏడు కూడా రెండు జిల్లాల్లో పత్తి సాగు సాధారణ విస్తీర్ణం 2.50 లక్షలు కాగా, 2.30 లక్షల ఎకరాల్లో సాగైంది. మే చివరి వారం నుంచే రైతులు విత్తనాలు విత్తుకోగా.. వర్షాలు లేక ఆశించిన మేర మొలకలు ఎగదలేదు జులైలో వర్షాలు పుంజుకోవడంతో సాగులో ఉన్న పంటలకు మేలు చేసింది. మొక్కలన్నీ ఏపుగా పెరిగాయి. పూత విరగకాసింది.

అయితే శుక్రవారం అర్ధరాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలు పత్తి పంటపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దాదాపు మూడు రోజులు ఏకధాటిగా భారీ వర్షం పండటంతో పత్తి చేలల్లోకి నీరు చేరింది. కొన్ని చోట్ల చేలు వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో పంటలకు వైరస్​ సోకింది. ఆకులు మాడిపోతున్నాయి. ఎరుపు, పసుపు రంగులోకి మారిపోతున్నాయి.

పూత పూసి కాయలు పడుతున్న తరుణంలో కాయలన్నీ రాలి పోతున్నాయి. మొక్కల మొదళ్లు కుళ్లిపోతున్నాయి. మరో నెల రోజుల్లో దిగుబడి స్టార్ట్​ అయ్యే సమయంలో ఈ పరిస్థితి ఏర్పడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అసలు దిగుబడి వస్తుందా? అనే అనుమానం రైతుల్లో నెలకొంది. రెండు జిల్లాల్లో ఇప్పటి వరకు 8 వేల ఎకరాల్లో వర్షాల వల్ల పంటలపై ప్రభావం పడినట్లు సమాచారం.

గతేడాది వర్షాలు లేక..

గతేడాది రెండు జిల్లాల్లో పత్తి సాగుకు రైతులు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారు. అయితే సీజన్​ మొదటి నుంచి వానలు ముఖం చాటేశాయి. దీంతో పత్తి చేన్లు ఎదగలేదు. ఆగస్టు, సెప్టెంబరు దాటినా.. మొక్కలకు కాయలు పట్టలేదు. దీంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా.. 5 నుంచి 6 క్వింటాళ్లకే పరిమితమైంది. దీంతో రైతులకు పెట్టుబడి కూడా రాలేదు. పత్తికి ధర బాగానే ఉన్నా.. సరైన దిగుబడి రాక లాస్​ అయ్యారు. ఈ ఏడాది భారీ వర్షాలతో వైరస్​ సోకుతుండటంతో దిగుబడిపై ఆందోళన చెందుతున్నారు.

ఇలా చేయండి..

పత్తి పంటకు వివిధ రకాల వైరస్​లు సోకుతున్నట్లు అగ్రికల్చర్​ ఆఫీసర్లు చెబుతున్నారు. రైతులకు పలు సూచనలు చేశారు.  చేలల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నీరు నిల్వ ఉంటే మొక్కలు చనిపోతాయి. కాల్వలు తీసి నీటిని బయటకు పంపాలి. భారీ వర్షాల వల్ల పత్తి పంటలో ఎండు తెగులు ఎక్కువవుతోంది. దీని నివారణకు కార్బండైజం ఒక గ్రాము లీటరు నీటిలో కలిపి తెగులు ఆశించిన మొక్కలతో పాటు ఆరోగ్యంగా ఉన్న మొక్కల మొదళ్ల వద్ద పోయాలి.

గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే ఆకు మచ్చ, కాయ కుళ్లు తెగుళ్లు వచ్చే అవకాశం ఉంది. కాయకుళ్లు తెగులు ఆశిస్తే దిగుబడిపై ప్రభావం పడుతుంది. ఆకుమచ్చ తెగులుతో పాటుగా ఆల్టేనేరియా ఆకుమాడు, కాండం మాడు తెగులు కూడా సమస్యాత్మకంగా మారే అవకాశం ఉంది. వీటి నివారణకు కార్బంబైజం, మాంకోజెబ్ 500 గ్రాములు లేదా ట్రైప్లాక్సిస్టోబిన్, టేబుకోనజోల్ 80 గ్రాములను ఒక ఎకరానికి పిచికారి చేయాలి. కాయ కుళ్లు నివారణకు కాపర్  ఆక్సి క్లోరైడ్  600 గ్రా, స్ర్టెటోమైసిన్​ సల్ఫేట్​60 గ్రాములు ఒక ఎకరానికి పిచికారి చేయడం వల్ల తెగులు బారి నుంచి చేలను 
కాపాడుకోవచ్చు.

చేను ఊట ఎక్కింది..

నాకు రెండెకరాల పొలం ఉంది. ఇది మొత్తం ఇసుక నేల. రూ.60 వేలు ఖర్చు చేసి పత్తి పంట సాగు చేసినా. శుక్రవారం రాత్రి నుంచి సోమవారం వరకు వర్షం కురిసింది. దీంతో నా చేను ఊట ఎక్కింది. దీంతో పత్తి చేను మొత్తం నాశనమైంది. - సాదు వెంకటయ్య, అచ్చంపేట, మాగనూరు మండలం


పిందెలు రాలిపోతున్నాయ్..

నాకు నాలుగెకరాల పొలం ఉంది. మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకున్న. పది ఎకరాల్లో పత్తి పంట వేశా. ఐదు రోజులుగా పడిన వర్షాలతో పంటకు వైరస్​ సోకింది. పత్తి ఆకులు ఎర్రగా అయి పిందెలు రాలిపోతున్నాయి. 
- సుప్ప నర్సిరెడ్డి, ఊట్కూర్