- క్రాస్ ఎగ్జామినేషన్‌లో మాజీ ఈఎన్సీ మురళీధర్ అంగీకారం
- బ్యారేజీల వైఫల్యానికి క్వాలిటీ చెక్ లేకపోవడం కూడా కారణమే
- నాలుగేండ్లలో ఒక్కసారే తనిఖీలు చేయడం తప్పేనని వెల్లడి
- మాజీ ఈఎన్సీపై కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ప్రశ్నల వర్షం
హైదరాబాద్, వెలుగు : గత బీఆర్ఎస్ సర్కారు ఆదేశాల మేరకే కాళేశ్వరం డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్)లో మార్పులు, చేర్పులు చేయాల్సి వచ్చిందని కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ముందు మాజీ ఈఎన్సీ సి.మురళీధర్ అంగీకరించారు. బ్యారేజీల వైఫల్యానికి క్వాలిటీ కంట్రోల్ కూడా కారణమే అని, బ్యారేజీల నిర్మాణం జరిగిన నాలుగేండ్లలో ఒక్కసారి మాత్రమే తనిఖీలు చేయడం తప్పేనని ఒప్పుకున్నారు.
కాళేశ్వరంపై విచారణలో భాగంగా బుధవారం నుంచి జ్యుడీషియల్ కమిషన్ ఓపెన్ కోర్టు నిర్వహిస్తున్నది. క్రాస్ ఎగ్జామినేషన్‌లో భాగంగా మొదటిరోజు మాజీ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్‌పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది.
ముందు ఆయనతో జస్టిస్ పీసీ ఘోష్ ప్రమాణం చేయించారు. ఆ తర్వాత మురళీధర్ ఇచ్చిన ఆఫిడవిట్ చూపించి.. ‘ఇది మీరు ఇచ్చిందే కదా? ఈ సంతకాలు మీవేనా ?’ అని పీసీ ఘోష్అడిగారు. ఆ తర్వాత సుమారు 2 గంటల పాటు కమిషన్క్రాస్ఎగ్జామినేషన్చేసింది. వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతుంటే.. ఎప్పటికప్పుడు ఎందుకు తనిఖీలు చేయలేదని మురళీధర్ ను కమిషన్ నిలదీసింది. ‘‘2016 నుంచి 2020 దాకా బ్యారేజీల (మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల) నిర్మాణం జరిగితే..
వరంగల్ లోని క్వాలిటీ కంట్రోల్ విభాగం ఒక్కసారి మాత్రమే తనిఖీ చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి. 3 నెలలకు ఒకసారి క్వాలిటీ కంట్రోల్ తనిఖీలు చేసి, పనులు నాణ్యతా ప్రమాణాలకు లోబడే జరుగుతున్నాయా ? లేదా ? అనే విషయాన్ని నిర్ధారించాల్సి ఉండగా, నాలుగేండ్లలో కేవలం ఒక్కసారి మాత్రమే తనిఖీలు చేసి, పనులు క్వాలిటీగా జరిగాయని ఏ విధంగా నిర్ధారించారు?’ అని కమిషన్ ప్రశ్నించింది. దానికి మురళీధర్ బదులిస్తూ బ్యారేజీల వైఫల్యానికి క్వాలిటీ కంట్రోల్ వైఫల్యం కూడా కారణమని, 2 వారాలకు ఒకసారి తనిఖీలు జరగాల్సి ఉండగా..
ఆ పని చేయలేదని సమాధానం ఇచ్చారు. ‘‘ క్వాలిటీ కంట్రోల్ పరీక్షలు చేయించకుండా చెల్లింపులు చేశారా? రూ.1,342.72 కోట్ల పనులకు ఏ ప్రాతిపదికన చెల్లింపులు జరిపారు? రిజిస్టర్లలో ఎందుకు మార్పులు చేశారు?’ అని కమిషన్ ప్రశ్నించింది. బిల్లుల చెల్లింపుల్లో కూడా ఎందుకు మార్గదర్శకాలు పాటించలేదని నిలదీసింది. ‘‘హైపవర్ కమిటీ వేసిన తర్వాతే కాళేశ్వరంపై నిర్ణయం తీసుకున్నారా? హైపవర్ కమిటీని ఎప్పుడు వేశారు ? కాళేశ్వరం డీపీఆర్ ను అనుమతి కోసం సీడబ్ల్యూసీలో దాఖలు చేశాక.. ఎవరి ఆదేశాల మేరకు మార్పు చేశారు? ఎందుకు చేశారు?’’ అని కమిషన్ ప్రశ్నించింది. ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకాన్ని రీ డిజైన్ చేసి, కాళేశ్వరం లిఫ్టు స్కీమ్‌ను అప్పటి ప్రభుత్వం చేపట్టిందని
డీపీఆర్ ను వ్యాప్కోస్ తయారు చేసిందని మురళీధర్ సమాధానం ఇచ్చారు. కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ)లోని పలు విభాగాలు 17 రకాల అనుమతులు ఇచ్చాకే కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలోని టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) ప్రాజెక్టుకు క్లియరెన్స్ ఇచ్చిందని చెప్పారు. ఆ తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకే డీపీఆర్‌లో మార్పులు జరిగాయని మురళీధర్ బదులిచ్చారు.
పనులు పూర్తవ్వకుండా సర్టిఫికెట్ఎలా ఇచ్చారు?
‘‘2020 జూన్ 29న బ్యారేజీల నిర్మాణం పూర్తయితే.. 2019 సెప్టెంబర్‌లోనే సబ్ స్టాన్షియల్ కంప్లీషన్ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారు?’’ అని మురళీధర్‌ను కమిషన్ ప్రశ్నించింది. ‘‘బ్యారేజీల నిర్మాణం పూర్తికాకపోయినా, వినియోగానికి సరిపడేంత పని జరిగిందని నిర్ధారిస్తూ సబ్ స్టాన్షియల్ కంప్లీషన్ సర్టిఫికెట్ ఇవ్వవచ్చా? టెండర్ నిబంధనలకు సంబంధించిన క్లాజుల్లో దీని ప్రస్తావన ఉందా? బ్యారేజీల నిర్మాణం జరుగుతున్న సమయంలో ఏయే రిజిస్టర్లను నిర్వహించాల్సి ఉంటుంది? పనులు పూర్తి కాకున్నా.. వినియోగానికి సరిపడేంత పని జరిగిందని సర్టిఫికెట్లు ఇచ్చే మార్గదర్శకాలు ఉన్నాయా?
ఉంటే చూపించండి’’ అంటూ నిలదీసింది. ఈఈ సర్టిఫికెట్ జారీ చేస్తే.. దానిపై సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ), చీఫ్ ఇంజినీర్ (సీఈ) కౌంటర్ సంతకాలు చేస్తారా ? అని ప్రశ్నించింది. ఇండియన్ స్టాండర్డ్ (ఐఎస్) కోడ్ అనుసరించి కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణం జరిగిందా? అని అడిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎవరు అనుమతిచ్చారు? ఒక్కో కాంపోనెంట్ అంచనాలను ఎవరు తయారు చేశారు? పరిపాలన అనుమతులకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కారణమా? అని కమిషన్ ప్రశ్నించింది. పరిపాలనాపరమైన అనుమతులను హెచ్ఓడీఏ ఇచ్చిందని
సంబంధిత ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్లే కాంపోనెంట్ వారీగా అంచనాలను తయారు చేశారని, సబ్ స్టాన్షియల్ సర్టిఫికెట్ ఇచ్చే అధికారం కానీ, క్లాజు కానీ లేదని మురళీధర్ తెలిపారు. బ్యారేజీల నిర్మాణ సమయంలో క్వాలిటీ కంట్రోల్ అధికారులు, క్షేత్రస్థాయి ఇంజినీర్ల వైఫల్యం కనిపిస్తున్నదని, నిర్మాణం జరుగుతున్నప్పుడు ఏ క్లాజును, ఐఎస్ కోడ్ ను పాటించలేదని కమిషన్ గుర్తు చేసింది.
లోపాలు జరిగినయ్ : మురళీధర్
2016 జూన్‌లో బ్యారేజీ నిర్మాణ పనులు ప్రారంభించగా..2019 జూన్‌లో పనులు జరిగిన తర్వాత 2019 నవంబర్ వరదల అనంతరం గేట్లు మూసినప్పుడు లోపాలు బయటపడ్డాయని, ఆ సమయంలో ఏయే చర్యలు తీసుకోవాలనే దానిపై ఏమైనా ఆదేశాలు ఇచ్చారా? అని మురళీధర్‌ను కమిషన్ ప్రశ్నించింది. బ్యారేజీల డిజైన్లు సిద్ధం చేయడానికి ముందు నమూనా అధ్యయనాలు జరిగాయా? జియో టెక్నికల్, జియో ఫిజికల్ పరీక్షలు చేశారా? అని అడిగింది. మురళీధర్ స్పందిస్తూ.. టెస్టులకు తగిన సమయం తీసుకోలేదని
ఏమేం లోపాలు జరిగాయో వాటిని సరిచేయాలని మాత్రం ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. పనులు జరుగుతున్న క్రమంలో అంచనాలను, డ్రాయింగ్లను సవరించారా? డిజైన్లు, డ్రాయింగ్ లకు మధ్య తేడాలు ఉన్నాయా? వీటిని జారీ చేసిన తర్వాత అన్నారం, సుందిళ్లలో పనుల్లో మార్పులు చేర్పులు జరిగాయా? అని కమిషన్ ఆరా తీసింది. డిజైన్ కు తగ్గట్టుగా డ్రాయింగులు ఉంటాయని, తేడాలు లేవని మురళీధర్ బదులిచ్చారు. మరి బ్యారేజీల డిజైన్, డ్రాయింగ్‌లో పొందుపర్చిన విధంగా నిర్మాణ సంస్థ షీట్ఫైల్స్ను వినియోగించాల్సి ఉండగా..
సీకెంట్ ఫైల్స్ ఎందుకు వాడారని కమిషన్ ప్రశ్నించింది. నిర్మాణం జరుగుతున్న టైంలో ఈ విధంగా మధ్యలో మార్పులు చేయవచ్చా? అని అడిగింది. సీకెంట్స్ ఫైల్స్‌తో ఖర్చు ఎక్కువ ఉంటుందని, రాఫ్ట్(పునాది)కి రక్షణగా షీట్ ఫైల్స్ వాడతారని, పనులు జరుగుతున్నప్పుడు అనుకూలతను బట్టి సీకెంట్ ఫైల్స్ వాడినట్టు తెలుస్తున్నదని మురళీధర్ సమాధానం ఇచ్చారు. అంచనాలను ఏలా తయారు చేస్తారు?
అని కమిషన్ ప్రశ్నించగా.. పనుల ఆధారంగా అంచనాలు సిద్ధమవుతాయని బదులిచ్చారు. దాంతోపాటు నమూనా అధ్యయనాల అనంతరమే డిజైన్, డ్రాయింగ్లు సిద్ధమయ్యాయని మురళీధర్ వెల్లడించారు.